29, జులై 2013, సోమవారం

భండారు వంశం (నిన్నటి తరువాయి)


పర్వతాలయ్యగారికి పెద్ద మీసాలు ఉండేవి. వెనుక జుట్టు ముడి వుండేది. సింహలలాటం మురుగులు ధరించేవారు. మిత భాషి. అయినా చమత్కారంగా మాట్లాడేవారు. సౌమ్యుడు, సాత్వికుడు. కానీ ఒక్కోసారి తీవ్రంగా కోపం వచ్చేది. ఏదీ మనసులో ఉంచుకునే తత్వం  కాదు. ఆయన చివర దశలో కాళ్ళు చచ్చుపడ్డాయి. దాదాపు పది పన్నెండేళ్ళు మంచం మీద కూర్చునే కరణీకం చేసారు. ఆయనకు ఎనిమిదవ ఏట పెళ్లయింది. అప్పుడు మా బామ్మ రుక్మిణమ్మ గారికి నాలుగేళ్ళు.(కీర్తిశేషులు భండారు రుక్మిణమ్మ గారు)ఆమె తండ్రి కాకరవాయి (కాకరాయి) వాస్తవ్యులు, కందిబండ చిదంబరం గారు. తల్లి చెల్లమ్మ గారు. చిదంబరంగారు చనిపోయేనాటికి మా బామ్మ ఒక్కతే  కూతురు. చెల్లమ్మగారికి అప్పటికి ఇంకా పదహారేళ్ళు కూడా నిండలేదు. భర్త పోయిన తరువాత  కొన్నాళ్ళకు చెల్లమ్మ గారు కాకరవాయి లోని తమ వాటా ఇల్లూ, పొలాలు అమ్మేసుకుని పదివేల రూపాయలు తెచ్చి మా నాన్నగారికి ఇచ్చిందట. బహుశా 1929, 1930  ప్రాంతాల్లో అయివుండవచ్చు.  ఆ సొమ్ముతోనే మా నాన్నగారు ప్రస్తుతం వున్న మా ఇల్లు కట్టారని అంటారు.చెల్లమ్మగారు అప్పటినుండి మా ఇంట్లోనే వుండేది. ఆమె భాగవతం నిత్య పారాయణ చేసేది. భారతం, భాస్కర రామాయణం, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం కూడా చదువుతూ వుండేది. అయితే ఆమెకు రాయడం బొత్తిగా రాదు. చదువుకున్నవారికే వోటు హక్కు అని ఆరోజుల్లో ఒక రూలు వచ్చిందట. మా నాయనమ్మమ్మ చెల్లమ్మగారికి కాని, మా నాయనమ్మ రుక్మిణమ్మ గారికి కాని, మా అమ్మగారు వెంకట్రావమ్మ గారికి కాని చదవటం చక్కగా వచ్చు కాని రాయడం రాదు. అందుకని వాళ్ళందరికీ తమ పేర్లు (సంతకం) రాయడం వరకు నేర్పించారట.
మా చిన్నతనంలో చిట్టేల కోటయ్య పంతులు గారు తన దగ్గర చదువుకునే పిల్లల్ని ఇంటి దగ్గర కూడా చదివినట్టు వాళ్ళ పెద్దవాళ్ళచేత పలకపై రాయించుకుని రమ్మనేవారు. మేం చెల్లమ్మగారికి ‘చదివినాడు’ అనే పదం రాయడం నేర్పాము. ఆమె పలక మీద అదే రాసి ఇచ్చేది. సామాన్యంగా ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ పుస్తకం పట్టుకునే అలవాటు  లేదు. అది చూసి చెల్లమ్మగారు ‘ఇవ్వాళ  మీరు చదవలేదు’ అని రాస్తానని మమ్మల్ని బెదిరించేది. కాని అల్లా రాయడం ఆమెకు రాదని మాకు తెలుసు. చాలా మెత్తని మనిషి కనుక ‘చదివినారు’ అనే రాసిచ్చేది. ఆమె  దాదాపు  95 సంవత్సరాలు జీవించింది. చక్కిలాలను నమలగలిగే దంత పటిమ వుండేది. మనిషి బాగా వంగిపోయినా ఎప్పుడు నవిసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఆఖరి రోజున కూడా కాలకృత్యాలు తీర్చుకునేందుకు మనుమరాళ్ళు ప్రేమ,భారతి సాయంతో దొడ్లో చింతచెట్టు వరకు చేతి కర్ర పొడుచుకుంటూ  నడిచి వెళ్లి వచ్చింది. పండ్లు తోముకుంటూ పక్కకు వాలిపోయి   అనాయాసంగా మరణించింది. ఆమె మరో రెండు రోజులకు పోతుందనగా నాకు (భండారు పర్వతాలరావు) లా కాలేజీ తెరవడం వల్ల హైదరాబాదు ప్రయాణం అయ్యాను. ఆమెకు దండం పెట్టడానికి వెడితే ‘రెండు రోజులు తాళు (ఆగు)’ అంది. నేను ప్రయాణం మానేసాను. సరిగ్గా రెండో రోజునే  ఆమె మరణించింది. అంతకు ముందు రాత్రి కూడా రోజు మాదిరిగానే గజేంద్ర మోక్షం లోని పద్యాలు పొద్దు పోయిందాకా చదివి పండుకుంది. (మరో భాగం మరోసారి)

5 వ్యాఖ్యలు:

voleti చెప్పారు...

చాలా చక్కగా రాస్తున్నారు.. ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ మీద కంటే ఇలాంటి వంశ చరిత్ర ను రాయడం వలన నేటి తరానికి అప్పటి వాళ్ళు ఎలా జీవనం సాగించారో కళ్ళకి కట్టునట్టు తెలుస్తుంది...

voleti చెప్పారు...

చాలా చక్కగా రాస్తున్నారు.. ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ మీద కంటే ఇలాంటి వంశ చరిత్ర ను రాయడం వలన నేటి తరానికి అప్పటి వాళ్ళు ఎలా జీవనం సాగించారో కళ్ళకి కట్టునట్టు తెలుస్తుంది...

Venkata Ramarao చెప్పారు...

Chala Bagundhi.

Maa Uru vocchi Talluru .Mee pakkane.

Mee uru ninnane (28 th) velli vochha.

Bodipudi varu ma bandhuvulu.(mamidid thota varu millu daggara)

Bodipudi narashimharavu gari thaluku.

Thanks

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Voleti - Thanks - Bhandaru Srinivas Rao

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Venkataramarao - naaku telisina bodepudi narasimhaarao maa chinnappudu maa vooru panchayat sarpanch gaa panichesaaru. taalluru pakkana madupallelo maa chuttaalu vunnaaru - Thanks Ramarao garu - Bhandaru Srinivas Rao