18, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఆ మూడు పత్రికలు


ఆ మూడు పత్రికలను నేను కొని చదువుతాను. గత కొన్ని దశాబ్దాలుగా నాకిది అలవాటు. ఇదే రంగంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న నాకు - ఈరోజు ఒకే వార్తను ఈ పత్రికలు ప్రచురించిన తీరు చూసిన తరువాత ఉదయం లేవగానే అనూచానంగా చేసుకున్న పత్రికాపఠనానికి ఇక స్వస్తి చెప్పటం మంచిదా అనే ఆలోచన కలిగింది. డెబ్బయ్యవ దశకం మొదట్లో నార్ల గారి సంపాదకత్వంలో వెలువడిన నాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకుడుగా చేరినప్పుడు గొప్ప వృత్తిలో ప్రవేశిస్తున్నాను అన్న ఆనందంతో వొళ్ళు పులకరించిన మాట వాస్తవం. మరి ఇన్నేళ్ళ తరువాత పత్రికలే చదవకూడదు అన్న నిర్వేదంలోకి యెందుకు జారిపోతున్నట్టు.
సరే! అసలు విషయానికి వద్దాం.
నామినేషన్ల సందర్భంగా అభ్యర్ధులు తమ ఆస్తులు అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్లు సమర్పించడం ఒక నిబంధన. వాటిని ప్రజలకు తెలియచెప్పడం పత్రికల బాధ్యత.  ఈ క్రమంలో శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ జగన్ మోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ల వివరాలను అన్ని పత్రికలు ప్రచురించాయి. కానీ ఈ మూడు పత్రికలు వాటికి తమదైన రీతిలో వ్యాఖ్యానాలను కూడా జతపరిచాయి. ఆ పత్రికలకు ఈనాటి పరిస్థితుల్లో అలాటి సమాచారం ప్రచురించడం ఒక అనివార్యత కావచ్చు. కానీ నా కెందుకో వార్త రూపంలో ఆ పత్రికలు తమ మనసులోని మాటని చెప్పే ప్రయత్నం చేసాయని అనిపించింది.
ఈరోజు తాపీగా ఇంట్లో కూర్చుని నీతులు చెబుతున్నానని అనిపించవచ్చు  కానీ ఎందుకో ఏమిటో నాకది  సబబుగా అనిపించలేదు.

యేమో! నేను కూడా ఏదయినా పత్రికలో పనిచేస్తూ వున్నట్టయితే  ఆ వాలువేగంలో నేనూ కొట్టుకుపోతూ వుండేవాడినేమో! ఎవరికి ఎరుక?