26, జూన్ 2014, గురువారం

మోడీ నెల పాలన


కేంద్రంలో మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా V-6 ఛానల్  నిన్న (25-06-2014) రాత్రి ఏడు గంటలకు ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. నాతొ పాటు కాంగ్రెస్ రాజ్య సభ సభ్యులు శ్రీ రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ తరపున శ్రీ శ్రీ రామ్ పాల్గొన్నారు. యాంఖర్ శ్రీ బుచ్చన్న.


'అరవై నెలల్లో ఒక నెల గడిచింది. అడుగులు వడివడిగా పడకున్నా తడబడకుండా వున్నందుకు సంతోషించాలి.(అప్పటికి గ్యాస్ ధరల పెంపు నిర్ణయం వాయిదా ప్రకటన వెలుగులోకి రాలేదు) అయిదేళ్ళు పాలించే  ప్రభుత్వ పనితీరును నెల పాలనతో ముడిపెట్టి అంచనా వేయడం సరికాదు. కాకపొతే స్థాలీపులాకన్యాయంగా కొన్ని మంచి చెడులను ప్రస్తావించుకోవచ్చు. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం వెనక్కి రప్పించడానికి తీసుకున్న చొరవ శ్లాఘనీయం. కానీ ఇది కంటి తుడుపు చర్యగా మిగిలిపోరాదు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పరచుకునే దిశగా తీసుకుంటున్న చర్యలని  స్వాగతించాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు వాటిని తీసుకుని ప్రజలకు నచ్చచెప్పగలగాలి. అననుకూలంగా పరిణమించే అంశాలు వచ్చినప్పుడు నెపాన్ని కాంగ్రెస్ పై మోపే పద్దతి మంచిది కాదు. మంచి చెడులకు రెంటికీ బాధ్యత వహించే ధీమంతం వుండాలి. రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి కాని ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు. 'అప్పుడు కాంగ్రెస్ ఇదే పని చేసింది కదా' అని తప్పించుకునే ప్రయత్నం పనికిరాదు.'

కామెంట్‌లు లేవు: