15, మార్చి 2013, శుక్రవారం

అందరూ అనుకున్నదే అయిందిఅవిశ్వాసం మీద విశ్వాసం లేకుండా పెట్టిన తీర్మానం ఏమవుతుంది? అనుకున్నట్టే అయింది. సుదీర్ఘ చర్చ అనంతరం వీగిపోయింది.
ఇలా కాకుండా ఇంకోలా అవుతుందని ఎవరయినా అనుకుంటే ఈనాటి రాజకీయాల సంగతి వారికి తెలియదని అనుకోవాలి.


ఎనిమిది గంటలన్నారు. ఇంకా అమీ తుమీ తెలియకుండా గంటలు గంటలు సభ సాగిపోయింది.
ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఆగినా ఆగకపోయినా ఇబ్బంది ఎవరికీ లేదు.
సినిమా మొదలు కాకముందే కధ తెలిసిపోయినట్టు అవిశ్వాస తీర్మానం ఏమవుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే.
అందుకే షాడో బాక్సింగ్ మాదిరిగా ‘నీడలతో పోట్లాడినట్టు’ ఏ పార్టీవారు ఆ పార్టీకి తగ్గట్టుగా మాట్లాడారు. పార్టీలు, అధికారం గోలే కాని ప్రజల సమస్యలు ఎవరికీ పట్టినట్టు లేదు.
‘అవిశ్వాసం యెందుకు పెట్టారు?’ చర్చకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రిగారి సందేహం.
నిజమే.
అవిశ్వాసం పెట్టాల్సింది ప్రతిపక్షాలు కాదు. ప్రజలు. కానీ వారికి ఆశ వున్నా ఆస్కారం లేదు. వాళ్లు తమ టైం వచ్చేవరకు అయిదేళ్ళు ఆగాల్సిందే. అంతవరకూ వాళ్లు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ఆటలు సాగాల్సిందే. రాజ్యాంగం రాసిన పెద్దలు ఈ చిన్న విషయాన్ని యెందుకు మరచిపోయారో తెలవదు.
‘మేం చక్కగా పాలిస్తున్నాం’ అంటారు పాలకులు.
‘ఇంత దరిద్రగొట్టు పాలన కనీ వినీ ఎరగం’ అంటారు అంతవరకూ పాలించి ప్రతిపక్షానికి బదిలీ అయిన పెద్దలు.
పాలితులు అంటే అసలు వోట్లు వేసి వీళ్ళను గెలిపించి అధికార అందలం  ఎక్కిస్తున్న ప్రజలకు మాట్లాడే ఛాన్సే లేదు.
ఒక్కసారి వోటు వేసి గెలిపించిన తరువాత అయిదేళ్లపాటు మళ్ళీ ప్రశ్నించే అవకాశం లేకపోవడం మన ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృష్టం.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు.
ప్రజలు ప్రభువులా ? అడిగే హక్కులేని నోరు వాయి లేని పశువులా?
కఠినం అనిపించినా ఇది వాస్తవం – ఇదే వాస్తవం
(15/16 -03-2013) 

2 కామెంట్‌లు:

G.P.V.Prasad చెప్పారు...

మొన్న ఎవరో వ్రాసారు, బలవుతున్నది మధ్యతరగతి వాళ్ళు అని ధనవంతుడు పేదవాడు బాగానే బ్రతుకుతున్నారు అని, కేవలం ౨౦ శాతం ఉన్న ప్రజలు అవిశ్వాసం ప్రవేశపెట్టినా అది వీగిపోతుంది, ఎందుకంటే జగన్ డబ్బులు దోచుకున్నాడు అని తెలిసికూడా వాడే గొప్ప అని వాదిస్తున్న వాళ్ళు చాలానే ఉన్నారు.

తన భర్త కాలంలో పెట్టిన అభివృధ్ధి పనులు లేవు అని ఒకరు ఏడుస్తున్నారు, కానీ నిజం తన భర్త తన కుటుంబం కోసం ప్రవేశ పెట్టిన అభివృధ్ధిపనులు ఇప్పుడు లేవు అని చెప్పట్లేదు.

అజ్ఞాత చెప్పారు...

అన్ని పార్టీలు తమ తమ బలాల ప్రదర్శన చేసాయి కాని ప్రజల బలాన్ని ప్రదర్శించటానికి ఏ పార్టీ ప్రయత్నించలేదు.