21, ఏప్రిల్ 2014, సోమవారం

ఎన్నికల్లో ధన ప్రవాహం - దాని ప్రభావం


ఏ ఛానల్లో చూసినా ఇదే చర్చ. అసలు ఎన్నికల్లో పెట్టే ఖర్చు ఏవిధంగా వుంటుంది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, మీటింగులు, రోడ్డు షోలు, జనాల తరలింపులు, పత్రికల్లో టీవీల్లో ప్రకటనల ప్యాకేజీలు, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు చూసారు అదే వోట్ల కొనుగోళ్ళు. చిత్రం ఏమిటంటే ముందు జాబితాలో  పేర్కొన్న అంశాలపై  పెట్టే ఖర్చుతో పోలిస్తే చివరి ఐటంపై పెట్టేది అంతవుండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాని కాకి గోలంతా దీని గురించే కావడం విచిత్రం.


ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చివరివీ కావు ఇవే మొదటివీ కావు. నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచీ ఏవో ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. ప్రతి ఎన్నికలో ఈ డబ్బు ప్రసక్తి వస్తూనే వుంది. వోటు అమ్ముకోవద్దు అనే నీతి వాక్యాలు ప్రతిసారీ వినబడుతూనే వున్నాయి. అదేదో సినిమా పాటలో చెప్పినట్టు 'మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి' అన్నట్టు, పైకి ఒప్పుకోకపోయినా,  ప్రతి పార్టీ వోట్ల కోనుగోలు విషయంలో ఎంతో కొంత ఖర్చు చేస్తూనే వస్తోంది.
వోటు కొనుగోలు అంటే అర్ధం ఏమిటి? డబ్బు తీసుకున్నవాడు దానికి ప్రతిఫలంగా డబ్బు ఇచ్చిన అభ్యర్దికో లేదా పార్టీకో వోటు వేయడం. అలా జరిగితే అందరూ గెలవాలి కదా! కొందరే యెందుకు గెలుస్తున్నారు. అంటే అర్ధం ఏమిటన్న మాట. ఓటుకు ఇంత అని డబ్బు తీసుకున్న ఓటరు కూడా తనకు నచ్చినవాడికే ఓటు వేస్తున్నాడు అనుకోవాలి. లేకపోతే ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధి ఓడిపోయేదా! ఆ తరువాత గద్దె ఎక్కిన జనతా పార్టీ కుమ్ములాటల్లో చిక్కుకుని వున్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో యెందుకు ఓడిపోయింది. ఎన్టీయార్ తెలుగుదేశం ఇందిరా ప్రభంజనాన్ని అడ్డుకుని గెలవకలిగి వుండేదా! ఆ తరువాత కొన్నేళ్లకు అదే ఎన్టీయార్ పరాజయాన్ని యెలా మూటగట్టుకున్నారు.  ఓడించిన ప్రజలతోనే తిరిగి కిరీటం యెలా పెట్టించుకోగలిగారు. చంద్రబాబు, వాజ్ పాయ్ కాంబినేషన్ కు  జనం బ్రహ్మరధం యెలా పట్టారు. తరువాత పదేళ్లు తిరక్కముందే వారిని యెలా తిప్పికొట్టారు. ఓటర్లు కేవలం డబ్బుకు ప్రలోభపడి వుంటే ఇవన్నీ సాధ్యం అయివుండేవా!
దీనర్ధం ఓట్ల  కొనుగోలును సమర్ధిస్తున్నట్టు ఎంతమాత్రం కాదు. ఎన్నికల్లో ధన ప్రవాహం వుండొచ్చు కానీ దాని ప్రభావం ఎన్నికల ఫలితాలమీద వుండకపోవచ్చు అని మాత్రమే!
మనతోపాటు స్వాతంత్రం వచ్చిన అనేక ఇరుగు పొరుగు దేశాల్లో, ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత కాలం ప్రజాస్వామ్యం మరుగున పడి, అవి సైనిక నియంతృత్వ  పాలనలోకి మళ్ళిన దృష్టాంతాలు వున్నాయి. ఒక్క మనదేశంలోనే వోటరు,  ఓటుద్వారా తనకు నచ్చిన వారికి పట్టం కడుతున్నాడు. నచ్చకపోతే గద్దె నుంచి దింపుతున్నాడు. వారిలో ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వుండవచ్చు. కానీ వారి పరిణతి చాలా గొప్పది.
NOTE: Courtesy cartoonist 

1 కామెంట్‌:

Saahitya Abhimaani చెప్పారు...

"...వారిలో ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వుండవచ్చు..."

అక్షరాశ్యతకు ( మనం అక్షరాశ్యత అనుకునే దానికి ) జ్ఞానానికి సంబధం లేకపోవటం, మన అదృష్టం శ్రీనివాసరావుగారూ! చదువుకుంటేనే జ్ఞానం వచ్చే పరిస్థితి ఉంటే (పాపం దేవుడికి ఈ అక్షరాశ్యత వగైరాలు తెలియవు కదా!) దేశం ఎంతటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉండెదో మరి!! హైదరాబాదు, ముంబాయి వంటి నగరాల్లో తెల్ల కాలరు గాళ్ళు శలవలు అనుభవించటం తెలుసుకున్నారు కాని, ఆ శలవు ఇవ్వటానికి హేతువును కనిపెట్టి, శలవును సద్వినియోగ పరుచుకోవటం తెలుసుకోలేక పొయ్యారు. వీళ్ళు అసలైన నిరక్షరాశ్యులు.