11, ఆగస్టు 2013, ఆదివారం

విందామయా నరుడ విందామయా


చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.
"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.

తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట. 
పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట." 

ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు. 

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.

కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు. 

" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. ‘మొగుడి మాట పెళ్ళాం వినకూడదు’ అన్నది  మా ఇంట్లో నా రూలు కాబట్టి తాను  వెంటనే  లేచి నిలబడుతుంది.  చూశారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు. 


బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని. ఘనత వహించిన మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా గిట్టని వాళ్ళు ‘ఆయనో సీతయ్య – ఎవరి మాట వినడు’ అంటారని కొందరు అంటుంటారు.

పొతే, వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.

హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.
మళ్ళీ అసలు సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.

'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.

విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.

NOTE: Courtesy Cartoon Owner

కామెంట్‌లు లేవు: