భండారు వంశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భండారు వంశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఆగస్టు 2013, శుక్రవారం

భండారు వంశం (స్వగతం)


బాల్యం. ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత భాగం. కష్టాలున్నా బాధ్యతలు వుండవు. సుఖాలు అనుభవించడమే కాని వాటిని ఎలా సంపాదించుకోవాలనే తాపత్రయం వుండదు. ప్రేమను పూర్తిగా పొందడమే కాని తిరిగి పంచే పూచీ వుండదు.
గుర్తుండకపోయినా, బాల్యంలో పడ్డ ముద్రలు పెద్దయిన తరువాత కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.
నాకు కూడా చిన్ననాటి విషయాలు గురించి పెద్దవాళ్ళు చెప్పగా వినడమే కాని గుర్తున్నవి తక్కువ. గుర్తుంచుకోవాల్సినవి కూడా తక్కువేనేమో!
ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి చిన్నవాడని గారాబం చేయడంతో మంకుతనం, ముట్టె పొగరు కర్ణుడి కవచకుండలాల మాదిరిగా సహజసిద్దంగా అలవడ్డాయి. పెద్దలను ఎగర్తించి మాట్లాడ్డం, అనుకున్నది దొరికే దాకా గుక్క పట్టి ఏడ్వడం నా చిన్నతనం గురించి మా పెద్దల జ్ఞాపకాలు. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నెయ్యి కోసం చేసిన యాగీ అంతాఇంతా కాదు. కుడిచేతిలో నెయ్యి పోస్తుంటే అది వేళ్ళ సందుల్లోనుంచి కారిపోయేది. చేతినిండా నెయ్యి వేయలేదని గుక్క తిరగకుండా ఏడుపు.  గుక్కపట్టడం అనేది ఈనాటి తల్లులకు, పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు. ఊపిరి కూడా పీల్చుకోకుండా అదేపనిగా ఆపకుండా ఏడ్వడం వల్ల ఒక్కోసారి పిల్లలు కళ్ళు తేలవేసేవాళ్ళు. అందుకే గుక్క పట్టే పిల్లలంటే తలితండ్రులు భయపడేవాళ్ళు. వాళ్ళు ఏది అడిగితె అది ఆలోచించుకోకుండా చేతిలో పెట్టేవాళ్ళు. నా గుక్క సంగతి తెలుసు కనుక   ఇక ఇది పని కాదనుకుని ఒక చిన్న వెండి గిన్నెలో నెయ్యి నింపి ప్రత్యేకంగా నా కంచం పక్కన పెట్టడం అలవాటు చేశారట. వయసు పెరిగిన కొద్దీ ఆ నెయ్యి అలవాటు కొంతవరకు పోయింది కానీ మొండితనం మాత్రం – ఎందుకు నచ్చానో తెలియదు కాని – నాతోనే ఉండిపోయింది. పైగా తనకు తోడుగా ‘మాట తూలడం’ అనే తోబుట్టువును  కూడా తోడు  తెచ్చుకుంది. నిజానికి ఈ రెండూ లేకపోతే నేనూ ఒక ఆదర్శ పురుషుడిని అయ్యేవాడిని. కాని కొందరికి కొన్ని ఇలాటి ‘రోల్డ్ గోల్డ్ ఆభరణాలు’ ఆ దేవుడే తగిలిస్తాడు. ‘పుటక- పుడకలు’ సామెత అందుకే పుట్టిందేమో!

7, ఆగస్టు 2013, బుధవారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)
మా రెండో అన్నగారిది పెద్దలు నిర్ణయించిన పెళ్లి. వివాహం నాటికి వధూవరులిద్దరూ చాలా చిన్నవాళ్ళు. వాళ్ళే చిన్నవాళ్ళయినప్పుడు ఇక నాకు ఆ పెండ్లి విషయాలు గుర్తుండే వీలేలేదు. కాకపొతే విన్న సంగతుల ఆధారంగానే రాయాలి.


(పెళ్ళినాడు మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు - వొదినె శ్రీమతి విమలాదేవి)  

ఆడపెళ్ళి వాళ్ళు, మగపెళ్లివాళ్ళు ఒకరికొకరు బాగా తెలిసినవాళ్ళు. ఒకే వూరు.  వాళ్ళది మాదీ  ఒకే వీధి కాక పోయినా పక్క వీధిలో పక్కిల్లే. ఈ ఇంట్లో వసారాలోనుంచి చూస్తే ఆఇంట్లో పెరట్లో వున్న వాళ్ళు కనబడతారు. పైగా రెండు కుటుంబాల్లో రాకపోకలు హెచ్చు.  వియ్యంకుడి తల్లిగారు లలితమ్మ గారు సాయంత్రం అయ్యేసరికల్లా ఠంచనుగా మా ఇంటికి  మా బామ్మకోసం వచ్చేది. ఆ పెళ్లి చూసిన వాళ్ళు అచ్చు బొమ్మల పెళ్లి అని చెప్పేవారు. పెట్టుపోతలు, అలగడాలు, ఆడంబరాలు లేకుండా అచ్చు పెళ్లిలా జరిగిన పెళ్లి.

సరే! ఇది పెద్దవాళ్ళు అనుకుని చేసిన సంబంధం. అదే వూళ్ళో, మా ఇంటి పెద్దహాల్లో పందిళ్ళూ ఏవీ లేకుండా మరో పెళ్లి చేసారు. అది ప్రేమ పెళ్లి.  అక్షరాలా ప్రేమ వివాహమే. పెళ్లి కూతురు పేరు ప్రేమ. అంటే మా ఆరో అక్కయ్య. వరుడు అక్కడెక్కడో వరంగల్ జిల్లాలో మానుకోట దగ్గర ఈదులపూసపల్లి వాస్తవ్యులు.  దీనికి కొంత నేపధ్యం వుంది. అంతకుముందు మా ఇంట్లో మరో ప్రేమ వివాహం లాటి పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది. మా పెద్దన్నయ్య  పర్వతాలరావుగారు ఇరు పక్షాల పెద్దలను వొప్పించి అత్యంత నిరాడంబరంగా మా వొదినె గారు సరోజినీ దేవిని – మేనరికం – చేసుకున్నారు. మా మేనత్త అంటే మా వొదినెగారి తల్లి – (గండ్రాయి అత్తయ్య అనేవాళ్ళం)  తాలూకు వాళ్ళు వరంగల్ జిల్లా మానుకోటలో వుంటారు. (నిజానికి వారిది మా అమ్మ పుట్టిల్లు అయిన గండ్రాయి. మా వూరికి దగ్గరలోనే వుండేది.)


(ఈదులపూసపల్లిలో ఇంటి ముందు మా బావగారు, అక్కగారు) 

మూడునిద్రలకు ఆ వూరువెళ్లినప్పుడు వెంట మా ప్రేమక్కయ్య కూడా వెళ్ళింది. అక్కడ దేశముఖ్ పింగిలి వెంకటరామారావు గారి మూడో కుమారుడయిన  మధుసూదన రావుగారు మా అక్కయ్యను చూడడం, తొలి చూపులోనే ప్రేమించడం, ఆ తరువాత ‘అంగీకారం అయితే పెళ్ళిచేసుకోవడానికి సిద్ధం’ అని  మా వాళ్లకు ఉత్తరం రాయడం,   దరిమిలా   నేరుగా మా వూరికే   వచ్చి పెళ్ళాడి తీసుకువెళ్ళడం చకచకా జరిగిపోయాయి. ఆ పెళ్లి ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం నాడు జరగడం విశేషం.  అలా మొదలయిన ప్రేమ పెళ్ళిళ్ళు మా కుటుంబంలో తదనంతర కాలంలో తామరతంపరగా వర్ధిల్లాయి. కట్న కానుకల ప్రసక్తి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకునే పధ్ధతికి కూడా  అప్పుడే బీజం పడింది. మా అక్కయ్యల ఇళ్ళల్లో  దాదాపు మగపిల్లలు అందరూ  కట్నాలు లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. (మరో భాగం మరోసారి)                                  

6, ఆగస్టు 2013, మంగళవారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)
మా కుటుంబం మొత్తంలో భండారు సుబ్బారావు తాతగారి తరహానే  వేరు. పిల్లలు లేని కారణంగా వూళ్ళో అందర్నీ పిల్లలుగా చూసుకునే వారు. కష్టసుఖాలు గమనించి సాయం చేస్తూ  వుండేవారు. తరచుగా సతీసమేతంగా తీర్ధయాత్రలు చేస్తుండేవారు.కాశీ రామేశ్వరాలు తిరిగివచ్చిన పుణ్యశాలి. ఆయన భార్య సీతమ్మ గారు  కందిబండ వారి ఆడపడుచు. భర్తకు జడియడమే సరిపోయేది. ఆ రోజుల్లో భార్యలపై చేయిచేసుకోవడం వుండేది. కాని మా తాతగారికీ, నాన్నగారికీ అది అలవడలేదు. అయితే మా చినతాతలిద్దరికీ ఆ అలవాటు వుండేది. సుబ్బయ్య తాతగారు మాత్రం ఆవేశంలో ఏదయినా తప్పుచేస్తే  వెంటనే పశ్చాత్తాపం చెందేవాడు. ఎవరిమీద అయినా చేయి చేసుకుంటే ముందు బావి దగ్గరకు వెళ్లి తలస్నానం చేసి జందెం మార్చుకునేవాడు. అంతేకాదు. ఆ కొట్టిన వాడిని పిలిపించి మానెడు జొన్నలు ఇచ్చి పంపేవాడు. బీదాబిక్కీ ఎవరికయినా పనిదొరక్కపోతే, ‘ఇవాళ సుబ్బయ్యగారితో నాలుగు దెబ్బలు తిన్నా బాగుండు’ అనుకునేవారు. అంతేకాదు ఎవరయినా అప్పు అడగడమే తరువాయి, లేదనకుండా వెంటనే వందా రెండొందలు  ఇచ్చేవాడు. అసలు, వడ్డీ కలిపి ఎంతవుతుందో లెక్క కట్టి, ఎవరికెంత ఇచ్చిందీ వివరాలన్నీ పెన్సిల్ తో గోడమీద రాసేవాడు. ఒకసారి మరచిపోయి సున్నం కొట్టించాడు. అంతే!  మొత్తం పద్దులన్నీ మాఫీ. అప్పులు మాఫీ చేసే విషయంలో చరణ్ సింగుకు దోవ చూపించింది సుబ్బయ్య తాతయ్యే అనవచ్చు.


(సుబ్బయ్య తాతయ్య - సీతం బామ్మ) 

మా నాన్నగారికీ, లక్ష్మయ్య తాతయ్య గారికీ నడుమ జరిగిన తగాదాల్లో సుబ్బయ్య తాతయ్య ఎప్పుడూ నాన్న పక్షానే నిలబడేవాడు. నాన్నగారికి సుస్తీ చేసిన సమయంలో ఆయన ఎంతో ఆదుకున్నాడు. అప్పులన్నీ తీర్చి వేసాడు. చికిత్స గురించి శ్రమ పడే వాడు. ఒకసారి, అప్పుడు నాకు (భండారు పర్వతాలరావు) పదిహేడు ఏళ్ళు ఉంటాయేమో. సందర్భం జ్ఞాపకం లేదు కాని అనవసరంగా ఆవేశపడి ఆయనతో మాట తూలాను. నా మాటల్లో తీవ్రత చూసి ఆయన ఆశ్చర్య పడ్డాడే కాని కోపం తెచ్చుకోలేదు. తరువాత  నా తప్పు తెలుసుకున్నాకాని, ఆయన మనస్సు గాయపడింది అన్న విషయం కూడా బోధపడింది. చాలామందికి తెలియదు కాని నాది కోపిష్టి  మనస్తత్వం. అనాలోచితంగా, అనుచితంగా ప్రవర్తించడం, పెద్దవారిని నొప్పించడం దురదృష్టవశాత్తు పరిపాటి అయిపోయింది. భోలాశంకరుడుగా పేరున్న సుబ్బయ్య తాతయ్య గారికి చివరి రోజుల్లో భగవంతుడు పరీక్షలు పెట్టాడు. ఆయన భార్య సీతమ్మగారు పక్షవాతంతో తీసుకుని మరణించింది. ఆయనకు  కూడా పెద్దతనంలో ఒక కాలూ చేయీ పడిపోయింది. ఆయన ఔదార్యం మళ్ళీ, ఆయన పెంపకానికి తీసుకున్న మా రెండో తమ్ముడు రామచంద్రరావుకు వచ్చింది. మొత్తం కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కనిపెట్టి చూసే మంచి బుద్ధిని దేవుడు ప్రసాదించాడు. దత్తు పోవడంవల్ల అదనంగా వచ్చిన ఆస్తిపాస్తులను కూడా ఎప్పుడూ తన సొంతం అనుకోలేదు. ఈ సద్బుద్ధి మా తమ్ముడి పిల్లలకు కూడా వుండడం వల్ల ఆస్తుల విషయంలో మా కుటుంబంలో ఎలాటి పొరపొచ్చాలు తలెత్తలేదు. మా నాన్నగారు, తాతగారు పోయి అనేక దశాబ్దాలు గడిచినా ఇంతవరకు మా మధ్య , మా పిల్లల  మధ్య ఆస్తి పంపకాలు జరగలేదు. కంభంపాడు ఇల్లు, పొలాలకు సంబంధించి ఈనాటి వరకు మాది ఉమ్మడి కుటుంబమే. తమ్ముడు రామచంద్రరావు భార్య విమల కూడా,  చివరి రోజుల్లో మంచానపడిన  మా సుబ్బయ్య తాతగారికి ఎంతో సేవచేసింది.
అదేమిటో ఖర్మ తెలియదు కాని, మా కుటుంబంలో మగవాళ్ళు చివరి రోజుల్లో మంచానపడి, అవస్థలు పడి తీసుకుని తీసుకుని  పోయారు. మా నాన్నగారు దాదాపు మూడునెలలు మంచంలో వున్నాడు. లక్ష్మయ్య  తాతగారి పరిస్తితి మరీ దయనీయం. చెట్టంత ఎదిగిన మనుమడు సత్యమూర్తి ఆయన కళ్ళముందే అకాల మరణం చెందడం దారుణం. అందరిలోకి అదృష్టవంతురాలు ఆయన భార్య వరమ్మగారు. చనిపోయేముందు మొగుడి కాళ్ళు తన దగ్గర పెట్టుకుని, అందరికీ అన్నీ అప్పగింతలు పెడుతూ, ఏదో రైలుకు వెళ్ళేదానిలా హాయిగా అనాయాసంగా దాటిపోయింది.


(కంప్యూటర్లు లేని రోజుల్లో తొడమీద కాగితం దస్త్రాలు పెట్టుకుని వేల పేజీలు  కేవలం ధారణశక్తితో బాల్ పాయింటు పెన్నుతో రాస్తూ మా చరిత్రను గ్రంధస్తం చేసిన దార్శనికుడు, మా చోదక శక్తి, మా పెద్దన్నయ్య - కీర్తిశేషులు శ్రీ భండారు పర్వతాలరావు గారికి  యావత్ భండారు వంశం తరపున ఇవే కైమోడ్పులు. 2006  ఆగస్టు 21 న పుట్టపర్తిలో  కన్నుమూసిన ఆ  మహానుభావుడి  వర్ధంతి ఈ ఏడాది తిధుల ప్రకారం వచ్చే నెల మూడో తేదీ.)    


(మరో భాగం మరోసారి)             

5, ఆగస్టు 2013, సోమవారం

భండారు వంశం


మా రెండో తాతగారు సుబ్బారావు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను మా అన్నయ్య పర్వతాలరావు గారు తన రచనలో ప్రస్తావించారు. దానికి సంబంధించిన ఒక అరుదయిన ఫోటో మా రెండో అన్నయ్య కొడుకు జవహర్లాల్   పంపాడు. అందువల్ల ఆ భాగాన్ని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. 

"పర్వతాలయ్య గారి హయాములోనే ఒక సంఘటన జరిగింది. మా చిన తాత గారు భండారు సుబ్బారావు గారికి రైల్లో ఒక యువ సాధువు  కలిశాడు. ఆయన వర్చస్సు, పాండిత్యం చూసి మా చిన తాతగారు ముగ్ధుడై ఆయనను కంభంపాడు తీసుకు వచ్చారు. ఆ సన్యాసి పేరు శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి. ఆయనను అంతా కాశీ స్వాములవారు
అనేవారు.


(కంభంపాడు స్వామీజీ శ్రీ శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి)



ఆయన మా వూళ్ళో ఒక ఆశ్రమం స్థాపించారు. స్వామి  వారు హోమియో వైద్యం కూడా చేసేవారు. ఆయన బోధనలు విని మా తాతగార్లు తలా కొంత పొలం ఆయన గారి ఆశ్రమానికి దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో ఆయన తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే  ఒక వేద పాఠశాలను కూడా నిర్వహించారు. అదంతా బహుశా 1930-40 ప్రాంతాల్లో కావచ్చు. ఆ కార్యకలాపాలతో శ్రీ మండాలపాటి నరసింహారావుగారికీ, విజయవాడ న్యాయవాది శ్రీ  దంటు శ్రీనివాస శర్మ గారికీ సంబంధం వుండేది. మా సుబ్బయ్య తాతగారు సతీ సమేతంగా కొన్నాళ్ళు ఆశ్రమంలోనే కాపురం పెట్టారు.  ఆ  స్వాములవారు కొన్నాళ్ళు మండాలపేటలోను ఆ తరువాత కొవ్వూరులోను వున్నారు. పూరీ గోవర్ధన మఠం పీఠాధిపతి గా కూడా వున్నారు. ఆయన నిర్మించిన శివాలయం ఇప్పుడు శిధిలావస్థలో వుంది. కాశీ నుంచి తెచ్చిన శివ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు.(ఈ మధ్యనే మా రెండో తమ్ముడు భండారు రామచంద్రరావు పూనిక వహించి ఆ గుడిని  ఓ మేరకు అభివృద్ధి చేసి ఒక  పూజారిని నియమించి ఆ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత మొత్తం పంపుతున్నాడు) ఆశ్రమం మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఆలయానికి ఇచ్చిన పొలం ప్రభుత్వం తీసుకుని ఆ  ప్రదేశంలో షెడ్యూల్డ్ కులాలవారికోసం ఒక పెద్ద కాలనీ నిర్మించింది. మొత్తానికి మా పూర్వీకులు దానం చేసిన స్థలం ఒక సత్కార్యానికి ఉపయోగపడడం సంతోషదాయకం. పునరుద్ధరించిన ఆలయానికి మా తమ్ముడు  రామచంద్ర రావు ట్రస్టీగా వున్నాడు.

(మరో భాగం మరో సారి) 

భండారు వంశం (నిన్నటి తరువాయి)

(నిన్నటి తరువాయి)
(ఈ భాగం నుంచి ఓ సాహసానికి పూనుకుంటున్నాను. ఇంతవరకు మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు రాసి భద్రం చేసిన ‘భండారు వంశం’ రచనను ఏరోజుకారోజు పోస్ట్ చేస్తూ  వచ్చాను. నిన్నటితో, ఆయన రాసిపెట్టినది పూర్తయింది.  నేను మా వూళ్ళో వున్నది చాలా తక్కువ. చిన్నప్పుడే చదువుకోసం బెజవాడలో మా అక్కయ్య  దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడప్పుడు సెలవుల్లో మా వూరు  వచ్చేవాడిని. మా అన్నయ్యకున్న ధారణశక్తి నాకులేదు. అయినా ధైర్యం చేసి దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాను.)    

కంభంపాడు గ్రామంతో ముడిపడివున్న మరో పేరు చామర్తి వీరభద్రరావు గారు. ఆయన ఒక రకంగా ఈ మారుమూల కుగ్రామానికి ఆధునిక హంగులు అద్దారని చెప్పవచ్చు. వారి పూర్వీకులది ఖమ్మం జిల్లా సూర్యాపేట దగ్గరలోని వూరు. ఈయన,  తల్లి లలితమ్మ గారి  కడుపులో ఉండగానే, గ్రామకక్షల కారణంగా  ప్రత్యర్ధులు వీరభద్రరావు గారి తండ్రిని హత్య చేయడంతో భయపడిపోయిన  ఆవిడ మా వూరు వచ్చేసింది. వీరభద్రరావు గారు భోలా మనిషి. కళా ప్రియుడు. నాటకాలు వేసేవారు. బెజవాడ వెళ్లి రకరకాల భంగిమల్లో తీయించుకున్న ఫోటోలు అనేకం వాళ్ళింట్లో ఉండేవి. అప్పట్లో అందరివీ మట్టి ఇళ్ళు.  షాబాదు  బండలు పరిచిన మొదటి ఇల్లు ఆయనదే.


(కీర్తిశేషులు చామర్తి వీరభద్రరావు గారు) 

పంచెకట్టు అలవాటయిన వూళ్ళో పంట్లాముల  (ప్యాంట్లు) సంస్కృతి ప్రవేశ పెట్టింది కూడా ఆయనే. ప్యాంటులో చొక్కా దోపుకుని (ఇన్ షర్ట్ వేసుకుని) బూట్లు వేసుకుని తిరుగుతుంటే అంతా సినిమా నటుడ్ని చూసినట్టు కళ్ళార్పకుండా నిలబడిపోయేవారు. చక్కటి ఆకర్షణీయమైన విగ్రహం. అలాగే, వూళ్ళో మొట్టమొదట రేడియో కొన్నదీ ఆయనే. ఇప్పుడు కార్లలో వాడే పెద్ద ఎక్సైడ్ బ్యాటరీతో పనిచేసేది. ఆ రోజుల్లో అదో అద్భుతం. చిన్న పెట్టెలోనుంచి పాటలు, మాటలు వినబడుతుంటే వూళ్ళో వాళ్ళు భయంతో బిక్కచచ్చిపోయేవాళ్ళు. భానుమతి పాటలంటే ఆయన చెవి కోసుకునేవాళ్ళు. బెజవాడ వెళ్లి సినిమా చూసొచ్చి ఆయన చెప్పే కబుర్లే వూళ్ళో వాళ్లకి మంచి కాలక్షేపం. హార్మనీ పెట్టె ముందు పెట్టుకుని రాగాలు తీస్తూ పద్యాలు పాడేవారు. ఆయన ఇల్లంతా ఎప్పుడూ నాటకాలు ఆడేవాళ్ళతో, రిహార్సల్స్ తో చాలా సందడిగా వుండేది. చిన్నాపెద్దా తేడా లేకుండా, కులాల పట్టింపులు లేకుండా   వూళ్ళో అందరితో బాగా కలివిడిగా వుండేవారు. మా వూరికి మొదటి సారి కరెంటు వచ్చినప్పుడు వీధి దీపం కింద నిలబడి ఆయన సంతోషంతో డాన్స్ చేయడం అందరికీ గుర్తు. ఇక లలితమ్ముమ్మ మా బామ్మగారికి మంచి దోస్తు. ప్రతి రోజూ సాయంకాలం కర్ర పొడుచుకుంటూ మా ఇంటికి వచ్చి బామ్మతో ముచ్చట్లు చెబుతుండేది. వయస్సు మీదపడి నడవలేని రోజుల్లో కూడా ఒక చిన్న చెక్కబండిమీద ఆమెను కూర్చోబెట్టి లాక్కుంటూ తీసుకువచ్చేవారు. బామ్మ తన మంచం మీద. లలితమ్ముమ్మ ఆ మంచం  పక్కనే ముక్కాలు పీట మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే దృశ్యం ఇప్పటికీ కళ్ళల్లో కదలాడుతుంది. వాళ్ళు పోయారు కాని వాళ్ళ జ్ఞాపకాలు మిగిలాయి.
ఇంకో విశేషం ఏమిటంటే వీరభద్రరావు గారి పెద్దమ్మాయే మా రెండో వొదినె గారు శ్రీమతి విమలాదేవి, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి భార్య.    
(మరో భాగం మరో సారి)              

4, ఆగస్టు 2013, ఆదివారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

మా రెండవ చిన తాత వెంకట సుబ్బారావు గారు. ఈయన ఆధ్యాత్మిక దృక్పధం కలవాడు. జాలిగుండె. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. కోపం కూడా ఎక్కువే కాని అది తాటాకు మంట లాటిది. ఇట్టే ప్రజ్వరిల్లినా మళ్ళీ అట్టే చల్లరిపోయేది. చిన్నతనంలో చాలా దుడుకు మనిషి అని పేరు కాని పెద్దయిన తరువాత  చాలా మారిపోయాడు.


(సుబ్బయ్య తాతయ్య ఆయన శ్రీమతి సీతం బామ్మ - మధ్యలో వారు దత్తత తీసుకున్న మా రెండో తమ్ముడు  శ్రీ భండారు  రామచంద్ర రావు) 


శారీరకంగా కూడా దృఢమయిన మనిషి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల్లోను ఈయన ఒక్కరే బలంగా ఉండేవాడు. మిగిలిన ఇద్దరు శారీరకంగా అర్భకులు అనే చెప్పాలి. మొదట్లో ఆయనకు కాఫీ అంటే గిట్టేది కాదు. మా నాన్నగారు కాఫీని మొదటిసారి మా వూళ్ళో ప్రవేశపెట్టారనవచ్చు. లేకపోతే పర్చా రంగారావు గారో. మా ఇంట్లో కాఫీ పొడి మిషన్ వుండేది. మా  నాన్నగారు బెజవాడ వెళ్లి కాఫీ (గుండ్లు) గింజల్ని కొనుక్కుని వచ్చి వాటిని వేయించి, ఏరోజుకారోజు  ఆ మిషన్లో వేసి చేత్తో తిప్పితే, కొంత బరకగా వున్నా, మొత్తం మీద  కాఫీ పొడుం తయారయ్యేది. ఆరోజుల్లో ఫిల్టర్లు లేవు. వేన్నీళ్ళలో కాఫీపోడుం వేసి మరిగించి గుడ్డలో వడపోసి పాలూ పంచదార వేసుకుని ఇత్తడి జాంబు (గ్లాసు)లో పోసుకుని తాగేవారు. మా నాన్నగారే పొద్దున్నే లేచి కాఫీ పెట్టుకుని తానూ తాగి కొంత మా అమ్మగారికి ఉంచేవారు. కానీ, సుబ్బారావుగారికి (వూళ్ళో సుబ్బయ్యగారనే వారు) చెప్పానుకదా, కాఫీ అంటే చుక్కెదురు. ఆయనకు ఆరోగ్య సూత్రాల మీద మమకారం జాస్తి. శుభ్రం ఎక్కువ. అన్నం తినగానే కాని ఏదయినా పలహారం చేసిన తరువాత కాని నోట్లో నీళ్ళు పోసుకుని చాలాసేపు పుక్కిలించేవాడు. అందర్నీ అలాగే చేయాలని శాసించేవాడు. మాకేమో అదంతా చాదస్తంలా అనిపించేది. బయట ఊళ్లకు వెళ్ళినప్పుడు ‘లా’ పుస్తకాలు కొనుక్కొచ్చి వూళ్ళో తీర్పులు చెప్పేవాడు. మా వూళ్ళో మొదట గ్రామ ఫోన్ కొన్నది ఆయనే. జావళీలు, కీర్తనలు అంటే చెవి కోసుకునేవాడు. ముక్క అర్ధం కాకపోయినా వూళ్ళో వాళ్ళందరూ ఆ గ్రామ ఫోన్ పెట్టె చుట్టూ మూగి, గ్రామఫోన్ ప్లేటు తిరుగుతూ పాట వినిపిస్తుంటే నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతుండేవారు. కొందరు దాన్ని ‘దెయ్యపు పెట్టె’ అనే వాళ్ళు. ఎవరో కంటికి కనబడకుండా ఆ పెట్టెలో కూర్చుని ఆ పాటలు పాడుతున్నారని అనుమానంగా చూసేవారు.

(మరో భాగం మరో సారి)                                                                                            

3, ఆగస్టు 2013, శనివారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

మగవాళ్ళ మధ్య ఇంతగా వైరాలు నడుస్తున్నా, పిల్లలు కలిసి ఆడుకోవడానికి కాని, ఆడవాళ్ళు కలిసి మంచి నీళ్ళ బావికి వెళ్ళడానికి కాని, మధ్యాహ్నం వేళల్లో కలిసి కూర్చుని కాలక్షేపానికి పచ్చీసు ఆడుకోవడానికి కాని మగవాళ్ళు అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. లక్ష్మయ్య తాతయ్య గారి భార్య వరలక్ష్మి ( అంతా వరమ్మగారనేవారు, మేమంతా వరం బామ్మ అనేవాళ్ళం) ఎంతో ఆప్యాయత, ఆపేక్ష కలకలిగిన  మనిషి. మమ్మల్నీ, వాళ్ళ పిల్లల్నీ సమంగా చూసేది. మా నాన్నగారికి మేము పదకొండుమందిమి. ఏడుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలం. మా ప్రసాదం బాబాయి గారికి ఒక్కడే కొడుకు సత్యమూర్తి. ఆడపిల్లలు ఇద్దరు – సుగుణ, మధుర. మేమంతా ఎంతో స్నేహంగా, కలివిడిగా వుండేవాళ్ళం. నేనూ (పర్వతాలరావు) సత్యమూర్తి అన్నయ్య  చాలా  స్నేహంగా వుండేవాళ్ళం. మా రెండిళ్ళ నడుమ తగాదాలను గురించి మేం కాలేజీలో చదివేటప్పుడు తరచూ చర్చించుకునేవాళ్ళం. ‘మనం పెద్దవాళ్ళం అయిన తరువాత అలాటి గొడవలను ఇక ససేమిరా రానీయ వద్దు’ అని దీక్ష పూనాం కూడా. ఆవిధంగానే, తగాదాలు, గొడవలు అన్నీ పెద్దవాళ్ళతోటే పోయాయి.


(కీర్తిశేషులు శ్రీ భండారు సత్యమూర్తి)

సత్యమూర్తి  అన్నయ్య మాకే కాక ఊరంతటికీ పెద్ద అండగా ఉండేవాడు. సహాయకారి. పైపెచ్చు ధైర్యశాలి కూడా. దేనికీ భయపడే తత్వం కాదు. రాజకీయాల్లో తిరిగినా, హింస, దౌర్జన్యాలకు తావులేకుండా సామరస్య పూర్వకంగా వ్యవహారాలు నడిపేవాడు.  మా వూరి పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసాడు. గ్రామాభివృద్ధికి బాగా పాటుపడ్డాడు. కాకాని వెంకటరత్నం గారికి ఏకలవ్య శిష్యుడు. చదువుకోసం వెళ్ళిన నన్ను తప్పిస్తే ఆయనే మా వూరునుంచి  హైదరాబాదు వ్యవహారరీత్యా వెళ్లి వచ్చిన మొదటి వాడు. ఆయన హైదరాబాదులో బస్సు దిగి నేరుగా ఖైరతాబాదులో, కాకాని వెంకట రత్నం గారు మంత్రిగా వున్న ఇంటికి వెళ్ళిపోయేవాడు. వూరికి తిరిగి వచ్చిన తరువాత ‘హైడ్రాడ్’ (ఆయన ఉచ్చారణ అలానే వుండేది) విశేషాలను వైన వైనాలుగా వివరంగా చెప్పేవాడు. ఊరివారందరు గుమికూడి ఆ సంగతులన్నీ ఆసక్తిగా వినేవారు. ఊళ్ళోకి కరెంటు తీసుకు రావడానికి, రోడ్డు పడడానికి ఎంతో శ్రమ పడ్డాడు. గుండె జబ్బుతో ఆయన అకాల మరణం చెందకపోతే, మా వూరికి ఆయన తిరుగులేని నాయకుడిగా ఉండేవాడు. వూళ్ళో కలిగిన వాళ్ళే కాకుండా బీదాబిక్కీ కూడా ఆయన్ని విపరీతంగా అభిమానించేవారు. ఆయన చనిపోయినప్పుడు వారంతా తాము దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టు దుఖించారు. ఆయన మృత దేహాన్ని మోసే హక్కు  మీకే కాదు మాకూ వుందని ఇంటి వాళ్ళతో పోట్లాడి చివరకు అందరు కలసి స్మశానానికి తీసుకువెళ్ళి దహనం చేసారు. మేమందరం నిమిత్తమాత్రులుగా చూస్తూ ఉండిపోయాం. ఆరోజుల్లో స్మశానాలకు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కాని అదేమిటో ఆ రోజు వూరు వూరంతా తరలివచ్చింది. అక్కడ కులబేధం అని కాని, చిన్నా పెద్దా అని కాని  లేకుండా అంతా ఆయన చితిలో కట్టెపుల్లలు వేయడానికి తొక్కిసలాడారు. ‘మేమంతా ఆయన పిల్లలమేగా, ఆయన చితికి నిప్పంటించే కర్తవ్యం మాకు లేదా’ అంటూ షెడ్యూల్డ్ కులాలవారు పెద్దగా ఏడుస్తూ  ఆయన చితిపై కొరవులు వేయడం అందరి హృదయాలను కదిలించింది. అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న సత్యమూర్తి అన్నయ్య ధన్యజీవి. చిరంజీవి. ఇప్పటికీ గ్రామంలో ఏదయినా సమస్య తలెత్తితే ‘ సత్యమూర్తి గారు ఉంటేనా ..’ అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది.
(మరో భాగం మరో సారి)

2, ఆగస్టు 2013, శుక్రవారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

పర్వతాలయ్య గారి తమ్ముడు లక్ష్మీనారాయణ గారు వ్యవహార దక్షుడు. వూళ్ళో తగాదాలు వస్తే ఆయన దగ్గరకు వచ్చి పంచాయితీ పెట్టేవారు. సన్నగా,పొడుగ్గా, నిటారుగా ఉండేవాడు. ఎనభయ్ నాలుగేళ్ళకు పైగా జీవించాడు. ఆయనకు సంతానం కలగలేదు. మా పినతండ్రి రామప్రసాదరావు గారిని దత్తు తీసుకున్నారు. మా తాతగారు ప్రవ్తాలయ్య గారు బండ్లు కట్టుకుని భద్రాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చారు. బహుశా ఆయనకు భద్రాద్రి రామునిపై వున్న భక్తి కారణంగా మా నాన్నగారికి రాఘవ రావు అనీ, మా బాబాయికి రామప్రసాదం అనీ పేరిడి ఉండవచ్చు. ఆయనకు కనకమ్మగారని మేనత్త (రామయ్యగారి సోదరి) వుండేది. గోపినేనిపాలెం  రాజయ్యగారు ఆమె కొడుకే అనుకుంటా. అయితరాజు గోపాలరావు గారి భార్య, భండారు కామేశ్వర రావు గారి అత్తగారు జగ్గమ్మక్కయ్య, కనకమ్మగారి సంతతికి చెందినదే. తాయమ్మ, లచ్చమ్మ గార్లు ఆయన తోబుట్టువులు. లచ్చమ్మగారు సుబ్బయ్య తాతయ్య రేకుల ఇంట్లో వొంటరిగా ఉంటూ వొండుకుని తింటూ అకస్మాత్తుగా చనిపోయింది. అంతా పురుగు చేష్ట (పాము కాటు వంటిది) అనుకున్నారు. ఆమెకు సంతానం లేదు. బాల వితంతువు. డాక్టర్ జమలాపురం రామారావు (అంతా రాములు మామయ్య అంటారు. గమ్మతేమిటంటే చిన్నా పెద్ద అందరికీ ఆయన రాములు మామయ్యే.) ఆయన తాయమ్మ గారి సంతానం. పర్వతాలయ్యగారు బతికుండగా లోలోపల రగులుతూ వచ్చిన విబేధాలు ఆయన పోగానే ఒక్కసారి భగ్గుమన్నాయి. మా తాతగారిలా మా నాన్నగారు సర్దుకుపోయే మనిషి కాదు. మా బామ్మ గారిలాగే ఆయనకూడా ఒకరికి  లొంగి వుండే రకం కాదు. గ్రామానికి ఎవరు వచ్చినా మా ఇంటనే భోజనం చేసేవారు. హోటళ్ళు అవీ లేని రోజుల్లో అలాటి ఆదరణ ఎంతో ఆకట్టుకునేది. మా ఇంట్లో భోజనం చేసిన అధికారులందరూ మా నాన్న అన్నా, మా కుటుంబం అన్నా ఆదరాభిమానాలు చూపేవారు. మా నాన్నగారికి అధికారుల వద్ద ప్రాపకం అల్లా లభించిందే కాని ఒకరి సిఫారసు వల్ల కాదు. 

(కీర్తిశేషులు లక్ష్మయ్య తాతయ్య - వరం బామ్మ)


అప్పటిదాకా గ్రామంలో తిరుగులేని పెద్దరికం అనుభవిస్తున్న లక్ష్మీనారాయణ గారిది విచిత్రమైన మనస్తత్వం. ‘మీరే’ అని పెద్దపీట వేసి పిలిస్తే ప్రాణం ఇచ్చేమనిషి. తన మాట కాదంటే, వాడి అంటూ చూసే రకం. ఏది చేసినా కుటుంబంలో పెద్దవాడినయిన తనని సంప్రదించి చేయాలన్నది ఆయన కోరిక. అయితే మా నాన్నగారికి తనకు తోచింది చేయడం అలవాటు. ఒకరిని సలహా అడగడం తక్కువ. ఇద్దరూ వ్యవహార దక్షులు, స్వతంత్రులు కావడంతో వాళ్ళ మధ్య సామరస్యం ఎక్కువకాలం సాగలేదు. పరిస్తితి మాట పట్టింపులతో మొదలయి, క్రమంగా మాటలు లేకపోవడం దాకా వచ్చింది. ఆ శతృత్వం  15,20 ఏళ్ళపాటు సాగింది. ఈ లోపల ఇద్దరి నడుమా ఓ అరవై డెబ్బయ్ కేసులు, దావాలు నడిచివుంటాయి. ఈ గ్రంధ నడిచినన్నాళ్ళు వేమిరెడ్డి సోదరులు అయిదుగురూ మా నాన్నగారి  పక్షాన పెట్టని కోటలా నిలబడ్డారు. మునసబు వాసిరెడ్డి అక్కయ్య గారు కూడా మా నాన్న గారి వైపే వుండేవారు. మునసబు కరణాలు కలిసి వస్తుంటే మా రాములు మామయ్య సరదాగా ‘అక్కయ్య, బావయ్య  వస్తున్నార’ని నవ్వేవాడు. (మరో భాగం మరో సారి) 

1, ఆగస్టు 2013, గురువారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)

(నిన్నటి తరువాయి)

కాపురానికి వచ్చిన కొత్తల్లో మా బామ్మగారికి ఎప్పుడయినా కోపం వస్తే చక చకా నడిచి కాకరవాయిలోని తన పుట్టింటికి పోయేదట. ఆమెది తన మాట సాగించుకునే తత్వం. స్వతంత్రంగా ఆలోచించి పనిచేయగల ధైర్యం వున్న మనిషి. ఒకరికి తగ్గివుండే స్వభావం కాదు.ముఖ్యంగా ఏదయినా ఆపద మీద పడ్డప్పుడు బేలగా ఏడుస్తూ కూర్చోకుండా గట్టిగా నిలబడి ప్రతి క్రియ ఆలోచించే వ్యక్తి. తల్లి చెల్లమ్మ గారిలా ఆమె మెతక మనిషి కాదు.


(భండారు రుక్మిణమ్మగారు - చిన్నతనంలో - పెద్దయిన తరువాత)

ఇస్లాం ఉపదేశం పొందినప్పుడు  ఆమె తనకు తోచినట్టు చేసింది. భర్తను కూడా సంప్రదించలేదు. పైగా తన తల్లిని కూడా తోడు తీసుకువెళ్ళి తనతో పాటు ఉపదేశం చేయించింది. భర్త, ఆయన సోదరులు అందరూ సనాతన వాదులు అన్న సంగతి తెలిసీ, వాళ్ళు తను చేసే పని హర్షించరని ఎరిగుండీ కూడా ఆమె ఆ సాహసం చేసింది. నిజానికి అదేదో ఎవరో స్వాములవారు చేసే ఉపదేశం వంటిది అనుకున్నారేమో. మతం మార్పిడివంటి తీవ్ర చర్య అన్న  సంగతి వారు గ్రహించి వుండరు. దానితో మా తాతగారికి మొదట్లో కష్టం కలిగి దంపతుల మధ్య ఎడం ఏర్పడ్డా, ఆయనది సర్దుకుపోయే స్వభావం కనుక వాళ్ళ కాపురం దెబ్బ తినలేదు.


(మరో భాగం మరో సారి)     

31, జులై 2013, బుధవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


పర్వతాలయ్య గారికి చిన్నతనంలోనే పెండ్లయింది కదా. పెండ్లిలో కూడా మా బామ్మ ఆయనపై పడుకుని నిద్రపోయిందట. పొలిమేర మీద ఊళ్ళు కావడం వల్ల బాగా రాకపోకలు ఉండేవి. ఇద్దరూ కలసి ఆడుకునేవారట. మా బామ్మగారు సమర్త కాకపూర్వమే గర్భం ధరించిందట. మా నాన్నగారు పోయినప్పుడు చెల్లమ్మమ్మ ఎంతో దుఃఖపడింది. ఆ ఏడుపులో ఇదిగో ఈకధ  ఆమె నోట మొదటిసారి బయటకు వచ్చింది. అలా పిల్లలు పుట్టడం దోషం అని, పుట్టగానే,  రోజుల బిడ్డగా వున్న మా నాన్నగారిని ఎరుకల బూశామ (బూశమ్మ)కు దానం ఇచ్చారట. ఆమె పిల్లవాడిని తన గుడిసెకు తీసుకుపోయింది. తరువాత ఆ పసివాడిని గంపలో పెట్టుకుని ‘పండ్లోయమ్మ పండ్లు’ అంటూ భూశమ్మ వూళ్ళో  తిరుగుతుంటే, చెల్లమ్మగారు వెళ్లి,  ‘మాకు ఓ పండు కావాలి అమ్ముతావా’ అని అడిగి,  సోలెడు సజ్జలు భూశామకు ఇచ్చి పిల్లవాడిని కొనుక్కుని ఇంటికి తీసుకు వచ్చిందట. అలా, ఆ దోష పరిహారం జరిగిందన్నమాట. మా నాన్నగారు తన 53వ ఏటనే చనిపోయారు. మా తాతగారు, ముత్తాత గారు సుమారుగా అదే వయస్సులో పోయారు. మొదటి పర్వతాలయ్య గారిని కూడా ఆ వయస్సులోనే  హత్య చేసారు. అప్పయ్య గారి సంగతి తెలియదు. బహుశా షష్టిపూర్తి చేసుకున్నారేమో. అలా జరిగివుంటే, ఆయన తరువాత, నా వూహ ప్రకారం, మొదటి వరుస సంతానంలో షష్టిపూర్తి చేసుకున్నది నేనేనేమో.నందిగామలో జనన మరణ రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తేదీలు పట్టుకుంటే కాని ఈ విషయం గట్టిగా చెప్పలేము.


(భండారు వారి ఆడపడుచులు - మధ్యలో మా అమ్మగారు)

చెల్లమ్మగారికి పుట్టిన ఒకే ఒక కూతురు రుక్మిణమ్మ గారి ద్వారా యెంత సంతతి, ఎన్ని కుటుంబాలు తామర తంపరగా వర్దిల్లాయో తలచుకుంటే అబ్బురమనిపిస్తుంది. మా నాన్నగారికి ఏడుగురు ఆడపిల్లలు. నలుగురు మొగపిల్లలు.


(మళ్ళీ వాళ్ల పిల్లలకు పిల్లలు)

(సంతానం లేనివాళ్ళు మా ఇంట్లో పందిరి గుంజను ముట్టుకుంటే పిల్లలు పుడతారని హాస్యంగా చెప్పుకునేవారు)

(మరో భాగం మరో సారి)       

30, జులై 2013, మంగళవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)



చెల్లమ్మ గారు, మా బామ్మ రుక్మిణమ్మ గారు మహమ్మదీయ మతం పుచ్చుకున్నారు. డానికి మా పెద్ద మేనత్త రంగనాయకి గారి ప్రోద్బలం కారణం. రంగనాయకి గారి  భర్త కొలిపాక లక్ష్మీ నరసింహారావు గారు. నరసింహారావుగారి అన్నగారు కొలిపాక శ్రీరాం రావు గారు వరంగల్లులో పెద్ద వకీలు. ఈయన గారి ప్రోద్బలంతో తమ్ముడు లక్ష్మీ నరసింహారావు, ఆయన భార్య రంగనాయకి మతం మార్చుకున్నారు. శ్రీరాం రావు గారు పెద్దపల్లి రాజాగారి ప్రోద్బలంతో ముస్లిం మతం పుచ్చుకున్నారు. పెద్దపల్లి రాజాగారికి నిజాం నవాబు, అక్కడి వాక్ఫ్ ఆస్తుల ఆజమాయిషీ అప్పగించారుట. అయితే ముస్లిం కానివాడు వాక్ఫ్ ఆజమాయిషీ చేయడంపై ఆక్షేపణ వచ్చింది. ఆ తరువాత కారణం ఏదయితేనేం, ఆయన ఇస్లాం ఉపదేశం తీసుకున్నారు. ఆ విధంగా ఈ కుటుంబాల్లో అన్నీ హిందూ పద్ధతిలో సాగిపోయినా, మతం స్వీకరించిన  కొందరు మాత్రం రోజూ క్రమం తప్పకుండా ఆరు సార్లు నమాజు చేసేవారు. రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) వుండేవారు. దాదాపు  తొంభై ఏళ్ళ వయస్సులో కూడా చెల్లమ్మగారు, మా బామ్మగారు పచ్చి మంచి నీళ్ళు సైతం ముట్టకుండా నిష్టగా ఉపవాసాలు చేసేవాళ్ళు. మళ్ళీ భారత భాగవతాలు చదవడం, యాత్రలు చేయడం అన్నీ ఉండేవి.  మా బామ్మ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ యాత్రలు అన్నీ చేసింది. చెల్లమ్మ గారు మాకు బుద్ధి తెలిసిన తరువాత ఎటూ వెళ్ళేది కాదు. ఎప్పుడూ కంభంపాడులోనే తావళం తిప్పుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ, పిల్లలకు భారత, భాగవతాల్లోని పద్యాలు, కధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది. పొద్దుగూకేవేళకు  పిల్లలందరూ  ఆమె మంచం చుట్టూ మూగేవాళ్ళు. ఈ రోజు భండారు వంశంలో చాలామందికి పురాణాల మీద పట్టు చిక్కడానికి, సంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కలగడానికి చెల్లమ్మగారి  ప్రవచనాలే కారణం. వరంగల్లులో శ్రీ రాం రావుగారు మరణించినప్పుడు ఆయనను ముస్లిం మతం ప్రకారం ఖననం చేయాలని ఆ మతం వారు, కాదు దహనం చేయాలని హిందువులు పట్టుబట్టారు. అప్పుడు, ఆయన  స్వగ్రామం అయిన రెబ్బవరంలో  అంత్యక్రియలు చేస్తామని చెప్పి మృత దేహాన్ని  రహస్యంగా హైదరాబాదు తీసుకువెళ్ళి బారకాస్ లో సమాధి చేసారు. అయితే చెల్లమ్మగారు చనిపోయినప్పుడు మా వూళ్ళో ఏమీ గొడవలు కాలేదు. వూళ్ళో అప్పుడు పాతిక, ముప్పయిదాకా బ్రాహ్మణ గడప వుండేది. మూడు పంచాంగాలు మా వూరినుంచి వెలువడేవి. మా చిన తాతగార్లు ఇద్దరు సనాతన సంప్రదాయవాదులు. అయినా ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు. ఆ రోజుల్లో వైదికులు  చనిపోతే  వైదికులే మోయడం, నియోగులు పోతే నియోగులే మోయడం వుండేది. సామాన్యంగా ఒకరికొకరు శవవాహకులుగా వుండేవారు కాదు. అలాటిది చెల్లమ్మగారు పోయినప్పుడు వైదీకులు అయిన ఇంగువ వెంకటప్పయ్యగారు కూడా ముందుకు వచ్చి మోశారు. స్మశానం దాకా హిందూ పధ్ధతి అంటే – స్నానం చేయించడం, విభూతి రాయడం, పాడెకట్టి మోసుకుని పోవడం జరిగింది. అప్పటికి మా నాన్నగారు పోయారు కాబట్టి నేనే (భండారు పర్వతాలరావు) అంత్యక్రియలు చేశాను. స్మశానం వరకు పాడెముందు నిప్పులేని కుండ పట్టుకుని నడిచాను. అక్కడ శవాన్ని పాతిపెట్టడం జరిగింది. తరువాత ఏం చేయాలో తెలియదు. నేను ఖమ్మం వెళ్లి మా మేనత్త పెనిమిటి (భర్త) లక్ష్మీ నరసింహారావుగారిని కలిసి జరిగిన వైనం చెప్పాను. ఆయన సంతోషించినట్టు కనబడ్డారు.  ‘ఇక చేయాల్సింది ఏమీలేదు. మామూలుగా హిందూ పధ్ధతి ప్రకారం కర్మ చేయి’ అన్నారు. కర్మ మామూలుగా చేసాము. దర్భ పుల్లకు శవ దహన సంస్కారం చేసి, ఆ తరువాత కర్మ పూర్తిచేయించారు.  పదో రోజున పేలాలు తీసుకువెళ్ళి ఖననం జరిగిన ప్రదేశంలో చల్లి వచ్చామని గుర్తు. ‘ఆమె ఎంతో పుణ్యాత్మురాలు. ఆమెకు ఏం చేసినా, ఏం చేయకపోయినా ఒకటే. పరమ భాగవతోత్తమురాలు. సతతం రామనామ స్మరణలోనే జీవితం వెళ్ళతీసింది. ‘ఇదంతా మన తృప్తికే కాని ఆమె తరించడానికి అక్కరలేదు’ అని వెంకటప్పయ్య గారు అనేవారు. దురదృష్టం ఏమిటంటే ఆమెను ఖననం  చేసిన ప్రదేశాన్ని గుర్తు పెట్టుకుని సమాధి నిర్మించడం లాంటిది జరగలేదు. మా బామ్మ విషయంలోనూ అలాటి అలసత్వమే జరిగింది. (మరో భాగం మరో సారి)

29, జులై 2013, సోమవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


పర్వతాలయ్యగారికి పెద్ద మీసాలు ఉండేవి. వెనుక జుట్టు ముడి వుండేది. సింహలలాటం మురుగులు ధరించేవారు. మిత భాషి. అయినా చమత్కారంగా మాట్లాడేవారు. సౌమ్యుడు, సాత్వికుడు. కానీ ఒక్కోసారి తీవ్రంగా కోపం వచ్చేది. ఏదీ మనసులో ఉంచుకునే తత్వం  కాదు. ఆయన చివర దశలో కాళ్ళు చచ్చుపడ్డాయి. దాదాపు పది పన్నెండేళ్ళు మంచం మీద కూర్చునే కరణీకం చేసారు. ఆయనకు ఎనిమిదవ ఏట పెళ్లయింది. అప్పుడు మా బామ్మ రుక్మిణమ్మ గారికి నాలుగేళ్ళు.



(కీర్తిశేషులు భండారు రుక్మిణమ్మ గారు)



ఆమె తండ్రి కాకరవాయి (కాకరాయి) వాస్తవ్యులు, కందిబండ చిదంబరం గారు. తల్లి చెల్లమ్మ గారు. చిదంబరంగారు చనిపోయేనాటికి మా బామ్మ ఒక్కతే  కూతురు. చెల్లమ్మగారికి అప్పటికి ఇంకా పదహారేళ్ళు కూడా నిండలేదు. భర్త పోయిన తరువాత  కొన్నాళ్ళకు చెల్లమ్మ గారు కాకరవాయి లోని తమ వాటా ఇల్లూ, పొలాలు అమ్మేసుకుని పదివేల రూపాయలు తెచ్చి మా నాన్నగారికి ఇచ్చిందట. బహుశా 1929, 1930  ప్రాంతాల్లో అయివుండవచ్చు.  ఆ సొమ్ముతోనే మా నాన్నగారు ప్రస్తుతం వున్న మా ఇల్లు కట్టారని అంటారు.చెల్లమ్మగారు అప్పటినుండి మా ఇంట్లోనే వుండేది. ఆమె భాగవతం నిత్య పారాయణ చేసేది. భారతం, భాస్కర రామాయణం, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం కూడా చదువుతూ వుండేది. అయితే ఆమెకు రాయడం బొత్తిగా రాదు. చదువుకున్నవారికే వోటు హక్కు అని ఆరోజుల్లో ఒక రూలు వచ్చిందట. మా నాయనమ్మమ్మ చెల్లమ్మగారికి కాని, మా నాయనమ్మ రుక్మిణమ్మ గారికి కాని, మా అమ్మగారు వెంకట్రావమ్మ గారికి కాని చదవటం చక్కగా వచ్చు కాని రాయడం రాదు. అందుకని వాళ్ళందరికీ తమ పేర్లు (సంతకం) రాయడం వరకు నేర్పించారట.
మా చిన్నతనంలో చిట్టేల కోటయ్య పంతులు గారు తన దగ్గర చదువుకునే పిల్లల్ని ఇంటి దగ్గర కూడా చదివినట్టు వాళ్ళ పెద్దవాళ్ళచేత పలకపై రాయించుకుని రమ్మనేవారు. మేం చెల్లమ్మగారికి ‘చదివినాడు’ అనే పదం రాయడం నేర్పాము. ఆమె పలక మీద అదే రాసి ఇచ్చేది. సామాన్యంగా ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ పుస్తకం పట్టుకునే అలవాటు  లేదు. అది చూసి చెల్లమ్మగారు ‘ఇవ్వాళ  మీరు చదవలేదు’ అని రాస్తానని మమ్మల్ని బెదిరించేది. కాని అల్లా రాయడం ఆమెకు రాదని మాకు తెలుసు. చాలా మెత్తని మనిషి కనుక ‘చదివినారు’ అనే రాసిచ్చేది. ఆమె  దాదాపు  95 సంవత్సరాలు జీవించింది. చక్కిలాలను నమలగలిగే దంత పటిమ వుండేది. మనిషి బాగా వంగిపోయినా ఎప్పుడు నవిసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఆఖరి రోజున కూడా కాలకృత్యాలు తీర్చుకునేందుకు మనుమరాళ్ళు ప్రేమ,భారతి సాయంతో దొడ్లో చింతచెట్టు వరకు చేతి కర్ర పొడుచుకుంటూ  నడిచి వెళ్లి వచ్చింది. పండ్లు తోముకుంటూ పక్కకు వాలిపోయి   అనాయాసంగా మరణించింది. ఆమె మరో రెండు రోజులకు పోతుందనగా నాకు (భండారు పర్వతాలరావు) లా కాలేజీ తెరవడం వల్ల హైదరాబాదు ప్రయాణం అయ్యాను. ఆమెకు దండం పెట్టడానికి వెడితే ‘రెండు రోజులు తాళు (ఆగు)’ అంది. నేను ప్రయాణం మానేసాను. సరిగ్గా రెండో రోజునే  ఆమె మరణించింది. అంతకు ముందు రాత్రి కూడా రోజు మాదిరిగానే గజేంద్ర మోక్షం లోని పద్యాలు పొద్దు పోయిందాకా చదివి పండుకుంది. (మరో భాగం మరోసారి)

28, జులై 2013, ఆదివారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


పోతే, ఇంగువ వారి పూర్వీకులకు ఆశ్రయం కల్పించింది కూడా మా రామయ్య గారే. ఈరోజుల్లో ఇండ్ల స్థలాలు, పొలాలు ఇప్పించడం అనేది మంత్రులు కూడా చేయలేని పని. మంత్రివర్గం మాత్రమే   చేయగలిగే ఈ పనులను ఆ రోజుల్లో గ్రామ కరణాలు సునాయాసంగా  చేయగలిగేవారు. అదీ నోటి మాటతో.
రామయ్య, లక్ష్మయ్యగార్ల హయాం లోనే వారికీ, వారి చిన తాత రామలింగయ్య (కోర్టు తీర్పులో  లింగయ్య అనే వుంది ) కుమారుడు చిన కామయ్య గారికీ దావా నడిచింది. బెజవాడ డిస్ట్రిక్ట్ మునసబు కోర్టులో నడిచిన ఈ దావాలో వాది  చిన కామయ్య కాగా ప్రతివాదులు రామయ్య, లక్ష్మయ్యలు.  దావా పర్యవసానం ఎలా వున్నా, దానికి సంబంధించిన కోర్టు తీర్పులో మాత్రం  భండారు వంశం వారి పూర్వీకుల పేర్లు వివరంగా పేర్కొనడం జరిగింది.

రామయ్య గారి భార్య శేషమ్మ గారు. ఆమె దాదాపు ఎనభై ఏళ్ళకు  పైగా బతికింది. నాకు కూడా గుర్తే. రామయ్య గారి దంపతులకు ముగ్గురు కుమారులు. పర్వతాలయ్య, లక్ష్మీ నారాయణ, వెంకట సుబ్బారావు. కుమార్తెల సంగతి స్పష్టంగా తెలియదు. కొడుకులలో పెద్దవాడయిన పర్వతాలయ్య గారిదే కరిణీకం. చాలా కాలం అన్నదమ్ములందరూ  కలిసే వున్నారు. అప్పుడు మా ఇల్లు ఉత్తర ముఖంగా వుండేది. ప్రస్తుతం సుబ్బయ్య తాతయ్య జాగాలోకి వున్న బేస్ మట్టం, మెట్లు అప్పుడు ఇంటికి సింహద్వారం వైపు ఉండేవి.  ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతి కావడం వల్ల,  మా నాన్నగారు రాఘవరావు గారు ఇప్పుడున్న ఇంటిని నిర్మించారు.


(దాదాపు వందేళ్ళ క్రితం తిరిగి నిర్మించిన ఇప్పటి ఇల్లు) 

ప్రమాదంలో కొంత కాలిన దూలాలను కొన్నింటిని కొత్త ఇంటి నిర్మాణంలో వాడారు. అ ఇల్లు కట్టినప్పుడు మా తాతగారు పర్వతాలయ్య గారు బతికే వున్నారు. తరువాత  అన్నదమ్ములు ముగ్గురు వేర్లు పడ్డారు. లక్ష్మీనారాయణ గారు మా ఇంటికి దగ్గరలోనే  కొండారెడ్డి జాగా కొనుక్కుని వేరే ఇల్లు కట్టుకున్నారు. సుబ్బయ్య గారు మా ఇంటి పక్కనే ఒక పూరిల్లు వేసుకుని వుంటూ వుండేవారు. ఆ రోజుల్లో ఊళ్ళోకి తాసిల్దారు  రావడం అంటే ఎంతో  గొప్ప విషయం. వూరికి వచ్చిన తాసీల్దారు వూరికే కూర్చోకుండా   పొలాల వెంట తిరుగుతూ,  అడంగల్ లో రాసిన విధంగా పంటలు వాస్తవంగా వేసేరో  లేదో ప్రత్యక్షంగా తనిఖీ చేసేవాడట. అందుకోసం ఆయన దర్జాగా మేనాలో వెడుతుంటే  కరణం, మునసబులు ఆ మేనాకు చెరో వైపు,  వెంట పరిగెత్తుతూ పంటల వైనం,  సర్వే నెంబర్లు వివరించేవారట. అప్పుడు అందరికీ గుర్రాలు ఉండేవి. ప్రయాణాలు ఎక్కువభాగం కాలినడకనా, గుర్రాలమీదా సాగేవి. ఆడవాళ్ళు  మేనాలో గాని ఎద్దు బండ్ల పైగాని ప్రయాణం చేసేవారు.(నాటి మేనా ఒకటి ఇటీవలి కాలం వరకు మా ఇంట్లో వుండేది) మోతుబరులు, కరణాలు గుడిసె బండ్లలో వెడితే, సంసారులు(రైతులు) జల్ల బండ్లలో వెళ్ళేవాళ్ళు. బండ్ల ప్రయాణంలో ముందు జీతగాళ్ళు తాళ్ళు పట్టుకుని  నడుస్తుంటే వెనుక వెట్టివాళ్ళు (ఇప్పటికి వాళ్ళు గ్రామోద్యోగులయినా వెట్టివాళ్ళనే  పేరు పోలేదు. ఒకప్పుడు వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ బతికేవాళ్ళు. మోతాదు, వెట్టివాడు అని పిలిచేవాళ్ళు.  మా నాన్నగారి వద్ద  అలాటివాళ్ళు ముగ్గురు వుండేవాళ్ళు). ప్రయాణంలో వొడ్డేరకాలు (ఎత్తుపల్లాలు) వచ్చినప్పుడు బండి పడిపోకుండా ఛట్రం పట్టుకుని  బరువానేవాళ్ళు.  వానాకాలం ఒక్కొక్క బండికి రెండేసి జతల ఎడ్లను తాగాడిగాళ్లు కట్టేవాళ్ళు. అసలా రోజుల్లో కరణాలు తప్ప ఎవరూ  బండ్లు కట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. వ్యవసాయప్పని చెడుతుందని కొంతా, ఎడ్లు దెబ్బతింటాయని కొంతా, వారి  భయం.  (మరో భాగం మరో సారి)       

27, జులై 2013, శనివారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


ఆరోజుల్లో  పుట్టి ధాన్యం రూపాయకో, రెండుకో అమ్ముడయ్యేది. పంటలన్నీ వర్షాధారం. ధరలు లేవు. దానితో చాలామంది రైతులు శిస్తు కట్టలేక పొలాలు వొదిలేసి వెళ్లిపోయారట.  అప్పటి నిబంధనల ప్రకారం ఆ శిస్తు తాను  చెల్లించి ఆ పొలాలను రామయ్య గారు తీసుకున్నారట.

ఆయనకు కరిణీకం చేసినందుకు లభించే జీతం నెలకు మూడో నాలుగో రూపాయలు. (పూర్తిగా వెండి తో తయారు చేసిన వీటిని 'విచ్చు రూపాయలు' అనే వాళ్ళు). అవేం చేయాలో తెలిసేది కాదు.  వస్తువులు అన్నీ గ్రామంలోనే  లభించేవి. దాంతో జీతం రూకలను గూట్లో గిరవాటు వేసేవారట. అలా గూట్లో పడివున్న రూపాయలు,  శిస్తు కట్టలేని రైతుల పొలాలు కొనుక్కోవడానికి అక్కరకు వచ్చాయట.


(మా వూళ్ళో మా ఇల్లు - ఇటీవలి చిత్రం) 

రామయ్య గారు చాలామందికి ఆశ్రయం కల్పించారు.  ఒకసారి ఆయన వాకిట్లో అరుగు మీద కూర్చుని మొహం కడుక్కుంటూ వుంటే  వేరే వూరు రైతు ఒకరు అటుగా  వచ్చాడట. ‘ఎక్కడికి’ అని అడిగితే  ‘ఎక్కడ పని దొరికితే అక్కడికి’ అని అన్నాడట. ‘నీకెంత పొలం కావాలో తీసుకో ఇప్పిస్తా. ఇక్కడే వుండిపో ‘ అన్నాడట రామయ్య గారు. ఆ రైతు ఎవ్వరో కాదు ప్రస్తుతం వూరి మోతుబరుల్లో ఒకరయిన  శ్రీ బండి సత్యనారాయణ (బండి సత్యం)పూర్వీకుడు.


(శ్రీ బండి సత్యం బియ్యేతో నేనూ,  మా రెండో అన్నయ్య శ్రీ భండారు రామచంద్రరావు, రిటైర్డ్ సీజీఎం, ఎస్.బీ.ఐ., -ఇటీవలి చిత్రం)    


శ్రీ సత్యనారాయణ,  నేనూ (భండారు పర్వతాలరావు) మా వూరిలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్లం. నేను చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల్లో కుదురుకుపోయాను. బండి సత్యం, బియ్యే  మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయాడు. అది వేరే కధ.
అలాగే వేమిరెడ్డి వారికి ‘మీరెంత అడవి కొట్టుకుంటే  అంత పొలం ఇస్తానని’ చెబితే వాళ్ళు అడవి నరికి పొలం చేసుకుంటూ కంభంపాడులోనే వుండిపోయారు.   ప్రస్తుతం వేమిరెడ్డి వంశం వాడయిన ఓబుల్ రెడ్డి( నరిసిరెడ్డి దత్తత కుమారుడు) చామర్తి వీరభద్ర రావు గారు, భండారు కామాక్షమ్మ గారు, భండారు రామకృష్ణయ్య గార్ల ఇండ్ల స్థలాలన్నీ రామయ్యగారివే. భండారు సీతారామయ్య గారు తన కూతురు రాజమ్మ గారిని, మా పెద్ద  మేనమామ, బెజవాడలో ప్రముఖ న్యాయవాది అయిన  కొండపల్లి శ్రీ రామచంద్రరావుగారికి  భార్య చనిపోతే,  రెండో సంబంధం ఇచ్చారు.   తరువాత కంభంపాడులోని పొలాలు, ఇళ్ళ స్థలం అమ్మేసుకున్నారు. ప్రస్తుతం మా ఇంటికి ఐ మూలగా ఓబులరెడ్డి ఇల్లున్న స్థలం రామయ్య గారిదే. ఓబులరెడ్డి పినతండ్రి కొడుకు పేరు కూడా ఓబులరెడ్డే. వేమిరెడ్డి కిష్టారెడ్డి ఏకైక కుమారుడు. మా మూడో తమ్ముడు భండారు వెంకటేశ్వర రావు (తదనంతర కాలంలో మా వూరు కరణంగా పనిచేశాడు, ఇంట్లో వెంకప్ప అని పిలిచేవారు)కు మంచి స్నేహితుడు. మాకు ఎదురిల్లు. తినడానికి, పడుకోవడానికి మినహా రోజంతా మా ఇంట్లోనే ఉండేవాడు. అసలు పేరు ఓబులరెడ్డి అయినా అందరు కోటిరెడ్డి (కోటయ్య) అనే వాళ్ళు. చదువు ఎలిమెంటరీ స్థాయి దాటకపోయినా, మంచి ఇంజినీరింగు స్కిల్స్ ఉండేవి. సొంతంగా ఇంట్లోనే రేడియోలు, టీవీలు తయారుచేసేవాడు. తాలూకా మొత్తంలో ఎక్కడా లేనప్పుడే మా వూళ్ళో కేబుల్ టీవీ నడిపేవాడు) దురదృష్టం. ఆ చిన్ననాటి స్నేహితులిద్దరూ (కోటయ్య, మా తమ్ముడు వెంకప్ప) చిన్న వయస్సులోనే కన్నుమూశారు. (మరో భాగం మరోసారి)

26, జులై 2013, శుక్రవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


భండారు  వీరేశం గారికి నలుగురు కొడుకులు. కూతుళ్ళ సంగతి వంశవృక్షం గాని, కోర్టు తీర్పులు కాని చెప్పడం లేదు.  కొడుకులు: రాజయ్య(రాజన్న).అప్పయ్య, రామలింగయ్య (లింగయ్య), బసవయ్య.
రాజయ్యగారికి కనకయ్య (ఈయనకు వీరేశలింగం అనే పేరు కూడా వుంది). రాజయ్య (రాజన్న) అని ఇద్దరు కొడుకులు. వారిద్దరూ అవివాహితులుగా, నిస్సంతుగా చనిపోయారని కోర్టు తీర్పులో వివరించారు. 

అప్పయ్యగారికి చాలాకాలం సంతానం లేదు. దానిపై ఆయన,  శ్రీశైలం వెళ్లి అక్కడ మల్లిఖార్జున దేవాలయ ప్రాంగణంలో వున్న సంతానవృక్షానికి ప్రదక్షిణాలు చేసి వచ్చారట. తరువాత ఆయనకు ఒక కుమారుడు కలిగాడు.  ఆయనకు శ్రీ పర్వతం (శ్రీ శైలం) పేరిట పర్వతాలయ్య అని పేరు పెట్టుకున్నారు. ఈయనే పర్వతాలయ్య -1 (కోర్టు తీర్పులో పర్వతాలు అనే వుంది). ఈయన కంభంపాడు గ్రామ కరిణీకం చేస్తూ వచ్చారు. ఆయనకూ, గ్రామంలోని కమ్మ రైతు పెద్దలకు ఒకసారి  కచేరిసావిడిలో కొంత వాగ్వాదం జరిగిందట. అప్పుడు అంతా బొడ్లో పేష్ కప్ (ఒకరకం చిన్న చాకు) పెట్టుకుని, తలపాగాలు చుట్టుకుని వచ్చేవారట. పర్వతాలయ్య గారు  ఈక కలంతో ఏదో రాసుకుంటున్నారు.  ఏదో మాటామాటా వచ్చి ‘మా కత్తి గొప్పా, నీ కలం గొప్పా’అని  అడిగారుట. ఆయన ‘నా కలమే గొప్ప’ అనడంతో మాటకు మాట  పెరిగింది. సరసం విరసం అయింది. వాళ్ళు ఇళ్ళకు వెళ్లి, వరిగడ్డి, కుండల్లో చద్దన్నాలు బండ్లలో పెట్టించుకున్నారట.  ఆ పళాన వెళ్లి,  అర్ధరాత్రి పర్వతాలయ్య గారిని లేపి, దొడ్లో చింతచెట్టు కిందకి తీసుకుని వెళ్లి, కత్తితో  పొడిచి హత్య చేసారు. ముఖ్యంగా కుడి చేతిపైనా,  నాలికపైనా పొడిచారట.  కొనవూపిరితో వుండగా ఎవరయినా వచ్చినా  తమ  పేర్లు చెప్పకుండా ఉండడానికి అలా చేశారుట.  తరువాత బండ్లు కట్టుకుని పొరుగున వున్న నైజాంలోకి పారిపోయారుట. జరిగిన ఘోరం చూసి ఆయన భార్య (పేరు వెంకమ్మగారని గుర్తు) ఏడుస్తుంటే పర్వతాలయ్యగారు ఆ నెత్తురుతోనే,  ‘నా’ , ‘కా;  అనే అక్షరాలు రాశారుట. ‘నా’ అంటే నారాయణ అనీ, ‘కా’ అంటే కామయ్య అనీ అందరికీ అర్ధం అయింది. కాని, పోలీసులు వచ్చి అడిగితే పర్వతాలయ్యగారి భార్య ఎవరి పేరు చెప్పలేదట. (బహుశా  చెబితే వాళ్ళు పగబట్టి  పిల్లలకు హాని తలబెడతారన్న భయంతో  కావచ్చు) ‘ఎవరి పాపాన వాళ్ళే  పోతారు. నాకేం తెలియదు. చీకటి.  ఎవరూ కనబడలేదు’ అన్నదట. అప్పుడామెకు ఇద్దరు కొడుకులు.  రామయ్య, లక్ష్మయ్య.  రామయ్యకు పన్నెండేళ్ళు.  అయినా,  ‘మీ తండ్రి కరణీకం ఇస్తా చేస్తావా?’  అని తాసీల్దారు అడిగితే,  ‘చేస్తాన’ని దస్త్రం  తీసుకున్నాడట.   ఆరోజుల్లో కరిణీకం ఉద్యోగానికి  మేజరయి ఉండాలన్న నియమం  లేదన్నమాట.


(ఆరోజుల్లో గుర్రాలను వొదిలేస్తే అవి మేసినంత మేర కరణం గారి పొలాలని చెప్పుకునేవాళ్ళట. అలాటిది ఇవ్వాళ ఒక్కపూటలో పొలాలు, తోటలు తిరిగివస్తున్నారు) 


రామయ్యగారి హయాంలో కుటుంబం ఆస్తి బాగా పెరిగింది. వూళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పోయేసరికి మూడువందల ఎకరాల పొలం వుండేది.


తన తమ్ముడు లక్ష్మయ్యను ఆయన రాజయ్యకు దత్తు ఇచ్చారు.  లక్ష్మయ్య కొడుకు నాగభూషణం కాశీకి వెళ్లి అక్కడ గతించాడు.  అప్పుడు మళ్ళీ తన రెండవ  కొడుకు లక్ష్మీనారాయణను   ఆయన భార్య చుక్కమ్మగారికి దత్తు ఇచ్చారు. కొందరు బంధువులు  నాగభూషణం  మృతి విషయమై అనుమానాలు వ్యక్తం చేశారట. అవన్నీ తరువాత సమసిపోయాయి. (మరో భాగం మరో సారి)

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

కానీ వీటిని బట్టి వూరి చరిత్ర తెలుసుకునే వీలు తక్కువ. అయితే చాలా ఏళ్ళుగా వున్న  గ్రామం అని చెప్పవచ్చు.  ‘స్తంభము ప్రోలు’ అన్నది కంభం పాడు  అన్న పేరుకు మూలం కావచ్చు. లేదా ‘స్థంభం పహాడ్’ కాలక్రమంలో కంభంపాడు కావచ్చు. కానీ ఈ గ్రామానికి సమీపంలో స్థంభం కానీ, పహాడ్ కానీ లేవు. ఇక్కడ లోగడ ఏదయినా ‘జయస్థంభం’ లాంటిది వుంటే, స్థంభం ప్రోలు లేక కంభంపాడు అనే పేరు వచ్చి ఉండవచ్చు.  ఆ రోజుల్లో ఇలాటి జయ స్తంభాలను చాలాచోట్ల నెలకొల్పి వుంటారు. కనుక కంభంపాడు అన్న పేరుతొ చాలా గ్రామాలు కనిపిస్తాయి. మధిర దగ్గర ఒకటి, తిరువూరు దగ్గర ఒకటి, అమరావతి దగ్గర వైకుంఠ పురం దగ్గర మరోటి వున్నాయి. గ్రామ చరిత్రను తెలుసుకోవాలంటే బందరు వెళ్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో పురాతన పత్రాలను శోధించాల్సి వుంటుంది.


(కంభంపాడులో మా ఇల్లు - పెరడు వైపునుంచి)


కంభంపాడుకు  భండారు వారు రావడం గురించి వంశ వృక్షంలో కాని, కోర్టు తీర్పులో కాని, వివరాలు అంటే తేదీలు వగయిరా  పేర్కొనలేదు. వాడేల రామరాజు గారని ఒకరుండేవారు. ఆయన భార్య బుచ్చమ్మ. వారికి మగపిల్లలు లేరు. ఒక్కతే  కుమార్తె. ఆమెను కంచెల గ్రామంలో భండారు వీరేశలింగం గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరేశలింగంగారు కంభంపాడుకు వచ్చి స్థిర పడ్డారు. (ఒకరకంగా ఇల్లరికం అన్నమాట) లక్ష్మీనారాయణగారు రాయించిన వంశ  వృక్షం ఆయనను వీరేశలింగంగా  పేర్కొంటోంది. సుబ్బారావుగారు రాయించిన దానిలో వీరేశం అనే వుంది. (కోర్టు తీర్పులో కూడా ఇంటి పేరు ‘బండారు’ అనే వుంది  కాని ‘భండారు’ అని లేదు. అయితే ఇది రాయసకాని పొరబాటు అని అనుకోవచ్చు. ఇంచుమించు అదే కాలంలో భండారు లక్ష్మయ్య కులకర్ణి గారు రాసిన ఒక అర్జీలో  ఇంటి పేరును స్పష్టంగా  ‘భండారు’ అనే రాసారు.) కనుక భండారు వీరేశం లేక భండారు వీరేశలింగం అనే ఆయన కంభంపాడులో భండారు వారికి మూలపురుషుడు అనడంలో సందేహం లేదు. కంచెల గ్రామంలో కాని, వేములపల్లిలో గాని ఎవరయినా వంశ వృక్షాలు రాయించి దాచి  వుంటే వీరేశం గారి పూర్వీకుల గురించి తెలుసుకునే వీలువుంటుంది. అయితే వేములపల్లిలోని వంశ వృక్షాలను  గురించి కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  అగ్రహారం పంపకాలలో కోర్టు కెక్కి అక్కడివారు తమ తమ సానుకూలాన్ని బట్టి వంశ వృక్షాలు రూపొందించి ఉంటారని కొందరి వూహ. వేములపల్లి భండారు వారు లింగాలను ధరించారు. అయితే కంచెల, పల్లగిరి భండారు వారు, వారివలె  లింగధారులు  కారు. ఆరువేల నియోగులు. స్మార్తులు. యజుస్మాఖాధ్యాయులు. ఆపస్తంభ సూత్రులూను. (మరో భాగం మరోసారి)
(26-07-2013)