20, ఆగస్టు 2013, మంగళవారం

చిత్రమైన 'చిత్రం'

కొన్ని చిత్రంగా అనిపిస్తాయి. ఈ చిత్రం అలాటిదే. ఇందులో ఒకరు ఫేస్ బుక్ మిత్రుల్లో చాలామందికి పరిచితుడే. జాగర్లమూడి రామకృష్ణ. సీనియర్ జర్నలిస్టు. పోతే రెండో వారే ‘ఈచిత్ర నాయకుడు’ అక్షరాలా నలభయ్ మూడేళ్ళ(?)


(మిత్రుడు జాగర్లమూడి రామకృష్ణ తో అలనాటి మా పెళ్లి పెద్ద గుడిమెట్ల జగన్నాధ శర్మ గారు)

 క్రితం చూసిన ఈ వ్యక్తిని ఈ రోజు మళ్ళీ ఈ ఫోటోలో చూస్తున్నాను. వీరి పేరు గుడిమెట్ల జగన్నాధ శర్మ గారు. ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంటులో పనిచేసి స్వచ్చంద పదవీ విరమణ చేసి ప్రసుతం హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ లో వుంటున్నారు. శర్మగారితో నాకో అవినాభావ సంబంధం ఒకటుంది. అలాటిది ఒకటుందని కూడా ఈ రోజే తెలిసింది. మా ఆవిడతో నా పెళ్లి, ‘ ప్రేమ పెళ్లి’  కావడం మూలాన,  మరీ మూడో కంటికి కూడా తెలియకుండా జరిగిందని చెప్పలేను కానీ,  తిరుపతి (తిరుమల) లో జరిగిన ఆ  మా పెళ్ళికి ‘అక్షరాలా’ మూడో ‘సాక్షి’ శర్మగారే. అదీ ఈ రోజు ఆయన ఫోనులో చెబితేనే తెలిసింది. 1971 డిసెంబరు 16 వ తేదీన ( సరిగ్గా ఆ రోజునే తూర్పు పాకీస్తాన్ విమోచన జరిగి బంగ్లాదేశ్ గా అవతరించింది) మద్రాసు నుంచి తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ కారులో శర్మ గారు కూడా వున్నారుట. ‘ట’ ఏముంది, ఈ విషయాన్ని ఆయనే ధృవీరించారు కాబట్టి ఇక పేచీ లేదు. అంత ముఖ్యమైన వ్యక్తిని యెందుకు మరిచిపోయానన్నవిషయంలో ఇక ఆయనే నాతొ పేచీ పెట్టుకోవాలి. కానీ మనిషిని (ఫోటోలో) చూస్తుంటే పేచీకోరులా కానరావడం లేదు. ఆ రోజు పెళ్లి భోజనం ఎట్లాగో పెట్టలేదు కాబట్టి, ఇన్నేళ్ళ తరువాత  ‘ఆ లాంఛనం’ తీర్చుకునే అవకాశం శర్మ గారు ఇస్తారన్న నమ్మకం వుంది. పోతే, ఈ ‘చిత్ర’ విజయానికి సూత్రధారి, కర్తా కర్మా క్రియా అయిన  మిత్రుడు జాగర్లమూడి రామకృష్ణకు, ‘సారా మామూలు’గా కృతజ్ఞతలు.

కామెంట్‌లు లేవు: