13, ఏప్రిల్ 2014, ఆదివారం

మా మేనల్లుడు చెప్పిన మా బావగారి కధ


మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా వూర్లో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -
ఈరోజు బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే రామచంద్ర రావుగారి కుమారుడు ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.


(కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు)


'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో  నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మంది బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ అని. బహుశా ఆరోజు గట్టిగా కాదుకూడదు అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేదికాదేమో!  ఫ్రీ ఇండియా అంటే  జనాలకు  అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం దీని లాభనష్టాలన్నీ  మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో  మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'

1 కామెంట్‌:

Saahitya Abhimaani చెప్పారు...

"ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రజలేది కాదు".

ప్రజలకే కాదు, ప్రజలను అలా నమ్మేట్టుగా మోసంచేసే ప్రతి రాజకీయ పార్టీ, ఈ పాపానికి మూలం. ఇవ్వాళ ఏ పార్టీ మానిఫెస్టో చూసినా కూడా, అది ఫ్రీ, ఇది ఫ్రీ. ఏ ఒక్క పార్టీ కూడా ఆ "ప్రీలు" ఇవ్వటానికి డబ్బులు ఎక్కడనుంచి వస్తాయో చెప్పరు. ఆ పార్టీ కోశాగారం నుంచి వాళ్ళ తాతగాడి ముల్లేమన్నా ఉంటే అందులోంచి ఇస్తారా!? ఈ "ఫ్రీలు" అన్నీ కూడా మనం కట్టే పన్నులనుంచి, అభివృధ్ధి పనులు "మానేసి", ఇచ్చేవే కాని మరొకటి కాదు. ప్రజల పన్ను సొమ్ములను ఇలా దానంచెయ్యటనికి, అలా దానం చేసి వాళ్ళు అధికారం "కొనుక్కోవటానికి" మాత్రమే స్వాతంత్ర్యం వచ్చింది మన దేశానికి. మన దేశంలో ప్రజాస్వామ్యం మాటలో మొదట ఉన్న "ప్రజ" కు స్వాతంత్రం రాలేదు. స్వతంత్రం అంటే, చివరకు మానసిక స్వాతంత్ర్యం కూడా రాలేదు. రాజకీయ పార్టీలు ఏదన్నా ఫ్రీ అంటే ఎగబడి ఆ పార్టీని గెలిపించే ప్రజలు ఏ విధంగా స్వతంత్రులు!?