21, జనవరి 2015, బుధవారం

పాలక ప్రతిపక్షాలకు రాష్ట్రపతి హితబోధ

(Published by 'SURYA' telugu daily in its edit page on 22-01-2015, Thursday)

దేశ ప్రధమ పౌరుడు భావి పౌరులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాట విప్పి చెప్పారు. దశాబ్దాల రాజకీయ అనుభవసారాన్ని మొత్తం రంగరించి మరీ చెప్పారు. పాలకపక్షం వారికీ, ప్రతిపక్షం వారికీ అందరికీ పనికొచ్చే పసిడి ముక్కలు చెప్పారు. ప్రస్తుత పరిస్తితులను అవగాహన చేసుకుని ఆవేదనతో కూడిన హితబోధ చేశారు.
చెప్పింది సాక్షాత్తు భారత రాష్ట్రపతి. విన్నది భవిష్యత్ భారతానికి నిర్ణేతలయిన  విద్యార్ధులు. కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్ధులతో,  శ్రీ ప్రణబ్ ముఖర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గత సోమవారం నాడు  ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు రాష్ట్రపతి జవాబులు చెప్పారు. నేడు దేశం ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను ఆయన తన సమాధానాల్లో స్పృశించారు. మొత్తం జాతికి ఒక పెద్దగా,  ఎలాటి హితవు పలకాలో  శ్రీ ముఖర్జీ  ఆ సంభాషణలో స్పష్టంగా చెప్పారు. అవి విద్యార్ధులకోసం చెప్పిన జవాబులే.  కానీ  దేశానికి జవాబుదారీగా వుండాల్సిన పాలక ప్రతిపక్షాలకు కూడా పనికొచ్చే హితబోధలు వాటిల్లో వున్నాయి. చురుక్కుమనిపించేలా  మాత్రమే కాదు,  ఆలోచింపచేసేలా కూడా  వున్నాయి. ఆ హితవచనాలు విని ఆచరించగలిగితే అది జాతి హితానికి ఎంతో  మంచిదనిపించేలా కూడా వున్నాయి.
ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోంది భారతీయ జనతాపార్టీ. పేరుకు సంకీర్ణ ప్రభుత్వం. కానీ , ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, ఆయన పేరుతొ ఎదురులేకుండా సాగిపోతున్న  ప్రభుత్వం అది.  శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో. ప్రస్తుతం ఆ పార్టీ,  లోకసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్తితిలో వుంది. ప్రధాని మోడీకి, ఆయన పార్టీ అయిన బీజేపీకి కాంగ్రెస్ అంటేనే చుక్కెదురు. ఇలాటి నేపధ్యంలో రాష్ట్రపతి తనకున్న పరిమితుల్లోనే హితబోధ చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, జరగాల్సిన విధి విధానాలను విశ్లేషించారు.  అలాగని ఆయన ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎవ్వరు నొచ్చుకునే విధంగా మాట్లాడలేదు. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబ విషయాలను తనవారితో యెలా మాట్లాడతాడో ఆవిధంగానే సాగింది రాష్ట్రపతి ప్రసంగం.

ప్రతిపక్షం యెలా వ్యవహరించాలో, పాలక పక్షం యెలా నడుచుకోకూడదో శ్రీ ప్రణబ్ ముఖర్జీ అన్యాపదేశంగా ప్రస్తావించారు. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చట్టసభల్లో కనబరుస్తున్న ప్రవర్తనను  ఆయన ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే యావద్దేశ పౌరుల మనస్సుల్లో కదలాడుతున్న అంశాలనే రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
చట్ట సభల పనితీరు పట్ల ఆయన ఆవేదన, సభల నిర్వహణకు కలుగుతున్న ఆటంకాల పట్ల అసహనం ఆయన మాటల్లో వ్యక్తం అయింది.
పార్లమెంటు సభ్యులు సభ జరగనివ్వకుండా నినాదాలు చేయడం, స్వతంత్ర భారతం స్వయంగా రూపొందించుకున్న  పార్లమెంటరీ సంప్రదాయాలకు మేలు చెయ్యదన్న అభిప్రాయం అయన మాటల్లో ద్యోతకమయింది. ఈ విషయంలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతి తీవ్రంగా దుయ్యబట్టారు.
'సభలో అల్పసంఖ్యాకులు (మైనారిటీ) తమ ఆందోళనలతో అధిక సంఖ్యాకుల (మెజారిటీ) హక్కులకు భంగం కలిగిస్తున్నారు. దీన్ని ఎంతమాత్రం అనుమతించరాదు' అని శ్రీ ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.
'చట్టాలు చేయడం చట్ట సభల కర్తవ్యం. ఇందులో పార్లమెంటు విఫలం అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్మవుతుంది. ఇలా చేయడం అంటే ప్రజల విశ్వాసానికి ఘాతుకం కలిగించడమే' అని రాష్ట్రపతి అన్నారు. అంచేత ఎట్టి పరిస్తితుల్లోను పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయాలు కలగకుండా చూడాలని హితవు పలికారు. శీతాకాల సమావేశాల్లో విపక్షాలు సభను అడ్డుకున్న నేపధ్యాన్ని మనసులో పెట్టుకుని రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేసివుంటారని భావిస్తున్నారు. విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన పార్లమెంటు, సామూహిక ఆందోళనలకు, బజారు స్థాయి నిరసనలకు వేదిక కారాదని ఆయన చెప్పిన తీరును బట్టి,  ఈ పరిణామాలు ఆయన్ని ఎంతగా కలత పెట్టి వుంటాయో అర్ధం చేసుకోవచ్చు. 'పార్లమెంటు అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంతమైన సాధనం. దాన్ని మరింత శక్తివంతంగా ఉపయోగించుకోవాలి. సభను స్తంభింపచేయడమే ప్రధానంగా పెట్టుకుంటే విలువయిన సభ సమయం వృధా అయిపోతుంది. విధాన ప్రక్రియ కుంటుపడుతుంది' అని ఆయన అన్నారు.
పార్లమెంటు సమావేశాల కాలం కాలక్రమంలో క్రమేపీ కుదించుకుంటూ పోవడం, సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యుడిగా వున్న ప్రణబ్ మనసును కలత పెట్టి వుంటుంది. అందుకే ఆయన, పార్లమెంటు సమావేశాల సమయం యెలా కుదించుకుపోయిందో గణాంకాలతో సహా  వివరాలను వెల్లడించారు.
విపక్షాలకు సుద్దులు చెప్పడంతోనే రాష్ట్రపతి సరిపుచ్చుకోలేదు. అంతే తీవ్రంగా అధికార పక్షం తీరును కూడా ఎండగట్టారు.  మోడీ ప్రభుత్వం ఆర్డినెన్సుల బాటలో వెళ్లడం ఆయనకు రుచించినట్టుగా లేదు. 'చట్టసభల్లో ఒక పద్దతి ప్రకారం చట్టాలు జరగాలి. అలాకాకుండా సాధారణ చట్టాలకు సైతం ఆర్డినెన్సుల మార్గం ఎంచుకోవడం సరికాద'ని అన్నారు. అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో  మాత్రమే ఆర్డినెన్సులు జారీ చేయాలని రాజ్యాంగం పేర్కొంటున్న విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. 'ఏ ఆర్డినెన్సు జారీ చేసినా దానికి ఆరు నెలలలోగా పార్లమెంటు ఆమోదం లభించేలా చూడాలి. లేనిపక్షంలో అది నిరర్ధకమవుతుంద'ని చెప్పారు.
మోడీ ప్రభుత్వం కొన్ని ఆర్డినెన్సుల విషయంలో అనుసరించబోతున్న పద్దతి ఎలాటిదో తెలియని వ్యక్తి కాదు శ్రీ ప్రణబ్ ముఖర్జీ. రాజ్యసభలో కొన్ని బిల్లులను ఆమోదింప చేసుకునే బలం ప్రస్తుతానికి బీజేపీకి, దాని మిత్ర పక్షాలతో కూడిన  ఎండీఏ కూటమికి లేని మాట నిజం. అందుకే పార్లమెంటు ఉభయ సభల  సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి బిల్లులను గట్టెక్కించే వ్యూహ రచన చేస్తున్న సంగతి కూడా బహిరంగ రహస్యమే.
విద్యార్ధులతో మాటా మంతీ కార్యక్రమంలోనే రాష్ట్రపతి తెలివిగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చన్న ధ్వని ఆయన మాటల్లో వ్యక్తం అయింది. 1952  నుంచి ఇప్పటివరకు అలాటి సందర్భాలు నాలుగే వచ్చాయి. సంయుక్త సమావేశాల్లో బిల్లులను నాలుగు పర్యాయాలు మాత్రమే ఆమోదం పొందేలా పాలక పక్షాలు ప్రయత్నించిన సంగతిని  ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఈ అంశంలో తన వైఖరి  యెలా వుండబోతోందో అయన ఈ విధంగా అన్యాపదేశంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశారనుకోవాలి.          
కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. ఏదైనా ప్రభుత్వ బిల్లును ఉభయ సభల్లో ఒకటి ఆమోదించి మరొకటి తిరస్కరించినప్పుడు ఆ బిల్లును తిరిగి ఆమోదింప చేసుకోవడానికి రాజ్యాంగంలో ప్రత్యేక సౌలభ్యం వుంది. గతంలో ఇలాగే ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి, 1961 లో వరకట్న నిషేదం బిల్లును, 1978లో బ్యాంకింగ్ సర్వీసు కమీషన్ రద్దు బిల్లును, 2002లో ఉగ్రవాద నిరోధక బిల్లును ఆనాటి ప్రభుత్వాలు చట్టాలుగా మార్చుకోగలిగాయి.
సాధారణంగా పాలక పక్షాలకు లోక సభలో బిల్లులను ఆమోదింప చేసుకోగల మెజారిటీ వుంటుంది. రాజ్యసభతోనే అప్పుడప్పుడు చిక్కులు ఎదురవుతాయి. రాజ్యసభకు రొటేషన్ ప్రకారం సభ్యులను ఎన్నుకుంటారు కాబట్టి ఏదైనా కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం లోకసభలోనే ఆ పార్టీకి  మెజారిటీ వుంటుంది. రాజ్యసభలో కొంతకాలంపాటు పాత పాలక పక్షానికే ఎక్కువమంది సభ్యులు వుండడం కద్దు. ప్రస్తుతం రాజ్యసభలో అదే పరిస్తితి. బీమా, బొగ్గు గనులు, భూసేకరణ చట్ట సవరణ, పౌరసత్వ సవరణ మొదలయిన అంశాలకు సంబంధించి జారీ చేసిన ఆర్దినెన్సులకు చట్ట స్వరూపం కల్పించడంలో ప్రతిపక్షాలనుంచి చిక్కులు రాగలవన్న సందేహం పాలక పక్షానికి  వుంది.    
ఈ గడ్డు పరిస్తితిని అధిగమించడానికి మోడీ ప్రభుత్వం,  రాజ్యాంగంలో ఇందుకోసం పొందుపరచిన   118 వ అధికరణం ఉపయోగించుకునే అవకాశాలున్నాయని మీడియాలో కధనాలు వెలువడుతున్న తరుణంలో  రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఏర్పడుతోంది. సంయుక్త సమావేశంలో బిల్లులను ఆమోదించేటప్పుడు వోటు వేసే వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు తప్ప వారు రాజ్యసభ సభ్యులా, లేక లోకసభ సభ్యులా అన్న విషయం గమనంలోకి తీసుకోరు. 'విపక్షాలు బిల్లుల ఆమోదానికి సహకరించవు, లేదా ఆర్డినెన్సుల కాలపరిమితి ముగిసిపోతుంది' అనుకున్నప్పుడు పాలక పక్షాలు రాజ్యంగంలో పొందుపరచిన ఈ అధికరణాన్ని వాడుకుంటాయి. అయితే అత్యంత అత్యవసరం అనుకున్నప్పుడే ఈ వెసులుబాటును గతంలో ఉపయోగించుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.
రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు మోడీ ప్రభుత్వంలో కదలిక తెచ్చిన సూచనలు కానవస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధానం తీసుకుని కేంద్రంలోని సీనియర్ మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు, 'దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆర్దినెన్సులను జారీచేసింద'ని చెప్పారు. 'మోడీ ప్రభుత్వం ఆరుమాసాల కాలంలో రికార్డు స్థాయిలో ఆర్దినెన్సులను జారీ చేసిందనీ, పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవడం లేద'ని కాంగ్రెస్ నాయకులు  చేస్తున్న విమర్శలను వెంకయ్యనాయుడు తగిన గణాంకాలను ఉదహరిస్తూ తిప్పికొట్టారు. 1952 నుంచి ఇప్పటివరకు కేంద్రం మొత్తం  637 ఆర్డినెన్సులను జారీ చేయగా వాటిల్లో 456 ఆర్డినెన్సులు  కాంగ్రెస్ ప్రభుత్వ హయాములోనే జారీ అయిన సంగతి ఆయన గుర్తు చేశారు.
ఫిబ్రవరి మూడో వారంలో పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే అవకాశాల దృష్ట్యా సంయుక్త సమావేశాల విషయంలో కేంద్రం అప్పటిలోగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం  వుంది.
అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఇలాటి విషయాల్లో అన్ని పార్టీలదీ  ఒకటే విధానం. అదికారంలో వున్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు మరో తీరు.
రాజకీయ అనుకూలతలే పార్టీల నిర్ణయాలకు ప్రాతిపదికలవుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలే నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. దేశ హితం, జాతి హితం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
రాష్ట్రపతి హితవచనలయినా పాలక ప్రతిపక్షాలను దారిలో పెడతాయని ఆశిద్దాం. (21-01-2015)

NOTE: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు: