6, ఆగస్టు 2013, మంగళవారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)
మా కుటుంబం మొత్తంలో భండారు సుబ్బారావు తాతగారి తరహానే  వేరు. పిల్లలు లేని కారణంగా వూళ్ళో అందర్నీ పిల్లలుగా చూసుకునే వారు. కష్టసుఖాలు గమనించి సాయం చేస్తూ  వుండేవారు. తరచుగా సతీసమేతంగా తీర్ధయాత్రలు చేస్తుండేవారు.కాశీ రామేశ్వరాలు తిరిగివచ్చిన పుణ్యశాలి. ఆయన భార్య సీతమ్మ గారు  కందిబండ వారి ఆడపడుచు. భర్తకు జడియడమే సరిపోయేది. ఆ రోజుల్లో భార్యలపై చేయిచేసుకోవడం వుండేది. కాని మా తాతగారికీ, నాన్నగారికీ అది అలవడలేదు. అయితే మా చినతాతలిద్దరికీ ఆ అలవాటు వుండేది. సుబ్బయ్య తాతగారు మాత్రం ఆవేశంలో ఏదయినా తప్పుచేస్తే  వెంటనే పశ్చాత్తాపం చెందేవాడు. ఎవరిమీద అయినా చేయి చేసుకుంటే ముందు బావి దగ్గరకు వెళ్లి తలస్నానం చేసి జందెం మార్చుకునేవాడు. అంతేకాదు. ఆ కొట్టిన వాడిని పిలిపించి మానెడు జొన్నలు ఇచ్చి పంపేవాడు. బీదాబిక్కీ ఎవరికయినా పనిదొరక్కపోతే, ‘ఇవాళ సుబ్బయ్యగారితో నాలుగు దెబ్బలు తిన్నా బాగుండు’ అనుకునేవారు. అంతేకాదు ఎవరయినా అప్పు అడగడమే తరువాయి, లేదనకుండా వెంటనే వందా రెండొందలు  ఇచ్చేవాడు. అసలు, వడ్డీ కలిపి ఎంతవుతుందో లెక్క కట్టి, ఎవరికెంత ఇచ్చిందీ వివరాలన్నీ పెన్సిల్ తో గోడమీద రాసేవాడు. ఒకసారి మరచిపోయి సున్నం కొట్టించాడు. అంతే!  మొత్తం పద్దులన్నీ మాఫీ. అప్పులు మాఫీ చేసే విషయంలో చరణ్ సింగుకు దోవ చూపించింది సుబ్బయ్య తాతయ్యే అనవచ్చు.


(సుబ్బయ్య తాతయ్య - సీతం బామ్మ) 

మా నాన్నగారికీ, లక్ష్మయ్య తాతయ్య గారికీ నడుమ జరిగిన తగాదాల్లో సుబ్బయ్య తాతయ్య ఎప్పుడూ నాన్న పక్షానే నిలబడేవాడు. నాన్నగారికి సుస్తీ చేసిన సమయంలో ఆయన ఎంతో ఆదుకున్నాడు. అప్పులన్నీ తీర్చి వేసాడు. చికిత్స గురించి శ్రమ పడే వాడు. ఒకసారి, అప్పుడు నాకు (భండారు పర్వతాలరావు) పదిహేడు ఏళ్ళు ఉంటాయేమో. సందర్భం జ్ఞాపకం లేదు కాని అనవసరంగా ఆవేశపడి ఆయనతో మాట తూలాను. నా మాటల్లో తీవ్రత చూసి ఆయన ఆశ్చర్య పడ్డాడే కాని కోపం తెచ్చుకోలేదు. తరువాత  నా తప్పు తెలుసుకున్నాకాని, ఆయన మనస్సు గాయపడింది అన్న విషయం కూడా బోధపడింది. చాలామందికి తెలియదు కాని నాది కోపిష్టి  మనస్తత్వం. అనాలోచితంగా, అనుచితంగా ప్రవర్తించడం, పెద్దవారిని నొప్పించడం దురదృష్టవశాత్తు పరిపాటి అయిపోయింది. భోలాశంకరుడుగా పేరున్న సుబ్బయ్య తాతయ్య గారికి చివరి రోజుల్లో భగవంతుడు పరీక్షలు పెట్టాడు. ఆయన భార్య సీతమ్మగారు పక్షవాతంతో తీసుకుని మరణించింది. ఆయనకు  కూడా పెద్దతనంలో ఒక కాలూ చేయీ పడిపోయింది. ఆయన ఔదార్యం మళ్ళీ, ఆయన పెంపకానికి తీసుకున్న మా రెండో తమ్ముడు రామచంద్రరావుకు వచ్చింది. మొత్తం కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కనిపెట్టి చూసే మంచి బుద్ధిని దేవుడు ప్రసాదించాడు. దత్తు పోవడంవల్ల అదనంగా వచ్చిన ఆస్తిపాస్తులను కూడా ఎప్పుడూ తన సొంతం అనుకోలేదు. ఈ సద్బుద్ధి మా తమ్ముడి పిల్లలకు కూడా వుండడం వల్ల ఆస్తుల విషయంలో మా కుటుంబంలో ఎలాటి పొరపొచ్చాలు తలెత్తలేదు. మా నాన్నగారు, తాతగారు పోయి అనేక దశాబ్దాలు గడిచినా ఇంతవరకు మా మధ్య , మా పిల్లల  మధ్య ఆస్తి పంపకాలు జరగలేదు. కంభంపాడు ఇల్లు, పొలాలకు సంబంధించి ఈనాటి వరకు మాది ఉమ్మడి కుటుంబమే. తమ్ముడు రామచంద్రరావు భార్య విమల కూడా,  చివరి రోజుల్లో మంచానపడిన  మా సుబ్బయ్య తాతగారికి ఎంతో సేవచేసింది.
అదేమిటో ఖర్మ తెలియదు కాని, మా కుటుంబంలో మగవాళ్ళు చివరి రోజుల్లో మంచానపడి, అవస్థలు పడి తీసుకుని తీసుకుని  పోయారు. మా నాన్నగారు దాదాపు మూడునెలలు మంచంలో వున్నాడు. లక్ష్మయ్య  తాతగారి పరిస్తితి మరీ దయనీయం. చెట్టంత ఎదిగిన మనుమడు సత్యమూర్తి ఆయన కళ్ళముందే అకాల మరణం చెందడం దారుణం. అందరిలోకి అదృష్టవంతురాలు ఆయన భార్య వరమ్మగారు. చనిపోయేముందు మొగుడి కాళ్ళు తన దగ్గర పెట్టుకుని, అందరికీ అన్నీ అప్పగింతలు పెడుతూ, ఏదో రైలుకు వెళ్ళేదానిలా హాయిగా అనాయాసంగా దాటిపోయింది.


(కంప్యూటర్లు లేని రోజుల్లో తొడమీద కాగితం దస్త్రాలు పెట్టుకుని వేల పేజీలు  కేవలం ధారణశక్తితో బాల్ పాయింటు పెన్నుతో రాస్తూ మా చరిత్రను గ్రంధస్తం చేసిన దార్శనికుడు, మా చోదక శక్తి, మా పెద్దన్నయ్య - కీర్తిశేషులు శ్రీ భండారు పర్వతాలరావు గారికి  యావత్ భండారు వంశం తరపున ఇవే కైమోడ్పులు. 2006  ఆగస్టు 21 న పుట్టపర్తిలో  కన్నుమూసిన ఆ  మహానుభావుడి  వర్ధంతి ఈ ఏడాది తిధుల ప్రకారం వచ్చే నెల మూడో తేదీ.)    


(మరో భాగం మరోసారి)             

కామెంట్‌లు లేవు: