25, జులై 2013, గురువారం

భండారు వంశం (రెండో భాగం)

(నిన్నటి తరువాయి)

భండారు  అన్న వంశనామ పుట్టుపూర్వోత్తరాల సంగతి తెలియకపోయినా కంభంపాడు  గ్రామానికి భండారు వంశీకులు మొదట ఎలా వచ్చారు అన్న సంగతిపై మాత్రం తగిన ఆధారాలు లభించాయి. నేను (పర్వతాలరావు గారు) విజయవాడలో చదువుకునేటప్పుడు, అంటే 1953 ప్రాంతంలో – మా చిన తాతగారు భండారు వెంకట సుబ్బారావు గారు  మా స్నేహితుడు శ్రీ గోనుగుంట్ల విశ్వనాధంతో  తనకు గుర్తున్నంత వరకు మా వంశ వృక్షం రాయించారు. నేను కూడా రాసుకుంటానంటే,  ‘వంశ వృక్షం రాసిన వారికి సంతానం కలగదంటారు’ అని  చెప్పి వారించారు. ఆ తరువాత మా చిన తాతగారు లక్ష్మీనారాయణ గారింట్లో వంశవృక్షం కాపీ ఒకటి వుందని ఆయన మునిమనుమడు భండారు సుధాకర రావు చెప్పగా నేను వెళ్లి దాని నకలు రాసుకొని వచ్చాను.  ఈ రెండూ కాక, పైన చెప్పిన కోర్టు తీర్పు కాపీలో కూడా ఆ వివరాలను  పేర్కొన్నారు. కంభంపాడుకు  సంబంధించినంత వరకు ఈ ఆధారాలతో చాలావరకు వంశ వృక్షాన్ని నిర్ధారించుకునే  అవకాశం కలిగింది.
(ఆంజనేయ స్వామి, శివాలయాల ప్రాంగణం) 

కంభంపాడు  గ్రామం కృష్ణాజిల్లాలోది. (లోగడ ఇది నందిగామ తాలూకాలో వుండేది. తాలూకాల రద్దు తరువాత ఇది వత్సవాయి మండలంలో  చేరింది). ఈ గ్రామ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు లేవు.  గ్రామంలో వున్న శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి  దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారని చెబుతారు. అదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి గుడి కూడా వుంది. ఇక్కడ మొదట్లో  గుడి వుండేది కాదనీ, భండారు పర్వతాలయ్య గారి హయాములో వారూ, వారి సోదరులు  కలిసి ఈ గుడి  నిర్మించారని కూడా చెబుతారు.  ఈ గుడి కాక, వూరి  బయట మా తాతయ్య గారు సుబ్బారావు గారు నిర్మించిన ఆశ్రమంలో ముక్తినాధ స్వామి  ఆలయం వుంది. శిధిలావస్థకు చేరిన ఈ గుడిని శ్యాం ప్రసాద్ బ్రహ్మచారి అనే స్వాములవారు పునరుద్ధరించారు. ఈ స్వామి వారే, ఆ  ఆశ్రమంలో ఒక వేద పాఠశాలను సైతం నిర్వహించేవారు. కొత్తూరు (కొత్త వూరు) లో ఆంజనేయ స్వామి  ఆలయాన్ని అక్కడి రైతులు నిర్మించారు. తరువాత ఆ వూరు ఖాళీ అయినా, ఆలయంలో మాత్రం నిత్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. (ముత్యాలమ్మ ఫోటో)ఇవికాక, మా వూరిలో  ముత్యాలమ్మ గుడి వుంది.


(ముత్యాలమ్మ గుడి రావిచెట్టు గట్టు మీద భండారు వారి కుటుంబం) 

పర్వతాలయ్య గారి హయాములో ఒకసారి ముత్యాలమ్మ ఆయన కలలోకి వచ్చి ‘బందిపోట్లు వూరి పైకి రాబోతున్నారని’ హెచ్చరించిందట. వెంటనే అంతా  గ్రామం వొదిలి తప్పుకున్నారట. బందిపోట్లకు ఏమీ చిక్కలేదు. అందుకని కోపించి వారు ముత్యాలమ్మ దేవతను గడ్డపారతో పొడిచి పగులగొట్టారని అంటారు. వెంకటస్వామి  అనే అతను ముత్యాలమ్మకు చిన్న గుడి కట్టించాడు. వూరికి తూర్పున పొలిమేర మీద జమ్మి చెట్టు కింద ఎండ పల్లెమ్మ అనే ఓ అమ్మవారి విగ్రహం కూడా వుంది. 

(మరో భాగం మరోసారి)

25-07-2013