14, మే 2023, ఆదివారం

సాధనాత్ సాధ్యతే సర్వమ్ – భండారు శ్రీనివాసరావు

 కొందరు అంతే! తలపెట్టిన పని చేసుకుంటూ పోతుంటారు. ప్రచారం వచ్చిందా! గుర్తింపు దొరికిందా!  ఇలాంటివన్నీ వాళ్లకి అత్యల్ప స్వల్ప విషయాలు.

ఈరోజు కళ్ళతో చూసిన తర్వాత నిజమే అనిపించింది. ఈ మధ్యాన్నం జ్వాలాతో కలిసి అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహించిన ఉచిత అవధాన శిక్షణాకార్యక్రమం ముగింపు సమావేశానికి వెళ్లాను. నటీనటులుగా శిక్షణ ఇస్తాము అంటే వేలు తగలేసి వెళ్ళేవాళ్ళను చూశాను. టీవీ యాంకర్ గా, రేడియో జాకీగా శిక్షణ ఇస్తామన్నా ఎగబడి వెళ్ళే వాళ్ళను చూశాను. కానీ ఇదేమిటి అవధానంలో శిక్షణ అంటే పిల్లలు సరే, వాళ్ళ తలితండ్రులు కూడా ప్రోత్సహించడం వింతగా అనిపించింది. ఈ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న వారిలో పన్నెండు ఏళ్ళ అమ్మాయి నుంచి యాభయ్ ఏళ్ళ వయసు కలిగిన పెద్ద వాళ్ళు వుండడం మరింత వింతగా తోచింది. అంతేనా! ఎంబీబీఎస్ చదువుతున్న ఓ యువకుడు కూడా అవధాన శిక్షణ పొందడం చూసిన తర్వాత గొప్పగా కూడా అనిపించింది.

దీనికి జవాబు ప్రధాన అతిధిగా వచ్చిన ప్రముఖ అవధాని మేడసాని మోహన్ గారి ఉపన్యాసంలో దొరికింది. అవధానంలో ముందు అలవారచుకోవాల్సింది ఏకాగ్రత. ప్రతి విద్యార్ధికి కావాల్సింది కూడా ఇదే. బయట విద్యాసంష్టలలో దొరకంది కూడా ఇదే. అవధాన శిక్షణ ద్వారా ధారణ శక్తి అలవడుతుంది. దీని ద్వారా చదివిన విషయాన్ని చక్కగా గ్రహించడం, గ్రహించిన దాన్ని గుర్తు పెట్టుకోవడం, అవసరమైన సందర్భాలలో కొన్ని విషయాలను సందర్భోచితంగా వాడడం, తద్వారా  బుద్దికి పదును పెట్టడం జరుగుతుంది. ఏ విద్యార్ధికి అయినా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది? ప్రభుత్వాలు చొరవతీసుకుని అవధాన ప్రక్రియను చిన్నతరగతుల నుంచే ఒక పాఠ్యా౦శ౦గా  చేరిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి. ఆన్నింటికంటే ముఖ్యమైనది ప్రపంచ భాషల్లో ఒక్క తెలుగుకే సొంతం అయిన పద్యాన్ని బతికించి భవిష్యత్ తరాలకు అందించాలంటే అవధాన ప్రక్రియ ఒక్కటే మార్గం. ఆధునిక చదువులకు కూడా అక్కరకు వచ్చే అవధానానికి అవసరమైంది ఏకాగ్రత. ఏకాగ్రతకు కావాల్సింది సాధనం. సాధనం వల్ల సాధ్యం కానిది ఏమీ లేదు.

అవధాన విద్యా వికాస పరిషత్ కు కర్తా కర్మా క్రియ అయిన మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు కూడా బహుశా ఈ సాధనం అనే మార్గాన్నే నమ్ముకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అవధాన విద్యను ప్రదర్శించే స్థాయికి చేరిన నాడు, అవధానం మరింతగా ప్రజలకు చేరువ అవుతుంది. ప్రాచుర్యం పెరుగుతుంది.

దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చి అనేక పురస్కారాలు పొందిన మేడసాని మోహన్ గారు అవధాన ప్రదర్శనలో అవధాని ఎదుర్కునే ఇబ్బందులను సోదాహరణ పూర్వకంగా వివరించారు. దత్తపది, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం మొదలయిన అవధాన ప్రక్రియల ద్వారా మెదడు ఎలా పదునెక్కుతుందో  విశదం చేశారు. గండపెండేరాలు, కీర్తి కిరీటాల దశ దాటి వచ్చానని చెబుతూ, జ్వాలా నరసింహారావు తనకు బహుకరించిన రామాయణ గ్రంధమే పెద్ద సత్కారంగా భావిస్తానని వినమ్ర పూర్వకంగా చెప్పారు.  

ఒక్కోరోజు ఇలా గడుస్తుంది. ఇలా గడిచిన రోజు, మరో రోజును  ఉత్సాహంగా గడపడానికి ప్రేరణ ఇస్తుంది.






(14-05-2023)

కామెంట్‌లు లేవు: