5, జులై 2022, మంగళవారం

ప్రాంతీయ వార్తలు చదివిన గుడిపూడి శ్రీహరి ఇక లేరు


1975 లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్  ఎడిటర్ (రిపోర్టింగ్) గా చేరినప్పుడు, నా ఉద్యోగ బాధ్యత కాకపోయినా వారానికి మూడు రోజులు ఉదయం ఆరుగంటల నలభయ్ అయిదు నిమిషాలకు ప్రసారం అయ్యే ప్రాంతీయవార్తల బులెటిన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. అప్పుడు పరిచయం గుడిపూడి శ్రీహరి.

తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి రెగ్యులర్ న్యూస్ రీడర్లు. మాడపాటి సత్యవతి గారు అసిస్టెంట్ ఎడిటర్. అప్పుడప్పుడు  వార్తలు చదివేవారు. వారి వీక్లీ ఆఫ్స్, సెలవు రోజుల్లో వార్తలు చదవడానికి క్యాజువల్ న్యూస్ రీడర్లుగా పీ.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి గార్లు వచ్చేవారు. అప్పుడప్పుడు అనుకోకుండా వాళ్లకు కూడా  గొంతు  పట్టేసిన సందర్భాలు వచ్చేవి. అప్పుడు నేనే  బులెటిన్ పేపర్లు పట్టుకుని వెళ్లి స్టూడియోలో కూర్చుని వార్తలు చదివేసేవాడిని. (ఈ  అనుభవం తర్వాత రోజుల్లో నాకు అక్కరకు వచ్చింది. రేడియో మాస్కోలో వార్తలు చదవడానికి నన్ను ఎంపిక చేసే సమయంలో, వస్తుతః నేను రేడియో విలేకరిని అయినప్పటికీ, , అవసరార్థం నెత్తికి ఎత్తుకున్న ఈ అనుభవం పనికివచ్చింది) 

ఉదయం పూట న్యూస్ రీడర్లు చదివే వార్తలను ఎడిట్ చేసి ఇవ్వడం నా బాధ్యత. ఉద్యోగంలో చేరకముందే, స్కూలురోజులనుంచే వీళ్ళు చదివే వార్తలు నేను రేడియోలో  వింటూ ఉండేవాడిని. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే మహత్తర అవకాశం నాకు రేడియో ఉద్యోగం ఇచ్చింది.

శ్రీహరి సంగతి కదా చెప్పుకుంటున్నాం.

ఆయన వయసులో నాకంటే పెద్ద.  కానీ ఆహార్యంలో నాకంటే కుర్రవాడు. హాలీవుడ్ సినిమా హీరోమల్లే నెత్తిన హ్యాటు. చలవ కళ్ళజోడు, కోటు, బూటుతో మోటార్ సైకిల్ మీద ఆయన రేడియో ప్రాంగణంలో ప్రవేశిస్తూ వుంటే చూడాలి. శ్రీహరి గారి దగ్గర రకరకాల హ్యాట్లు (టోపీలు కాదు,ఇంగ్లీష్, హిందీ   సినిమాల్లో  హీరోలు పెట్టుకునేవి), పలురకాల నల్ల కళ్ళజోళ్లు, కొట్టవచ్చేటట్టు కనబడే ముదురు రంగుల బుష్ కోట్లు, వీటన్నితో అసలు వయసు కంటే చాలా చిన్నవాడిగా కనబడేవాడు. అంచేత నేను కూడా చనువు తీసుకుని ఏకవచనంలోనే సంబోధించేవాడిని. ఆయనా అల్లాగే నన్నూ ఏమోయ్ శ్రీనివాసరావ్ అని పిలిచేవాడు. అలా అరమరికలు లేని స్నేహం మా నడుమ వుండేది. ఇప్పుడు అలాంటి చనువువుందని చెప్పలేను. వయసు పెరుగుతున్న కొద్దీ ఇచ్చ్చిపుచ్చుకునే మర్యాదలు, పలకరింపుల్లో తేడాలు రావడం సహజం.   

ఆహార్యానికి తగ్గట్టే శ్రీహరి వార్తలు చదివే తీరు కూడా విభిన్నంగా వుండేది. బయట కులాసాగా తిరిగినట్టే స్టూడియో లోపల కూడా బేఫికర్ గా వార్తలు చదివేవాడు. వార్తలు చదువుతూ గొంతు సవరించుకోవడం, ఊపిరి పీల్చి వదిలిన ధ్వని ఇవన్నీ మా రేడియో వాళ్లకి నచ్చవు. అదే రిపోర్టులో రాసి ఆయనకు చెప్పమనే వారు. నేను చెబితే ఆయన నవ్వి ఇలా అన్నాడు.

‘మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఇలా అనేవాళ్ళు ఎప్పుడయినా బీబీసీ వార్తలు విన్నారా! వాయిస్ ఆఫ్ అమెరికా వార్తలు విన్నారా! అక్కడ ఇటువంటివి సహజంగా తీసుకుంటారు. నిజానికి అలా చేయడం వల్ల ఈ ప్రోగ్రాము ముందుగా రికార్డు చేసింది కాదు, లైవ్ ప్రోగ్రాం అని శ్రోతలకు తెలుస్తుంది కూడా’

ఆయన చెప్పింది నాకు సరిగ్గానే అనిపించింది. 

కొన్నేళ్ళ క్రితం శ్రీహరికి భార్యావియోగం కలిగింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనుకున్నాను.

అయితే ఈ ఉదయం ఓ దుర్వార్త తెలిసింది. శ్రీహరి ఇకలేరు. తన ఎనభయ్ ఎనిమిదో ఏట గత రాత్రి రెండుగంటల సమయంలో తుది శ్వాస విడిచారు.



(05-07-2022)

కామెంట్‌లు లేవు: