7, ఆగస్టు 2013, బుధవారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)
మా రెండో అన్నగారిది పెద్దలు నిర్ణయించిన పెళ్లి. వివాహం నాటికి వధూవరులిద్దరూ చాలా చిన్నవాళ్ళు. వాళ్ళే చిన్నవాళ్ళయినప్పుడు ఇక నాకు ఆ పెండ్లి విషయాలు గుర్తుండే వీలేలేదు. కాకపొతే విన్న సంగతుల ఆధారంగానే రాయాలి.


(పెళ్ళినాడు మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు - వొదినె శ్రీమతి విమలాదేవి)  

ఆడపెళ్ళి వాళ్ళు, మగపెళ్లివాళ్ళు ఒకరికొకరు బాగా తెలిసినవాళ్ళు. ఒకే వూరు.  వాళ్ళది మాదీ  ఒకే వీధి కాక పోయినా పక్క వీధిలో పక్కిల్లే. ఈ ఇంట్లో వసారాలోనుంచి చూస్తే ఆఇంట్లో పెరట్లో వున్న వాళ్ళు కనబడతారు. పైగా రెండు కుటుంబాల్లో రాకపోకలు హెచ్చు.  వియ్యంకుడి తల్లిగారు లలితమ్మ గారు సాయంత్రం అయ్యేసరికల్లా ఠంచనుగా మా ఇంటికి  మా బామ్మకోసం వచ్చేది. ఆ పెళ్లి చూసిన వాళ్ళు అచ్చు బొమ్మల పెళ్లి అని చెప్పేవారు. పెట్టుపోతలు, అలగడాలు, ఆడంబరాలు లేకుండా అచ్చు పెళ్లిలా జరిగిన పెళ్లి.

సరే! ఇది పెద్దవాళ్ళు అనుకుని చేసిన సంబంధం. అదే వూళ్ళో, మా ఇంటి పెద్దహాల్లో పందిళ్ళూ ఏవీ లేకుండా మరో పెళ్లి చేసారు. అది ప్రేమ పెళ్లి.  అక్షరాలా ప్రేమ వివాహమే. పెళ్లి కూతురు పేరు ప్రేమ. అంటే మా ఆరో అక్కయ్య. వరుడు అక్కడెక్కడో వరంగల్ జిల్లాలో మానుకోట దగ్గర ఈదులపూసపల్లి వాస్తవ్యులు.  దీనికి కొంత నేపధ్యం వుంది. అంతకుముందు మా ఇంట్లో మరో ప్రేమ వివాహం లాటి పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది. మా పెద్దన్నయ్య  పర్వతాలరావుగారు ఇరు పక్షాల పెద్దలను వొప్పించి అత్యంత నిరాడంబరంగా మా వొదినె గారు సరోజినీ దేవిని – మేనరికం – చేసుకున్నారు. మా మేనత్త అంటే మా వొదినెగారి తల్లి – (గండ్రాయి అత్తయ్య అనేవాళ్ళం)  తాలూకు వాళ్ళు వరంగల్ జిల్లా మానుకోటలో వుంటారు. (నిజానికి వారిది మా అమ్మ పుట్టిల్లు అయిన గండ్రాయి. మా వూరికి దగ్గరలోనే వుండేది.)


(ఈదులపూసపల్లిలో ఇంటి ముందు మా బావగారు, అక్కగారు) 

మూడునిద్రలకు ఆ వూరువెళ్లినప్పుడు వెంట మా ప్రేమక్కయ్య కూడా వెళ్ళింది. అక్కడ దేశముఖ్ పింగిలి వెంకటరామారావు గారి మూడో కుమారుడయిన  మధుసూదన రావుగారు మా అక్కయ్యను చూడడం, తొలి చూపులోనే ప్రేమించడం, ఆ తరువాత ‘అంగీకారం అయితే పెళ్ళిచేసుకోవడానికి సిద్ధం’ అని  మా వాళ్లకు ఉత్తరం రాయడం,   దరిమిలా   నేరుగా మా వూరికే   వచ్చి పెళ్ళాడి తీసుకువెళ్ళడం చకచకా జరిగిపోయాయి. ఆ పెళ్లి ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం నాడు జరగడం విశేషం.  అలా మొదలయిన ప్రేమ పెళ్ళిళ్ళు మా కుటుంబంలో తదనంతర కాలంలో తామరతంపరగా వర్ధిల్లాయి. కట్న కానుకల ప్రసక్తి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకునే పధ్ధతికి కూడా  అప్పుడే బీజం పడింది. మా అక్కయ్యల ఇళ్ళల్లో  దాదాపు మగపిల్లలు అందరూ  కట్నాలు లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. (మరో భాగం మరోసారి)                                  

కామెంట్‌లు లేవు: