5, మార్చి 2013, మంగళవారం

పాత చింతకాయ పచ్చడి - 7
సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ

చరాస్తి అనండి చిరాస్తి అనండి ఆమెకు వున్నది ఆ సంచీ ఒక్కటే. దాంతోనే సీతమ్మ గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. కూలీ నాలీ చేస్తూ సంసారం లాగిస్తున్న మొగుడు రోడ్డుప్రమాదంలో కన్ను మూశాక మొత్తం భారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకుంది. పిల్లల్ని పెద్దచేసి పెళ్ళిళ్ళు చేసి సాగనంపింది. వొంటి చేత్తో కుటుంబం బరువు బాధ్యతల్ని నెట్టుకొచ్చిన సీతమ్మ చివరికి బతుకు బాటలో వొంటరి ప్రయాణం సాగిస్తోంది. కంప్యూటర్ పుణ్యమా అని నాకు ఈ పుణ్యమూర్తి పరిచయ భాగ్యం కలిగింది. అదెలాగో తెలుసుకోవాలంటే- కొద్దిగా వెనక్కు వెళ్ళాలి.
2005 డిసెంబర్లో హైదరాబాద్ దూరదర్శన్ నుంచి రిటైర్ అయిన తరువాత ఎల్లారెడ్డి గూడాలో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాటు అద్దెకు తీసుకుని వుంటున్నాము. దానిపక్కనే ఓ చిన్న గుడి. బ్లాగు లోకంలో సంచరిస్తూ కంప్యూటర్ దగ్గర కూచుని కూచుని పట్టిన మెడ నొప్పికోసం డాక్టర్ దగ్గరకు వెడితే ఆయన ఉదయం సాయంత్రం వీలు చూసుకుని ఓ గంట నడవమని సలహా ఇచ్చాడు. మెడ నొప్పికి, కాలినడకకు సంబంధం ఏమిటనే చచ్చు ప్రశ్నలు వేయకుండా డాక్టర్ సలహా పాటించడానికి నిర్ణయించుకున్న వాడినై, ఓ మంచి ముహూర్తం చూసుకుని, మార్నింగ్ టీవీ చర్చలకు అడ్డురాని సమయాన్ని ఎంచుకుని ఇంటికి దగ్గర్లో వున్న మునిసిపల్ పార్కులో మాణింగ్ వాక్ మొదలు పెట్టాను. ఈ క్రమంలోనే నాకు సీతమ్మ పరిచయం అయింది. తెల్లవారకముందే లేచి గుడిముందు వూడ్చి ముగ్గులు పెట్టే సీతమ్మను చూస్తూ నా వాకింగ్ మొదలయ్యేది.
అంత వయస్సులో ఇంత కష్ట పడుతున్న ఆమెను చూసి మనసు కష్టపడేది. కానీ ముక్కూ మొహం తెలియకుండా ఏదయినా సాయం చేయడానికి తెలియని సంకోచం. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే గుడి ముందు చిన్న పట్టా పరచుకుని భక్తులు వొదిలే పాదరక్షలు కనిపెట్టి చూస్తూ వారిచ్చే చిల్లర పైసలు తీసుకుంటువుండేది. ఇది సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యమే. పెద్ద ప్రత్యేకత వున్న విషయం కాదు.
అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ , వస్తూనో పోతూనో కాసేపు ఆగి ఆమెతో మాటలు కలిపేవాడిని. అన్ని విషయాలు ఒక్కసారే చెప్పకపోయినా కొద్ది కొద్దిగా ఆమె తన గురించిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టింది.

సీతమ్మది సూర్యాపేట దగ్గరవున్న జగ్గయ్యపేట. పొరుగూరు సంబంధమని సూర్యాపేటలో రోజుకూలీ చేసుకునే సుబ్బయ్యకిచ్చి చిన్న తనంలోనే పెళ్ళిచేశారు. తర్వాత పొట్టచేతబట్టుకుని హైదరాబాద్ వలస వచ్చారు. తేదీలు, సంవత్సరాలు సరిగా గుర్తులేవుకానీ, ఆమె చెప్పిన వివరాలప్రకారం వాళ్లు హైదరాబాద్ వచ్చి యాభయ్ ఏళ్ళు దాటిందనే అనుకోవాలి. అప్పటికి ఎల్లారెడ్డిగూడాలో ఇళ్లు విసిరేసినట్టు అక్కడొకటి ఇక్కడొకటి వుండేవట.
ఆ రోజుల్లో కూలీ పనులు ఓ పట్టాన దొరికేవి కావు. పొట్టగడవడం సంగతి దేముడెరుగు కట్టుకున్నవాడు లారీ కిందపడి చనిపోయాడు. నాలుగిళ్ళల్లో పాచిపనులు చేసుకుంటూ పిల్లల్ని సాకింది. పెళ్ళిళ్ళు అయి ఎక్కడి వాళ్లు అక్కడికి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. తమ దగ్గరకు వచ్చి వుండమని పిల్లలు ఎంత బతిమాలినా సీతమ్మ రాముడి గుడిని వొదిలిపెట్టి వెళ్ళడానికి వొ ప్పుకోలేదు. వుండడానికి ఇల్లంటూ లేదు. గుడికి నాలుగిళ్ళ అవతల ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ కుటుంబంతో కలసి వుంటుంది. పగలంతా గుడి దగ్గరే మకాం. ఇలాటివాళ్ళ కోసమే అన్నట్టు ఓ చిన్న కుర్రాడు ఓ పెద్ద ఫ్లాస్క్ లో టీ తెచ్చి అమ్ముతుంటాడు. దేవుడి ప్రసాదమే పగటి పూట సాదం. రాత్రి వాచ్ మన్ కుటుంబం పెట్టే తిండికి ఎంతో కొంత ముట్టచెబుతుంది.
సీతమ్మ లెక్క ప్రకారం జనంలో భక్తి పెరిగింది. గుళ్ళకు వచ్చేవాళ్ళు పెరిగారు. వెనక చెప్పులు కనిపెట్టి చూసినవారికి పావలా అర్ధ ఇస్తే ఘనం. ఇప్పడు పది రూపాయలనోటు కూడా వెనకాముందు చూడకుండా ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. దానా దీనా ఆదాయం పెరిగింది. ఖర్చులు తగ్గాయి. బ్యాంకులో ఖాతా తెరిచింది. కూడబెట్టిన డబ్బులోనుంచి అప్పుడప్పుడు పిల్లలకు ఎంతో కొంత పంపుతుంటుంది. దేవుడి దయ వల్ల రోగం రొష్టు లేవు. ఏ బాధా లేదు. బాధపెట్టేవాళ్ళూ లేరు.
బండెడు కష్టాలతో మొదలయిన గంపెడు సంసారం కాస్తా సంచీడు సంసారంగా మారింది. రోజులు వెళ్ళమార్చే స్తితి నుంచి రోజులు గడిచే స్తితికి చేరుకుంది. ఒకళ్ళమీద ఆధారపడకుండా జీవిస్తోంది.
‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇంకా కావాలి’ అని ఆరాటపడే జీవులు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తుంది. - భండారు శ్రీనివాసరావు

కామెంట్‌లు లేవు: