5, జులై 2013, శుక్రవారం

హెల్మెట్ల నిబంధన – జర్నలిస్టుల నిరసన – పూర్వాపరాలు - 2

హెల్మెట్ల నిబంధన అమలు జరిగిన తీరుతెన్నులు గురించి రాస్తుంటే మధ్యలో జర్నలిస్టులు కూడా సమాజంలో భాగమే, వారేమీ అతీతులు కాదు అన్న పద్ధతిలో వాదాలు బయలుదేరాయి. నిజమే! పాత్రికేయులేమీ పైనుంచి ఊడిపడలేదు. కానీ, ఈ విమర్శలు చేసే  వాళ్ళు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. హెల్మెట్ నిబంధనను నాటి అధికారులు అమలు చేయడానికి ఎంచుకున్న విధానాలపట్ల ప్రజల్లో ఎంతో నిరసన వెలువడింది. కాకపొతే ఇప్పట్లా ఇన్ని రకాల ప్రసార మాధ్యమాలు లేకపోవడంతో జర్నలిస్టుల నిరసన కారణంగా విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాని హెల్మెట్ నిబంధన అమలు తీరు వ్యతిరేక ఆందోళన ప్రజల్లోనుంచే మొదలయింది. నాటి పరిస్తితుల నేపధ్యాన్ని ఒకసారి గమనంలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ విషయంలో తలెత్తిన సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం వుంది. జరిగి ముప్పయ్యేళ్ళు అవుతోంది కనుక ఈనాటి తరానికి నాటి పరిస్తితుల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండకపోవచ్చు. ఆరోజుల్లో రోడ్లు సరిగా ఉండేవి కావు. ఇప్పుడు వున్నాయని కాదు. కాకపొతే చాలా మెరుగు.
ఓ రోజు రేడియోలో పని ముగించుకుని ఇంటికి వస్తుంటే  అప్పుడే వర్షం పడి వెలిసినట్టు వుంది.  త్యాగరాయ గాన సభ దగ్గర పోలీసుల హడావిడి కనిపించింది. పోలీసు కమీషనర్ అప్పుడే కారు దిగి నిలబడ్డారు. నేను వెళ్లి ‘ఒకసారి ఇటు రండి’ అని  రోడ్డుపై పారుతున్న నీళ్ళల్లో నా కాలిని  బలంగా ఆనించాను. దాదాపు మోకాలు దాకా దిగిపోయింది. ‘సార్ ! ఇలాటి రోడ్లపై వేగంగా వెళ్ళడం ఎలా కుదురుతుందో చెప్పండ’ని అడిగాను. ఆయన తన సహజ ధోరణిలో చీకాకు పడకుండా చిరునవ్వుతోనే జవాబు చెప్పారు. భావం ఏమిటంటే రోడ్ల నిర్వహణ తమ శాఖకు సంబంధించింది కాదని. నిజమే రోడ్ల నిర్వహణ పోలీసులది కాదు. ప్రజలకు సేవ చేయడంలో ఎదురయ్యే లోపాలకు ప్రభుత్వ విభాగాలు ఒకరిపై మరొకరు నెపాలు మోపుకునే వెసులుబాటు వుంది. కానీ పౌరులు మాత్రం ఏదో మిష  చూపి తప్పించుకోవడానికి వీలుండదు.  ‘నాకు హెల్మెట్ వుంది. ఈ సందులోనే మా ఇల్లు. మా అమ్మకు మందు కొనడానికి మందులషాపు పక్కనే కదా అని తొందరలో హెల్మెట్ మరచిపోయి వచ్చాను. చూడండి లుంగీ మీదనే వున్నాను’ అన్నా వినకుండా  ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాసిన  రోజులవి. ఇదొక ఉదంతం మాత్రమే. ఆ రోజుల్లో ప్రజలను పోలీసులు యెంత భయపెట్టారన్నది ఈనాటి తరానికి తెలియకపోవచ్చు.
నిజమే. వాహనదారుల రక్షణకు హెల్మెట్ అవసరమే. కానీ ఇదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న పద్ధతిలో నాడు ఈ విధానం అమలు జరిగింది. సరే హెల్మెట్లు ధరించడం పౌరుల బాధ్యతే అనుకుందాం. మరి రోడ్లమీద స్పీడ్ బ్రేకర్లు వుంటాయి. దగ్గరికి  వచ్చిన దాకా అవి కనబడవు. నిజానికి నిబంధల ప్రకారం వాటి మీద పసుపు నలుపు రంగు చారలు స్పష్టంగా కనిపించేటట్టు పెయింట్ వేయాలి. వాటికి కొద్ది దూరంలో దగ్గరలో ‘స్పీడ్ బ్రేకర్ వున్నది జాగ్రత్త’ అనే సైన్ బోర్డు ఏర్పాటు చేయాలి. ‘ఏవీ!ఇవేవీ కనబడవు’ అంటే ‘నిధుల కొరత’  అంటారు, సామాన్యుల దగ్గర మాత్రం  డబ్బు సంచులు మూలుగుతున్నట్టు అక్కడికక్కడే ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తారు. ఇదేమి న్యాయమో చెప్పండి.

8 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

అఫీసరు ఆఫీసరు లంచం ఎందుకు తీసుకున్నావు? అంటే ఏబ్బే లంచం నాక్కాదు పై అఫీసర్లకి ఇవ్వడానికి, ఐనా మందు తాగడం తప్పు కానీ ప్రభుత్వమే దగ్గిరుండి తాగిస్తున్నది ముందెళ్ళి అదాపు అన్నాడట ఎవరో ఓ ప్రభుత్వోద్యోగి. ఇదీ అలానే ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా మనకి చట్టాలు చులకనే, మనం పాటించం, గౌరవించం, దానికి లచ్చ కారణాలు వెతుక్కుంటాం. మళ్ళీ గవర్నమెంటుని తిడతానికి రెడీ.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: చూడబోతే ఇదేదో 'అజ్ఞాతవైరం'లా వుంది.ఏం చేస్తాం. అదో తుత్తి అనుకోవాలి.

సూర్య చెప్పారు...

రావుగారూ, మీరు ఏవిధంగా చెప్పినా ఆనాటి మీ ప్రవర్తన అభ్యంతరకరంగానే కనిపిస్తుంది. 1) హెల్మెట్లు పెట్టుకోమనేది పౌరుల రక్షణకొరకే. గతుకుల రోడ్లపై స్పీడుగా వెళ్ళే అవకాశం లేకపోవచ్చు కాని అలాంటి రోడ్లపై కిందపడే అవకాశాలూ ఎక్కువే కదా. బాగా ఉన్న రోడ్డుపై పడితే తగిలే దెబ్బలకంటే చెడిపోయిన రోడ్డులో కిందపడితే తలకి బలమైన దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. 2) దగ్గర్లో ఉన్నచోటికి లుంగీతో హెల్మెట్ లేకుండా వెళ్ళినా వినిపించుకోలేదని అంటున్నారు. కాని ఆ మనిషి అబధ్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలియదు కదా. అందులోనూ దొరికిపోయినపుడు దొంగసాకులు చెప్పేవారు ఎక్కువ. పైగా ఆ కాలం లో లుంగీ/బనియన్లతో కూడా ఎక్కువదూరం వెళ్ళే అవకాశం ఉంది (నాటి వస్త్రధారణ ఇప్పటిలా గంభీరమైనది కాదు అన్న పాయింట్ తో చెప్తున్నా). మరి అలాంటపుడు దొరికిన వ్యక్తి చెప్పేది నిజమని ఎలా నమ్మగలరు?
మీకు జరిగిన సంగతే తీసుకుందాం. మీరు హెల్మెట్ లేకుండా వెల్తున్నారు. కొంపలు మునిగిపోయే పనిమీద కాదు (వార్తలకు ఇంకా సమయం ఉంది కనుక మీ ఫ్రెండ్ ని దింపడానికి వెల్తున్నారు). అపుడు మిమ్మల్ని పట్టుకున్నారు. జరిమానా కట్టలేదు, మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్ళారు. ఒకవేల మీవద్ద అప్పటికపుడు డబ్బులేకపోతే మీకోసం వచ్చ్హిన మిగతా మిత్రులు చలానా కట్టి మిమ్మల్ని విడిపించుకోవచ్చు. కాని అలా కాక అందరూ ఆందోళన చేపట్టారు. ఇది హర్షించదగ్గ పరిణామమా? చివరికి ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకునే అవకాశం ఒక పార్టీకి ఇచ్చారు. అందుచేత అప్పటి మీ ప్రవర్తన అభ్యంతరకరంగానే కనిపిస్తోంది.
ఒకమాట చెప్పండి. నాయకులు అప్పనంగా తినేస్తున్నారుకాబట్టి నేను పన్నుకట్టను అని ఓ ఆసామి అంటే మనం గెంతుతూ ఈలలు వేద్దామా? మా ఆవిడ డబ్బు దుబారా చేసింది కాబట్టి ఈనెల నీకు జీతం ఇవ్వను అని మీ పనిమనిషికి చెప్తే ఎలా ఉంటుంది? మీరు చెప్పిన excuse కూడా అలానే అనిపిస్తోంది. ఇలా రాసింది మిమ్మల్ని నొప్పించడానికి కాదు. అర్థం చేసుకోగలరు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సూర్య - ఏమంటాను నా అభిప్రాయంతో ఏకీభవించకపోయినా ఆ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను అని అంటాను. అయినా ఒక్కసారి 'అర్ధం- అపార్ధం' పేరుతొ నేను రాసిన వివరణ చదవమని మాత్రం కోరతాను. - భండారు శ్రీనివాసరావు

సూర్య చెప్పారు...

రావుగారు, మీరు రాసిన అర్థం-అపార్థం కూడా చదివాను. అప్పటి మీ బాధలూ అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అపుడు నిబంధనకి వ్యతిరేకంగా వెళ్ళేకంటే, కొన్ని అవసరమైన సవరింపులు కోరితే బాగుండేదని నాకనిపించింది. హెల్మెట్ అవసరాన్ని ప్రజలకి నొక్కి చెప్పాల్సిన మీడియానే హెల్మెట్ ధారణని వ్యతిరేకించడం కించిత్ బాధ కలిగించింది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సూర్య - ఇక చర్చించడానికి ఏమీ మిగలలేదు. మేము హేల్మేట్లకు వ్యతిరేకం కాదు, ఆ నిబంధన అమలుపరుస్తున్న తీరుకే అని అప్పటినుంచి ఇప్పటిదాకా మేము చేస్తున్న వాదన అరణ్య రోదనే అని తేలిపోయింది. మీ వయస్సు ఎంతో నాకు తెలియదు. అప్పటి పరిస్తితులు అప్పటి అవసరాలు అలాటివి. మమ్మల్ని అర్ధం చేసుకోండి అని కోరడం కన్నా మేమే అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిదేమో అనిపిస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

బండారు గారు!
మీరు పెద్ద అలాగే గర్వించదగ్గ పాత్రికేయులు,
ఈ మధ్య ప్రతీ పోస్ట్ లో, జర్నలిస్ట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరనే మెసేజ్ ఇస్తున్నారు, తప్పులేదు... వారు నిజంగానే చేయగలరు.

అజ్ఞాత చెప్పారు...

జర్నలిస్ట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరు అంటే ఏదో ప్రజలను, దేశాన్ని వుద్ధరించడం లాంటి ప్రజాహితమైన పనులు అనుకుంటే అది మీ పొరపాటు అజ్ఞాత గారు.

ప్రజాహిత కార్యక్రమాలు మాత్రం చేయరు, చేయలేరు. ఏమైనా చేయగలరు అంటే తమను మేపకపోతే, ఎవడి పరువైనా బజారు కీడ్చగలము అని మాత్రం అర్థం చేసుకోవాలి.