8, జనవరి 2015, గురువారం

ఫుడ్ సెక్యూరిటీ


క్లాసు జరుగుతోంది. ప్రొఫెసర్ అడిగాడు, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏమిటో తెలుసా అని.
ఠక్కున జవాబు వచ్చింది.
‘తెలియకేం. అందరికీ ఆహారం. ఈ దేశంలో ఎవ్వరూ ఆకలితో కడుపులో కాళ్ళు పెట్టుకుని నిద్రించే పరిస్తితి లేకుండా చేయడం'   
సమాధానం విన్న ప్రొఫెసర్ గారు విద్యార్ధులకు ఓ పరీక్ష పెట్టాడు. దానితో పాటు ఒక నిబంధన కూడా.
అదేమిటంటే – అందరూ పరీక్ష రాస్తారు. కానీ అందరికీ వచ్చిన మార్కులను కూడి సగటు తీసి విద్యార్ధులకు  గ్రేడ్లు ఇస్తారు.
సరే. అంతా పరీక్ష రాశారు. బాగా చదివిన  వాళ్లు బాగా రాశారు. చదవని వాళ్లు అందుకు తగ్గట్టే జవాబులు రాశారు. ప్రొఫెసర్ గారు వాళ్ల మార్కుల సగటు తీసి అందరికీ ‘బీ’ గ్రేడ్ ఇచ్చారు. చదవని వాళ్లు సంతోషించారు. బాగా చదివే వాళ్లు  చిన్నబుచ్చుకున్నారు.
కొన్నాళ్ళు జరిగాయి. మళ్ళీ పరీక్ష పెట్టారు. ఈ సారి బాగా చదివేవాళ్ళు కూడా చదువుపై శ్రద్ధ పెట్టలేదు. వాళ్లను  నిర్వేదం అవహించింది, ‘చదివేం లాభం. యెట్లాగు వచ్చేవి సగటు మార్కులే’ కదా అని.
కాస్తో కూస్తో చదివేవాళ్ళు, అస్సలు చదవని వాళ్లు ఆ కాస్త కూడా చదవడం మానేశారు. ఎందుకంటే చదవకపోయినా మంచి గ్రేడే వస్తోంది. ఇక కష్టపడాల్సిన పనేముంది.
ఈసారీ  అందరికి  తక్కువ గ్రేడే వచ్చింది.
తరువాత తరువాత ఏం జరిగిందో చెప్పనక్కర లేదు. బాగా కష్టపడి చదివేవాళ్లు చదవడం పూర్తిగా మానేశారు.
చదవని వాళ్లకు ఏం పట్టలేదు. ఎందుకంటే వాళ్లకు పోయేదేమీ లేదు.
ఎంతో మంచి కాలేజీ అని పేరుపడ్డ ఆ కాలేజీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని  విధంగా క్లాసు మొత్తం పరీక్షలో తప్పింది.


ప్రతి కధకు ఒక నీతి వుండాలి కదా!
అదే ఇది.
‘కొందరికే అన్నీ కాకుండా అందరికీ అన్నీ’ అనే విధానం మెచ్చతగిందే.
కాలే కడుపుకి ఇంత అన్నం పెట్టడాన్ని మించిన ధర్మం ఏముంటుంది ?
కానీ,
మళ్ళీ ఈ కాణీలు అర్ధణాలు ఏమిటంటారా ? 
అందరికీ పంచడం అంటే  కొందరి నుంచి తీసుకోవడం కాదు.
సోమరితనాన్ని పెంచడం అంతకంటే కాదు.
అన్ని అవతారాలు ఎత్తిన భగవంతుడు కూడా అవతారానికి తగ్గట్టే నడుచుకున్నాడు.
ఆర్ధికవేత్తలు రాజకీయ సలహాదారుల అవతారాలు ఎత్తినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
అంచేత చెప్పేదేమిటంటే,  ప్రతిదీ శాస్త్రంతో ముడిపెట్టి చూడకూడదు.

NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు: