5, ఫిబ్రవరి 2013, మంగళవారం

స్త్రీ సాహసంస్త్రీ సాహసం

నిజానికిది  టెలిగ్రాఫ్ పత్రికలో చాలా వివరంగా వచ్చిన కధనమే. సంక్షిప్తీకరించి తెలుగులో రాయడానికి చేసిన ప్రయత్నం ఇది.
చందా జవేరీ అనే అనే కలకత్తా ఆవిడ అమ్మాయిగా వున్నప్పుడు ఓ సాహసకృత్యానికి పూనుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత  అదేమిటో ఆవిడ  తన మాటల్లోనే ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  వెల్లడించింది. ఇప్పుడే యెందుకు? ఇన్నేళ్ళ తరువాత యెందుకు? అంటే ఇన్ని సంవత్సరాలుగా చందా జవేరీ గారు అమెరికాలోనే వుండిపోయారు కాబట్టి, ఈ మధ్యనే ఆవిడ స్వదేశం వచ్చి వెళ్లారు కాబట్టి అనేది ఆ పత్రిక వివరణ.
అంచేత ఆవిడ కధా కమామిషూ తెలుసుకోవాలంటే ఓ ముప్పయ్యేళ్ళ పై చిలుకు వెనక్కు వెళ్ళాలి.
అప్పుడు ఆవిడ, అంటే 49 ఏళ్ళ  చందా జవేరీ 17 సంవత్సరాల ప్రాయంలో పెళ్లి కాని  అమ్మాయిగా వున్నప్పుడు  ఓ సాహసం చేసింది. ఇప్పుడావిడను గురించి ఇంతగా చెప్పుకుంటున్నారంటే అదే కారణం.
సాధారణ మరాఠా అమ్మాయిగా జీవితం గడుపుతున్న  చందా జవేరీకి పెళ్లీడు వచ్చిందని పెళ్లి చేసేయాలని తలితండ్రులు తొందర పడుతున్న సమయంలో ఆమె తీసుకున్న ఓ తొందరపాటు నిర్ణయం తలితండ్రుల్ని గందరగోళంలోను, ఆమె జీవితాన్ని సుందర మార్గంలోనూ పడవేసింది. 1984 వ సంవత్సరంలో కలకత్తాలోని పార్క్ స్ట్రీట్ లో ఆమెకు విదేశీ టూరిస్టు దంపతులు పరిచయం కాకతాళీయంగా జరిగినా, ఆ పరిచయమే ఆమె జీవితంలో పెనుమార్పులకు దారి తీసింది. అదేమిటో ఆమె మాటల్లోనే –

చందా జవేరీ 

‘మాది ఓ సాధారణ  మధ్య తరగతి కుటుంబం. వివేకానంద నగర్ లోని బాలికా శిక్షా సదన్ లో హైస్కూలు  చదువు పూర్తిచేసాను. మా ఇళ్ళల్లో ఆడపిల్లలకు అదే పెద్ద చదువు. కాలేజీకి పంపించడం వుండదు. పెళ్ళిచేసి  అత్తారింటికి పంపించేస్తారు. అలాగే  మా అమ్మానాన్నా కూడా నాకొక సంబంధం ఖాయం చేశారు. నాకేమో పై చదువులు చదవాలని వుంది. ఏంచేయాలో తెలియని స్తితిలో ఇంటి నుంచి పారిపోయాను.
‘అంతకు ముందు స్కూలుకు వెళ్ళేటప్పుడు అమెరికన్ లైబ్రరీకి కూడా వెడుతుండేదానిని. ఒకరోజు దానికి దగ్గర్లో తిరుగాడుతున్న ఓ అమెరికన్ మహిళ ఎండ వేడిమి తట్టుకోలేక  వీధిలోనే శోష వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. నేను ఆమెకు సపర్యలు చేసి ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఆ సంఘటనతో  ఆమె భర్త డేవిడ్ కు నాపట్ల సదభిప్రాయం కలిగింది. ఆ పరిచయంతో అమెరికాలోని వాళ్ల ఫోన్ నెంబరు ఇచ్చాడు.
‘ఇంటి నుంచి బయటపడి దిక్కుతోచని స్తితిలో వున్న నాకు కేరెన్ దంపతులు గుర్తుకు వచ్చారు. ఏమయితే అయిందని డేవిడ్ కు ఫోను చేశాను. ఇప్పట్లోలా అప్పట్లో  ఇన్ని కమ్యూనికేషన్  సౌకర్యాలు లేవు. పబ్లిక్ బూతు నుంచి ప్రయత్నిస్తే అతి కష్టం మీద లైన్ దొరికింది. డేవిడ్ గారికి ముందు నేనెన్వరో చప్పున గుర్తు రాలేదు. వచ్చిన తరువాత  ఏమనుకున్నారో యేమో కాని స్పాన్సర్ లెటర్ పంపడానికి అంగీకరించారు.
‘దాన్ని  తీసుకుని అమెరికన్ కాన్సులేట్ కు వెళ్లాను. వీసా అధికారి నన్ను ఎగాదిగా చూశాడు. ‘చూస్తే  చాలా చిన్నపిల్ల లాగా వున్నావు. నీకు వీసా ఇవ్వడం కుదరదు’ అనేశాడు. నాకు ఎక్కడలేని కోపం వచ్చేసింది.
‘ఏం! మీ అమెరికా ఏవన్నా స్వర్గలోకమా? అక్కడికి వెళ్ళినవాళ్ళు తిరిగిరాకుండా అక్కడే వుండిపోవడానికి అవటా !’ అని కడిగి పారేశాను. ఏవనుకున్నాడో యేమో అతగాడు ఓ మందహాసాన్ని నా మొహం మీద పారేసి, ఏదో నవ్వుతాలకు అన్నాను ఏమనుకోకు’ అంటూ   అయిదేళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇచ్చేసాడు.
‘అంతే!  అమెరికాకు ఎగిరిపోయాను.  దిగిన తరువాత గాని తత్వం బోధపడలేదు. పర్సులో పైసాలేదు. వున్న ఇండియన్ కరెన్సీ కాస్తా కలకత్తా ఎయిర్ పోర్ట్ అధికారులు నిబంధనల పేరుతొ తీసేసుకున్నారు. అమెరికాలో మళ్ళీ డేవిడ్ దంపతులే ఆదుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఇంటికి తీసుకువెళ్ళారు. దుస్తులు కొనిపెట్టారు.
‘జీవిక కోసం,  వొంటరిగా జీవిస్తున్న ఓ  వృద్ధురాలి ఆలానా పాలనా చూసే పని తలకెత్తుకున్నాను. దురదృష్టం. నేను పనిలో చేరిన మరునాడే ఆవిడ వృద్ధాప్యంతో కన్నుమూసింది. ఆమె డైరీలో వున్న నెంబరు చూసి హవాయిలోవున్న ఆమె కుమారుడికి ఫోన్ చేసి తల్లి మరణవార్త తెలిపాను. ఆమె మరణం కంటే అతడిచ్చిన జవాబు నన్ను బాగా కుంగ తీసింది. ‘శవాలను  ఖననం చేసే వారికి కబురుచేస్తే వాళ్ళే చూసుకుంటారు’ అన్నది అతగాడి సమాధానం.  అమెరికన్ల జీవితంలో దాగున్న ఓ విషాద కోణాన్ని ఈ సంఘటన నాకు బోధపరిచింది.
‘సరే! మరో వృద్ధురాలు నన్ను పనిలోకి తీసుకుంది. ఆమె వయస్సు తొంభయ్ ఎనిమిది సంవత్సరాలు. దయకల తల్లి. చదువుపట్ల నా ఆసక్తిని గ్రహించి హార్వర్డ్ యూనివర్సిటీ లో చేరమని ముప్పయి వేల డాలర్లు ఇచ్చి ప్రోత్సహించింది.
‘అంతే! మళ్ళీ వెనక్కు తిరిగిచూడాల్సిన అగత్యం పడలేదు.
‘నోబుల్ బహుమతి గ్రహీత  లీనస్  పాలింగ్ తో  పరిచయం నా జీవితాన్ని మరో అద్భుతమైన మలుపు తిప్పింది. రసాయన శాస్త్రంలో రెండు పర్యాయాలు ఈ విశేష పురస్కారాన్ని పొందిన ఏకైక శాస్త్రవేత్త ఈయన ఒక్కరే.
‘లాస్ ఏంజెల్స్ లో నేను స్థాపించిన కంపెనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. డేవిడ్ కు బాగా తెలిసిన అమెరికన్ దంపతులు నన్ను దత్త పుత్రికగా స్వీకరించారు. నన్ను కన్న తలిదండ్రులను కూడా ఒకసారి ఆ దేశానికి రప్పించాను. ఒకరోజు తమ  మనసుల్ని నొప్పించి ఇంటి నుంచి బయటకు వచ్చేసిన  కన్న కూతురు సాధించిన  ఎదుగుదలను చూసి వారు కూడా ఎంతో సంతోషించారు. ‘అమెరికా అంటే ఎం టీవీ ఒక్కటే కాదు, అక్కడా హృదయం వున్న మనుషులు వున్నారని వాళ్లు గ్రహించగలిగారు.
‘ఇప్పటికీ కలకత్తా అంటే చెప్పలేని అభిమానం.  సాల్ట్ లేక్ లో ఇల్లు కట్టుకున్నాను. నేను చిన్నారిగా వున్నప్పటి నగరానికి ఇప్పటికీ ఎంతో తేడా కనబడుతోంది. నా రోజుల్లో మార్వారీ కుటుంబాల్లో ఆడపిల్లలను పై చదువులకు పంపే వారు కాదు. ఇప్పుడో! పరిస్తితి మారింది. వాళ్లు కూడా కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారు. నిజానికి పిల్లలకు తలిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి అదొక్కటే!’
చందా జవేరీ ఒక్కతే కాదు, అవకాశాలు రావాలే కాని తమ శక్తిని ప్రదర్శించే అమ్మాయిలకు కొదవలేని దేశం మనది. అయితే, అవకాశాలు రావాలా లేక వాటిని వొడిసి పట్టుకోవాలా అన్నదే ఆ లక్ష్య సాధనలో అడ్డం పడుతున్న అడ్డంకిలా అనిపిస్తోంది. (05-02-2013)

కామెంట్‌లు లేవు: