4, ఆగస్టు 2013, ఆదివారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

మా రెండవ చిన తాత వెంకట సుబ్బారావు గారు. ఈయన ఆధ్యాత్మిక దృక్పధం కలవాడు. జాలిగుండె. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. కోపం కూడా ఎక్కువే కాని అది తాటాకు మంట లాటిది. ఇట్టే ప్రజ్వరిల్లినా మళ్ళీ అట్టే చల్లరిపోయేది. చిన్నతనంలో చాలా దుడుకు మనిషి అని పేరు కాని పెద్దయిన తరువాత  చాలా మారిపోయాడు.


(సుబ్బయ్య తాతయ్య ఆయన శ్రీమతి సీతం బామ్మ - మధ్యలో వారు దత్తత తీసుకున్న మా రెండో తమ్ముడు  శ్రీ భండారు  రామచంద్ర రావు) 


శారీరకంగా కూడా దృఢమయిన మనిషి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల్లోను ఈయన ఒక్కరే బలంగా ఉండేవాడు. మిగిలిన ఇద్దరు శారీరకంగా అర్భకులు అనే చెప్పాలి. మొదట్లో ఆయనకు కాఫీ అంటే గిట్టేది కాదు. మా నాన్నగారు కాఫీని మొదటిసారి మా వూళ్ళో ప్రవేశపెట్టారనవచ్చు. లేకపోతే పర్చా రంగారావు గారో. మా ఇంట్లో కాఫీ పొడి మిషన్ వుండేది. మా  నాన్నగారు బెజవాడ వెళ్లి కాఫీ (గుండ్లు) గింజల్ని కొనుక్కుని వచ్చి వాటిని వేయించి, ఏరోజుకారోజు  ఆ మిషన్లో వేసి చేత్తో తిప్పితే, కొంత బరకగా వున్నా, మొత్తం మీద  కాఫీ పొడుం తయారయ్యేది. ఆరోజుల్లో ఫిల్టర్లు లేవు. వేన్నీళ్ళలో కాఫీపోడుం వేసి మరిగించి గుడ్డలో వడపోసి పాలూ పంచదార వేసుకుని ఇత్తడి జాంబు (గ్లాసు)లో పోసుకుని తాగేవారు. మా నాన్నగారే పొద్దున్నే లేచి కాఫీ పెట్టుకుని తానూ తాగి కొంత మా అమ్మగారికి ఉంచేవారు. కానీ, సుబ్బారావుగారికి (వూళ్ళో సుబ్బయ్యగారనే వారు) చెప్పానుకదా, కాఫీ అంటే చుక్కెదురు. ఆయనకు ఆరోగ్య సూత్రాల మీద మమకారం జాస్తి. శుభ్రం ఎక్కువ. అన్నం తినగానే కాని ఏదయినా పలహారం చేసిన తరువాత కాని నోట్లో నీళ్ళు పోసుకుని చాలాసేపు పుక్కిలించేవాడు. అందర్నీ అలాగే చేయాలని శాసించేవాడు. మాకేమో అదంతా చాదస్తంలా అనిపించేది. బయట ఊళ్లకు వెళ్ళినప్పుడు ‘లా’ పుస్తకాలు కొనుక్కొచ్చి వూళ్ళో తీర్పులు చెప్పేవాడు. మా వూళ్ళో మొదట గ్రామ ఫోన్ కొన్నది ఆయనే. జావళీలు, కీర్తనలు అంటే చెవి కోసుకునేవాడు. ముక్క అర్ధం కాకపోయినా వూళ్ళో వాళ్ళందరూ ఆ గ్రామ ఫోన్ పెట్టె చుట్టూ మూగి, గ్రామఫోన్ ప్లేటు తిరుగుతూ పాట వినిపిస్తుంటే నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతుండేవారు. కొందరు దాన్ని ‘దెయ్యపు పెట్టె’ అనే వాళ్ళు. ఎవరో కంటికి కనబడకుండా ఆ పెట్టెలో కూర్చుని ఆ పాటలు పాడుతున్నారని అనుమానంగా చూసేవారు.

(మరో భాగం మరో సారి)                                                                                            

కామెంట్‌లు లేవు: