24, ఫిబ్రవరి 2013, ఆదివారం

నిర్లక్ష్యంలో సమన్వయంహైదరాబాదులో గత గురువారం సాయంత్రం జరిగిన ఘోర కలి గురించి రెండు  మూడు రోజులుగా అనేక టీవీ ఛానళ్ళు వరసగా పలు చర్చా కార్యక్రమాలను ప్రసారం చేసాయి. వాటిల్లో పాల్గొన్న సందర్భాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఇది అక్షర రూపం.


“ఉగ్రవాద ఘాతుకాలను శత్రు దేశం సాగించే యుద్ధంతో సమానంగా పరిగణించాలి. ఈ చర్యలకు బలై పోయినవారినీ, అంగవైకల్యం పొందినవారినీ ప్రభుత్వం ప్రత్యేక తరగతిగా గుర్తించి ఆదుకోవాలి. మరణించిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి యాభై వేలు అనే షరా మామూలు ప్రకటనలతో సరిపుచ్చకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి లేదా గాయపడిన వీర సైనికులకు అందచేస్తున్న తరహాలో వారికీ, వారి కుటుంబాలకు శాశ్విత  ప్రాతిపదికన సాయం అందించాలి. ‘గాయపడిన వారికి మెరుగయిన వైద్య సాయం అందించాలని  అధికారులను ఆదేశించాం’ అంటూ చేస్తున్న ప్రకటనలను  టీవీల్లో చూస్తూ, గతంలో జరిగిన సంఘటనల్లో అంగవైకల్యం పొంది ఇప్పటిదాకా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు ఎంతగా రగిలిపోతుంటారో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక బాధ్యతగా టీవీ ఛానళ్ళు అలనాటి దురదృష్టవంతుల దీన గాధలను మరోమారు ప్రసారం చేసి ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలి.”
“ దిల్ సుఖ్ నగర్ ఘాతుకానికి సంబంధించి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ. నిఘావిభాగం ముందస్తుగా చేసిన హెచ్చరికలు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటవెంటనే తెలియచేసామని చెప్పి ఆయన చేతులు కడిగేసుకున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థల బృందాలను హైదరాబాదు పంపుతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. మొత్తం దేశానికి హోం మంత్రి అయిన ఆయన తనకు అందిన సమాచారాన్ని బట్వాడా చేసి వూరుకోకుండా మరికొన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుని వుంటే కొంత ప్రయోజనం వుండేది. అలా కాకుండా సంఘటన జరిగిన తరువాత హైదరాబాదు వచ్చివెళ్లడం కేవలం కంటితుడుపు చర్యగా జనం భావిస్తే తప్పుపట్టాల్సింది వుండదు.”
“కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలను రొటీన్ వ్యవహారంగా భావించామని, ఇంత ఘోరం జరుగుతుందని వూహించ లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి అన్నట్టు  ఈ ఉదయం పత్రికల్లో, మీడియా స్క్రోలింగు లలో వచ్చింది. ఇదే నిజమయితే, బాధ్యతారాహిత్యానికి అసలు సిసలు పరాకాష్ట అనే చెప్పాలి.”
“ఈ దుర్ఘటనకు నిరసనగా భారత్ బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపు ఇవ్వడం సహేతుకంగా లేదు. ప్రజలు ఆందోళనలో వున్నప్పుడు వారికి బాసటగా నిలవాలే కాని, బంద్ లు, రాస్తా రోఖోలు వంటి కార్యక్రమాలద్వారా వారి ఇబ్బందులను మరింత పెంచకూడదు. ప్రతిపాదిత సడక్ బంద్ ను వాయిదా వేసుకుంటున్నట్టు టీ ఆర్ ఎస్ ప్రకటించడం హర్షనీయం.”
“షిండే వచ్చివెళ్ళారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు  రాజనాథ్ సింగ్ వస్తున్నారు. పాదయాత్రకు విరామం ఇచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాదు వస్తున్నట్టు ఇప్పుడే టీవీ స్క్రోలింగు లలో వస్తోంది. రేపో మాపో ప్రధానమంత్రి రావచ్చు. ఇతర రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా వెనుకబడే ప్రసక్తి వుండదు. ఇంతమంది వచ్చి చేసేదేమీ వుండదు. కానీ రాజకీయంగా వారికిది తప్పనిసరి. వస్తే, వీరు వచ్చి చేసిందేమిటి అంటారు.రాకపోతే వీళ్ళకు జనం ప్రాణాలు అంటే పూచికపుల్లలతో సమానం అని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. అందువల్ల రాకతప్పదు. ఆలాంటప్పుడు అనుచరగణంతో హడావిడి చేయడం కాకుండా, విధి నిర్వహణలో వున్న పోలీసులను ఇబ్బంది పెట్టకుండా బాధితులను పరామర్శించి వెళ్ళే పద్ధతికి స్వీకారం చుట్టాలి. వూరికే వచ్చాం,చూసాం,వెళ్ళాం అని కాకుండా తమ పార్టీల తరపున బాధితులకు ఎంతో కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తే బాగుంటుంది.”
“పేలుడు సంఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం ప్రధాన పత్రికల్లో ప్రచురించిన ఫోటోలు చూడండి. శరీరాలు చిద్రమై రోడ్డున పడివున్నవారి దాపుల్లో అక్కడక్కడా మంటలు చెలరేగుతూనే వున్నాయి. అంటే పేలుడు జరిగిన కొద్ది సేపటిలోనే మీడియా వారు అక్కడికి చేరుకొని ఫోటోలు తీయగలిగారు. ఆ ఫోటోలను పరికించి చూస్తే ఒక్క పోలీసు జవాను కూడా కనబడడు. పేలుడు జరిగిన తరువాత కొద్ది గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. అప్పుడు ఎక్కడ చూసినా పోలీసులే. రోప్ పార్టీలతో కూడిన రక్షణ వలయాలే.”
“ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడం అమెరికాకే సాధ్యం కాలేదు. కాని జరిగిన తరువాత ఏం చేయాలి అన్న విషయంలో మన దగ్గర ఇంకా అయోమయమే. సమన్వయ లోపం కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. పోనీ ఇది మొదటిసారా అంటే కాదు. గతంలో కూడా జరిగాయి. కానీ వాటి నుంచి గుణ పాఠాలు నేర్చుకున్న దాఖలా కనబడడం లేదు. ఉగ్రవాదులకు హైదరాబాదు అడ్డాగా మారిందని అంతా అంటూ వుంటారు. కానీ చేతల్లో పూజ్యం.”
“ఇలాటి సంఘటనలు పునరావృతం కానివ్వమన్న ప్రకటనలే  పునరావృతం అవుతుంటాయి. పేలుళ్లు సరేసరి. అసమర్ధ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ప్రత్యర్ధులు అంటుంటారు. వారు అధికారంలో వున్న రోజుల్లో కూడా ఇలాటి ఉగ్రవాద దాడులు జరిగిన సంఘటనలు మాత్రం మరచిపోతుంటారు. రాజకీయ జోక్యం లేకపోతే వీటిని అరికట్టడం సాధ్యమని రాజకీయ నాయకులే చెబుతూ వుండడం విడ్డూరం.”
“సీ.సీ. కెమెరాల సాయంతో మొన్నటికి మొన్న సైబరాబాదు పోలీసులు ఒక మహిళపై అత్యాచారం చేయబోయిన దుండగులను  ఇరవై నాలుగు గంటలు గడవకముందే అరెస్టు చేశారు. మరి, దిల్ సుఖ్  నగర్ లో సీ.సీ. కెమెరాల వైర్లు ఎవరో రెండు రోజులక్రితమే కత్తిరించారని అంటున్నారు. తీగెలు  కత్తిరిస్తే, ఆ ఫుటేజ్ ని ఎప్పటికప్పుడు కనిపెట్టి చూడాల్సిన సిబ్బంది ఏమి చేస్తున్నట్టు. పలానా ప్రాంతం నుంచి కొన్ని రోజులుగా  ఒక్క దృశ్యము రికార్డు కాలేదని యెందుకు తెలుసుకోలేకపోయారు?  అలాగే పోలీసు కమీషనర్  సాయిబాబాబా గుడికి వెళ్లడం వల్ల అక్కడ పోలీసుల హడావిడి గమనించి ఉగ్రవాదులు తమ టార్గెట్ ప్రాంతాన్ని మార్చుకున్నారని అంటున్నారు. అంటే ఏమిటి, పోలీసుల నిఘా వుంటే ఉగ్రవాదుల ఆటలు సాగవనే కదా. ఉగ్రవాద దాడిని గురించి ముందస్తు సమాచారం వున్నప్పుడు దాన్నేదో అతి రహస్యం కింద దాచిపెట్ట కుండా  అమెరికా వాళ్లు తమ పౌరులను హెచ్చరించినట్టు నగరంలో రద్దీగా వుండే ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేసి వుండాల్సింది. పోలీసులను మోహరించి, పోలీసు జాగిలాలను ఆయా ప్రాంతాలలో తిప్పి  వుండాల్సింది.”  (24-02-2013)
(సాక్షి, దూరదర్శన్ సప్తగిరి,  హెచ్.ఎం.టీ.వీ.,  టీవీ -5,  స్టుడియో ఎన్, వీ 6 న్యూస్, మహా టీవీల సౌజన్యంతో) 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ముందస్తు సమాచారం నిఘా సంస్థలు రొటీన్‌గా ఇస్తూనే వుంటాయి. హైదరాబాద్తో పాటు మరో 10 సిటీలకు ఇచ్చాయి అక్కడ ఏమీ జరగలేదు. ఇలాంటి సమాచారం ఎలా వుపయోగ పడుతుంది?
మీ అభిప్రాయాలే అనదరివి. తెరాస, భాజపాలది శవాల మీద పైసలేరుకునేంత నీచ రాజకీయం. బంద్ చేయడం ఎవరిని వుద్ధరించడానికి?