10, ఆగస్టు 2013, శనివారం

బడుగులకో రూలు, బడాబాబులకో రూలా!బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహాన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య.

రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన  ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు మన పక్కా ఇళ్ళ ప్రణాళికలుఅచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.

పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశనస్థలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, ఇళ్ళ స్థలాలకు   ఈనాడు వున్న ధరలు లేని ఆ రోజుల్లో కూడా పేదలకు  నివేశన స్థలాలు  అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు  స్థలాలను  పేదవారికి ఇళ్ళ స్థలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ  స్థలాల కేటాయింపు అనేది అదనపు పెద్దరికాన్నికట్టబెట్టింది. కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత పక్కాగాఅమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో పక్కా ఇళ్ళ పధకంఅనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రధానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈనాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం

ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత పదేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి తిలాపాపం తలా పిడికెడుచందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.


అదేసమయంలో మరో మాట కూడా చెప్పుకోవాలి. పారిశ్రామిక వర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో వేల, లక్షల ఎకరాల భూపంపిణీ ఓపక్క నిరాఘాటంగా, నిర్లజ్జగా సాగిస్తున్నప్పుడు, కేవలం పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పధకాన్ని భూ భాగోతంగాముద్రవేసి వారి కడుపులపై కొట్టడం కూడా మంచిది కాదు. దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే ‘కడుపు నిండినవాడు, కడుపు మండినవాడు’ అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే సిసలయిన  పాలకుల అసలయిన కర్తవ్యం.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పనిలో పనిగా నాయకులకి, పాత్రికేయులకి కూడ నగరాల్లో ఇళ్ళ స్థలాలు తక్కువ రేటుకి ఇచ్చారు కదా!

Saahitya Abhimaani చెప్పారు...

"..పారిశ్రామిక వర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో వేల, లక్షల ఎకరాల భూపంపిణీ ఓపక్క నిరాఘాటంగా, నిర్లజ్జగా సాగిస్తున్నప్పుడు...'

'...పారిశ్రామిక వేత్తలకు 'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే...'

Do you really think that land should not be allotted to Industrialists!!

What is in your view these Industrialists do with the land allotted to them!! Make plots and sell them?!

In majority cases, the land allotted to them is put to productive use of establishing an Industry, thereby providing employment and manufacturing the goods required for the country.

Lets come out of the unfortunate thinking process of 60s and 70s prompted by the Soviet Union "experiment" which undoubtedly failed.

No point in helping thousand incompetent people by providing every thing "Free" ignoring and depriving an intelligent person of the resources he needed to create employment whereby everybody "earns" what they need instead of "yearning" for everything as free gift as a matter of right from Government.