25, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఏకంగా నా పోటీ జంధ్యాల మీదే!


డెబ్బయ్యవ దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం వల్ల నేను ఎస్సారార్  కాలేజీలో,  బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను. చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని తెలిసిన సైక్లోస్టైల్ షాపుకు వెళ్ళి తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి కాలేజీకి  తిరిగి వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి. అంటే ఎవరో కాదు మనందరి అభిమాన ఆహ్లాద సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల.


ఆ 'ఒక్కక్షణం' అనే  గేయం ఇలా సాగుతుంది.
"ఒక్క క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు - మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు - స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి - చేతులు కాలిన పిమ్మట ఆకులకై  వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు -  అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"

ఎందుకో మా తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జంధ్యాలను గెలిపించారు.               

2 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హా హా హ. మీ పోస్ట్ చివరి వాక్యం అదిరింది. సాహసం చేసి మొదటి సంవత్సరంలోనే పోటీ చేసారన్నమాట. అప్పటికి జంధ్యాల గారు కూడా మొదటి సంవత్సరమేనా? (నేను చదివిన కాలేజ్ లో తెలుగు లిటరరీ అసోసియేషన్ కి సెక్రెటరీ గా ఉన్నాను. అయితే మరీ మొదటి సంవత్సరంలోనే కాదులెండి.)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహా రావు - జంధ్యాల పీ యూ సీ కూడా అక్కడే చదివాడు. నేను అదే సంవత్సరం చేరాను. అంతా కొత్త. అందరూ కొత్త. ఆయన అప్పటికే బాగా పాపులర్. ప్రిన్సిపాల్ కూడా రిక్షాలో వస్తే ఆయనొక్కడే డ్రైవర్ వున్న అంబాసిడర్ కారులో కాలేజీకి వచ్చేవాడు. వాళ్ల నాన్నగారు జంధ్యాల నారాయణ మూర్తిగారు పేరుమోసిన వ్యాపారవేత్త. బుష్ రేడియో డీలర్.ఆయనతో పోటీ అంటే ముందు అందరూ ఆశ్చర్యంగా చూసారు. ఆ తరువాత నేను ఆయనకో, నాకు ఆయనో కాని బెస్ట్ ఫ్రెండ్స్ మి అయిపోయాము. ఆ స్నేహం ఆయన చనిపోయేవరకు సాగిపోయింది.అది నా అదృష్టం. ఆయన గొప్పతనం.- భండారు శ్రీనివాసరావు