16, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఏమి చెప్పుదు సంజయా!


ఆ వార్త దావానలంలా నగరంలో ఒక్కసారిగా గుప్పుమంది.
ఒకరు కాదు, ఇద్దరు కాదు ఒకేసారి చిత్రపరిశ్రమకు చెందిన ముగ్గురు – నిర్మాత, డైరక్టర్, రచయిత – ఓ హోటల్ గదిలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి వెళ్ళిన పోలీసులకు ఆ గదిలో ఓ లేఖ దొరికింది.
అందులో ఇలా వుంది.
విషయం : మహాభారతం మీద మీరు నిర్మించాలనుకున్న సినిమా
రిఫరెన్స్ : ప్రభుత్వం నుంచి  ఆర్ధిక సాయం కోసం  మీరు పెట్టుకున్న ధరఖాస్తు
అయ్యా !
మీరు పంపిన పై ధరఖాస్తు కింది సంతకందారు పరిశీలనకై వచ్చింది. 'మహాభారతం' అనే సినిమా తీయడానికి ప్రభుత్వ సాయం కోసం  మీరు పెట్టుకున్న అర్జీని  ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. మహాభారతం సబ్జెక్ట్ లోని కొన్ని అంశాలు మరీ సున్నితమైనవిగా భావించి ప్రభుత్వం ఈ ధరఖాస్తును పరిశీలించేందుకు ఒక అత్యున్నత  స్తాయి సంఘాన్ని ఏర్పాటుచేసింది.  మీరు దాఖలు చేసిన మహా భారతం  స్క్రిప్ట్ ను నిశితంగా  పరిశీలించిన తరువాత వాటిని ఈ కింది విధంగా క్రోడీకరించడం జరిగింది.    

1
. మీరు పంపిన స్క్రిప్ట్ లో  మహాభారతం కధలో వందమంది కౌరవులు, అయిదుగురు పాండవులు వుంటారని  పేర్కొన్నారు.  ఈ సంఖ్యల పట్ల కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ శాఖ జారీ చేసిన మార్గదర్శిక సూత్రాల ప్రకారం ఒక కుటుంబంలో ఇంత మంది సంతానం వుండడం, అలాటి విషయాలను సినిమా మాధ్యమం ద్వారా ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదు. చిన్న కుటుంబం ఆవశ్యకతను గురించి ప్రచారం చేయడం కోసం ప్రభత్వం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న దృష్ట్యా నూర్గురు కౌరవులను చూపించే మహాభారతం వంటి సినిమాలకు సాయం చేయరాదని ఆ మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. ఈ చిత్రంలో కౌరవ పాండవుల సంఖ్యను మూడు దాటకుండా చూసుకోగలిగితే ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించవచ్చని ఆ శాఖ సిఫారసు చేసింది.

2
. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ కధలోని మరో ప్రధాన అంశంపై అభ్యంతరం తెలిపింది. మహాభారతం స్ర్కిప్ట్ ప్రకారం కౌరవులు  క్లోనింగ్ విధానం ప్రకారం జన్మించినట్టు వుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం భారత దేశంలో క్లోనింగ్ నిషేధం. ఈ దృష్ట్యా , కౌరవులు సాధారణ పద్ధతిలో జన్మించినట్టు స్క్రిప్ట్ ను మార్చాల్సివుంటుంది.
3
. జాతీయ మహిళా హక్కుల కమిషన్ అభ్యంతరం మరో రకంగా వుంది. అయిదుగురు పాండవులకు కలిపి ఒకే భార్య వున్నట్టుగా స్క్రిప్ట్ లో చూపించారు. మహిళలను  కించపరిచే  విధంగా రూపొందించిన ఈ కధను ఎట్టి పరిస్తితిలోను ప్రస్తుతం వున్నవిదంగా చూపించడం తగదని స్పష్టం చేసింది.
4
. ఈ చిత్రంలో దృతరాష్ట్రుడు అనే పాత్ర అనేక సందర్భాలలో కనిపిస్తుంది. అతడిని అనేక దృశ్యాలలో 'అంధుడు అంధుడు' అని నిందాపూర్వకంగా మాట్లాడిన అంశాలను తొలగించాలని  వికలాంగుల మంత్రిత్వశాఖ గట్టిగా సిఫారసు చేసింది.
5
.  ఓ ఘట్టంలో ద్రౌపది అనే స్త్రీ పాత్రను నిండు సభలో వస్త్రాపహరణం చేస్తున్నట్టు వుంది. ఇది  స్త్రీ జాతికే అవమానకరమని , ఈ సన్నివేశాన్ని  తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని మహిళా శిశు సంక్షేమ  శాఖ తన సిఫారసులో పేర్కొన్నది. ఇలాటి సన్నివేశాలను సినిమాల్లో చూపించడంవల్ల మహిళా సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత  వ్యక్తం అయ్యే అవకాశం వుందని, దరిమిలా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావచ్చనీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ సన్నివేశాలను తొలగించకుండా స్క్రిప్ట్  ఆమోదించడం తమకు సమ్మతం కాదని పేర్కొన్నది.
6
. కౌరవ పాండవులను జూదరులుగా  చూపించారని, ప్రజల్లో జూద ప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా వున్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని కూడా సూచించింది.  అంతగా కధకు అవసరం అనుకుంటే  కౌరవ పాండవులు గుర్రపు పందేల్లో పోటీ పడినట్టు చూపించుకోవచ్చని సూచించింది. గుర్రపు పందేలు జూదం కిందికి రావని సుప్రీం కోర్టు  గతంలో పేర్కొన్న  విషయాన్ని హోం శాఖ తన సిఫార్సుకు జత చేసింది.
ఇన్ని కారణాల దృష్ట్యా మహాభారతం సినిమా స్క్రిప్ట్ ను తదనుగుణంగా మారిస్తే తప్ప ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించడం జరగదని ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది.  

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

చాలా బాగుందండీ ... మన బ్యూరో క్రసీ లోని డొల్ల తనాన్ని చాలా చక్కగా ఎండ గట్టేరు అభినందనలు