16, జూన్ 2014, సోమవారం

సరిగ్గా పాతికేళ్ళ తరువాత పునరావృతం

సరిగ్గా పాతికేళ్ళ తరువాత పునరావృతం
1989 లో జరిగింది. మళ్ళీ 2014 లో.
కాకపోతే అప్పుడు కాకలు తీరిన రాజకీయ యోధుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఎంపిక చేసుకున్నారు. ఇన్నేళ్ళకు మళ్ళీ,  తెలంగాణా స్వప్నాన్ని సాకారంచేసుకుని  ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీయార్ కూడా అదే వ్యక్తిని అదే పదవికి ఎంపిక చేసుకోవడం కాకతాళీయం కావొచ్చేమో!  కాని దానికి పూర్తి మార్కులు మాత్రం అతగాడికే వెయ్యాలి. కేవలం ప్రతిభ కారణంగానే పదవిని పొందడం అనేది  జ్వాలాగా చిరపరిచితుడైన వనం జ్వాలా నరసింహారావుకు వెన్నతోబెట్టిన విద్య. ఆ ప్రతిభను పసికట్టే ఆనాటి  ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తన వద్ద పీఆర్వోగా నా మిత్రుడు, చిన్నతనంలో సహాధ్యాయి అయిన జ్వాలాను  స్వయంగా ఎంపిక చేసి  నియమించుకుంటే, ఇప్పడు తిరిగి అదే పదవికి తెలంగాణా ముఖ్యమంత్రి  శ్రీ కె.చంద్ర శేఖర రావు గారు అదే పని చేసి తన పేషీ నుంచి పౌర  సంబంధాలను ఆజమాయిషీ చేసే గురుతర భారాన్ని ఆ జ్వాలాకే అప్పగించారు.


ఒకనాడు చేసిన ఉద్యోగమే కాని అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మీడియా విస్తరణ, మాధ్యమాల నిర్వహణ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. కొత్త సవాళ్ళ మధ్య కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఈ నేపధ్యంలో పౌర సంబంధాలు, పేరుకు పౌర సంబంధాలు కానీ నిజానికి పత్రికా సంబంధాలు అనడమే సముచితం, వీటిని సజావుగా నిర్వహించడం ఎవరికయినా కత్తి  మీద సామే. అయితే పూర్వం సముపార్జించుకున్న అనుభవమే ఆయనకు శ్రీరామ రక్షగా అక్కరకువస్తుంది.

ఈ బాధ్యతల నిర్వహణలో జ్వాలా సంపూర్ణంగా విజయం సాధించాలని మనసారా  కోరుకుంటూ, శుభాకాంక్షలు.                

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

జ్వాలా గారికి శుభాకాంక్షలు. Most deserving candidate.

తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో అలుపు ఎరగని పటిమతో ప్రత్యర్థి దాడులను తిప్పికొట్టిన యోధులు వారు. వారికి ఉచిత పదవి ఇచ్చి తెలంగాణా రాష్ట్రం తన్ను తానె సత్కరించుకుంది.