11, ఆగస్టు 2013, ఆదివారం

ఏడ్చేవాడికి ఏడ్చినంత. నవ్వేవాడికి నవ్వినంత.
(శ్రీ బొడ్డు మహేందర్ సౌజన్యంతో) 
ఏడ్చేవాడికి ఏడ్చినంత. నవ్వేవాడికి నవ్వినంత. జీవితమంతా ఎలా ఉండాలనుకుంటున్నావో అది నీకే తెలియాలి. జీవితమన్నప్పుడు సమస్యలూ ఉంటాయి. వాటి తాలూకు సంఘర్షణలూ ఉంటాయి. అయితే వాటి మధ్య సరదా నవ్వులూ, సంతోషాలు కూడా అంతే సమానంగా ఉండాలి. లేకపోతే జీవితంలో బ్యాలెన్స్ ఉండదు . ప్రేమ పూల సుగంధం ఉండదు అంటాడు ప్రఖ్యాత మానసిక వేత్త ఎడ్విన్ కీస్టర్
ప్రపంచంలో ప్రతి దానికీ రెండు అంచులు ఉంటాయి. చెట్టునే తీసుకున్నా, కిందికి చూస్తే మట్టిలో కూరుకుపోయిన వేళ్లు,కాండం కనిపిస్తాయి. పైకి చూస్తే గాలిలో తేలాడుతున్న ఆకులూ, పూలూ, కనిపిస్తాయి. నువ్వు ఏ వైపు చూస్తున్నావన్న అంశం మీదే నీ భావాలూ, నీ అనుభూతులూ, నీ ఉద్వేగాలూ ఉంటాయి. ప్రేమనైనా, పెళ్లినైనా కొందరు మరీ సీరియస్‌గా తీసుకుంటారు. కొందరు అతి సాధారణ అంశంగా తీసుకుంటారు. మరికొందరు ఒక తమాషాగా తీసుకుంటారు. అయితే తమాషాగా తీసుకునే వారు అసలే సీరియస్‌గా తీసుకోర ని కాదు.అలాగే సీరియస్‌గా తీసుకునే వారు అసలే సరదాగా ఉండరనీ కాదు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి, అన్నిటినీ మించి మూడ్‌ని బట్టి అలా ఉంటారు.

రూలేమీ లేదుగా.....
ప్రసిద్ద రచయిత ఒకరు కొత్తగా తాను రాసిన పుస్తకం తొలిపేజీలో ' ' నా భార్య తోడ్పాటే లేకపోతే ఈ పుస్తక రచన అసలు పూర్తయ్యేదే కాదు. ఆమె అడుగడుగునా నాకు ఇచ్చిన స్పూర్తే నా పుస్తకానికి ఒక ఆత్మగా నిలిచింది. అందుకే ఈ పుస్తకాన్ని ఆమెకు అంకితం చేస్తున్నాను.'' అన్న వాక్యం రాసి ఆ కిందే బ్రాకెట్‌లో (ఇలా మెచ్చుకోకపోతే ఆవిడ ఊరుకోదు) అని రాశాడు. ఆ ఒక్క చివరి వాక్యంతో ఆ పైన రాసిన వాక్యాలన్నీ ఉత్తి అబద్దమని తే లిపోయిన ట్లేగా. అంత భయమున్న వాడు చివరన ఆ వాక్యం రాయకుండా ఉండిపోవచ్చుగా! మరెందుకు రాసినట్లు? ఉడికించడానికి, ఆవిడను సరదాగా నవ్వించడం కోసం. అంతేగా! ఇదీ ఒక సరదాయేనా అంటే ఔను మరి! సరదా అంటే ఇలాగే ఉండాలని రూలేమీ లేదుగా.

అటూ ఇటూ మారితే....
ఆలస్యగా ఇంటికి వచ్చిన భర్తను ఉద్దేశించి " ఇప్పుడా ఇంటికొచ్చేది? ఇప్పటిదాకా ఏ మహాకార్యాలు పూర్తిచేసొచ్చారు తమరు? అంది వెటకారంగా. వెంటనే భర్త ' నేను వచ్చే దారిలో పెద్ద యాక్సిడెంట్ అయ్యి రోడ్లన్నీ జామ్ అయిపోయాయి అదీ సంగతి ' అన్నాడు భర్త . అందుకు ఆమె అవునా? అంటూనే ' రోజుకో సాకు భలే వెంటబెట్టుకొస్తారండీ మీరు?' అంది ఆ వెంటనే భర్త "సాకుల్ని నేను వెంటబెట్టుకు రావడం కాదు భాగ్యవతీ! సాకులే నా వెంటబడి వస్తాయి ఏం చెయ్యను చెప్పు?'' అన్నాడు గోముగా. ఇంక ఆవిడ నవ్వక ఏంచేస్తుంది? అలా మాట్లాడ్డం వల్ల అప్పటిదాకా ఆమెలో పేరుకుపోయిన కోపమంతా ఒక క్షణంలో మాయమైపోయింది. విషయం అదే. కాకపోతే ఆ విషయాన్ని కాస్త తలకిందులు చేసి చెప్పాడంతే! అదే విషయం మీద గొడవ పడాలంటే పెద్ద గొడవే అయిపోతుంది. ఆలస్యానికి కారణం అడిగినప్పుడు ' ఏ రోజు ఎందుకు ఆలస్యం అయ్యిందో ప్రతి సారీ తమకు నివేదిక సమర్పించుకోవాలా? 24 గంటలూ ఇంట్లో పడి ఉండే నీకు రోడ్డు మీది సమస్యలేమిటో ఎలా తెలుస్తాయి? ఇంకొకసారి ఇలా అడిగావంటే బావుండదు మరి!'' అన్నాడే అనుకోండి. ఇంకేముంది? ఆమె మనసు గాయమేగా? ఆ కొద్ది రోజులైనా సరే వారిద్దరి మధ్య దూరాలేగా...! అందుకే ఎంతో వివేకవంతుడైన ఆ భర్త 'సాకులు నా వెంటబడి వస్తాయే గానీ, నేనెప్పుడూ వాటిని వెంట తీసుకురాను' అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు. పైగా ఆలస్యానికి కారణం అడగడం వెనుక మీ పట్ల ప్రేమే గానీ, మిమ్మల్ని నిలదీయాలని కాదుగా. ఆ లోతులు అర్థం చేసుకున్నాడు కనకే తన సరదా సమాధానంతో హాయిగా నవ్వుకునేలా చేశాడు. అందుకే సహజీవనంలో ఇలాంటి నవ్వుల్లేకుండా పోయిన్నాడు బందాలు బరువెక్కిపోతాయి.

నవ్వుతూ...న వ్విస్తూ....
వివాహం అంటే మరీ అంత సీరియస్ అంశమేమీ కాదు. అలాగే జీవితం కూడా అంత సీరియస్ అంశమేమీ కాదు. నాలుగు రోజులు కలిసి జీవించడం అంతిమంగా ఎవరి దారిన వెళ్లిపోవడాలు. అంతేగా...! ఆ మాత్రం దానికి ప్రతి విషయాన్నీ బరువెక్కించి, పగలూ రేయీ కాలిపోవడం అవసరమా! జీవితానికి హాయిగా నవ్వుకోవడాన్ని మించిన గొప్ప వరం ఏముంది? కాకపోతే అది సాధించడానికి కాస్తంత జాగ్రత్త అవసరం.మంచుపర్వతం మీదున్నాను నాకేమిటని ఎవరైనా కదలకుండా అక్కడే నిలుచుంటే ఏమవుతుంది? ఆ పర్వతం కరిగి కాళ్లు పాతాళంలోకి జారిపోతాయి. అందుకే మంచు పర్వతమన్న విషయాన్ని మరిచిపోకుండా, ఎప్పటికప్పుడు చల్లదనాన్ని కలిగిస్తూ ఆ పర్వతం కరిగిపోకుండా జాగ్రత్తపడుతూ ఉండాలి. అప్పుడే అందులోంచి మంచు వృక్షాలు మొలుస్తాయి. నవ్వుల్లాంటి మంచు పూలు పూస్తాయి. మనసుల్లోనూ మంచుపూల పరిమళాలు నిండుతాయి అంటాడు ఎడ్విన్ కీస్టర్.

కామెంట్‌లు లేవు: