16, ఆగస్టు 2013, శుక్రవారం

ఇస్తినమ్మ వాయినం - పుచ్చుకుంటి వాయినం


టైం మేనేజ్ మెంట్ (సమయ పాలన), మెన్ మేనేజ్ మెంట్ (ఇక్కడ మెన్ అంటే మగవాళ్ళని కాదు, నిజానికి ఉమెన్ మేనేజ్ మెంట్) కు ఏదయినా ప్రపంచస్థాయి పెద్ద పురస్కారానికి  గ్రహీతలను  నిర్ణయించే బాధ్యత నాకిస్తే నేను ఖచ్చితంగా ఆ బహుమతిని  గంపగుత్తగా వరలక్ష్మీ వ్రతం నోముకునే ఆడవాళ్ళందరికి కలిపి ఇచ్చేస్తాను.ఏటేటా ఈ వ్రతం నిర్వహించడంలో ఆడవాళ్ళు పడే శ్రమదమాదుల మాట అటుంచి,   పేరంటాళ్ళను మేనేజ్ చేసే విధానం గమనించినప్పుడు నాకీ ఆలోచన కలిగింది. దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో ఒకరింటికి తాము పేరంటానికి వెళ్ళాలి. మళ్ళీ తమ ఇంటికి వచ్చే పేరంటాళ్ళను కనుక్కుని వాయినాలు ఇవ్వాలి. సమయం ఎలా సర్దుబాటు చేసుకుంటారో  ఎన్నిసార్లు బద్దలు కొట్టుకుంటున్నా నా చిన్న బుర్రకు ఎంతమాత్రం అర్ధం కాదు. కార్లూ డ్రైవర్లు వుండే మగ మహారాజులు కూడా అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళలేక సతమతమవుతారు.


అలాటిది, వానయినా వంగిడి అయినా,  కార్లూ డ్రయివర్లూ లేకున్నా,  ఆటోల్లో తిరుగుతూ అందరి ఇళ్ళను  అనుకున్న సమయానికి అనుకున్న వ్యవధిలో చుట్టబెడుతూ, మళ్ళీ తమ ఇంట్లో కూడా ఏమాత్రం తభావతు రాకుండా చూసుకుంటున్న  విధానాన్ని ఒకసారి గమనిస్తే నాతో మీరూ ఏకీభవిస్తారు.
ఇక పూజలూ వ్రతాలు అంటారా అది వాళ్ళ ఇష్టం. ప్రసాదాలు అంటారా అది మన ప్రాప్తం. (16-08-2013)

కామెంట్‌లు లేవు: