6, జులై 2022, బుధవారం

వై.ఎస్. ను కడుపుబ్బ నవ్వించిన కాల్ సెంటర్ ఉద్యోగిని

(జులై 8 వై ఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితం)


ఎప్పుడో పుష్కరకాలానికి ముందు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సత్యం ఫౌండేషన్, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో హెచ్.ఎం.ఆర్. ఐ. రూపకల్పన చేసిన 104 కాల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వచ్చారు.

ముందుగా అసలు ఏమిటి ఈ కాల్ సెంటర్ అనే విషయం గురించి కొంత చెప్పడం సముచితంగా వుంటుంది. సామాన్యులకు, అసామాన్యులకు సమస్యలు అనేకం,  సమాధానం ఒక్కటే!  ఆ జవాబే 104 అనే  ఈ పధకాన్ని గుర్తించి, ప్రోత్సహించి అమలు చేయడంలో తోడ్పడింది రాజశేఖర రెడ్డి గారే కనుక. 


‘కాంతమ్మకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. మూడేళ్ళ పిల్ల వున్నట్టుండి కాళ్ళూ చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. యెంత పట్టుకున్నా వంకర్లు తిరిగిపోతోంది. సమయానికి మొగుడు కూడా ఊళ్ళో లేడు. టైము చూస్తే అర్ధరాత్రి. పొరుగూరుకు వెడితే కాని డాక్టరు దొరకడు. దిక్కు తోచని కాంతమ్మకు ఏం చేయాలో తోచడం లేదు.


‘మూర్తికీ శైలజకూ కొత్తగా పెళ్లయింది. హానీమూన్ కి వెళ్లి వస్తుంటే దారిలో కారు చెడిపోయింది. దానికి తోడు విడవకుండా కురుస్తున్న వర్షం ఒకటి.  ఏం చెయ్యాలో తెలియని స్తితిలో దగ్గరలో వున్న టీ స్టాలుకు వెళ్ళారు. కారు రిపేరు పూర్తయ్యేసరికి, వేళకాని వేళలో తాగిన ఆ  టీ వికటించిందేమో తెలియదు,  మూర్తికి వాంతులు మొదలయ్యాయి. కొత్త పెళ్లి కూతురికి భయంతో చెమటలు పట్టాయి. ఏడవడం తప్ప ఏం చెయ్యాలో తెలియని పరిస్తితి.


‘రామనాధానికి సర్కారు మీద చెప్పరాని కోపం వచ్చింది. వూళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వుందన్నమాటే కాని, డాక్టరు కంటికి కనిపించడు. మిగిలిన సిబ్బంది కూడా యధా రాజా తధా ప్రజా బాపతు. మందులు మచ్చుకు కూడా దొరకవు. కూతురు, అల్లుడు పండక్కి వచ్చారు. ఒక్కగానొక్క మనుమడికి వళ్ళు పేలిపోయే జ్వరం. చూపిద్దామంటే డాక్టరు లేడు. దూరాన వున్న బస్తీకి టాక్సీ కారులో తీసుకువెళ్ళి వైద్యం చేయించాల్సి వచ్చింది. నానా హైరానా పడిన రామనాధానికి కోపం రాకుండా ఉంటుందా. వచ్చింది. కానీ ఎవరి మీద చూపించాలి ఆ కోపం? ఎవరికి పిర్యాదు చేయాలి పాపం.


‘వెంకటరావు వుంటున్న ఊరు ఓ మోస్తరుగా పెద్దదే. అక్కడ పెద్ద ఆసుపత్రులతో పాటు పెద్ద డాక్టర్లు వున్నారు. భార్యకి గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే పెద్ద డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్లి, పెద్ద ఫీజు చెల్లించి, పెద్దవైద్యమే చేయించాడు. కాస్త నెమ్మదించిన తరువాత ఆ పెద్ద డాక్టరు రాసిచ్చిన పెద్ద మందుల జాబితాలో కొన్ని మందులు ఆ వూళ్ళో యెంత ప్రయత్నించినా దొరకలేదు. దొరికే షాపు ఎక్కడ వుందో తెలవక తల పట్టుకున్నాడు వెంకటరావు.

ఇలాంటి కాంతమ్మలూ, మూర్తులూ, శైలజలూ, రామనాధాలు, వెంకటరావులు ఇంకా ఎంతమందో. అందరిదీ ఒక సమస్య కాదు. కానీ ఏం చెయ్యాలి అన్నదే అందరి సమస్య.

అప్పటి ప్రభుత్వం నిపుణులను సంప్రదించి, ఎంతో ఆలోచించి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కుంది. అదే 104.

ఇదొక టోల్ ఫ్రీ నెంబరు. రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా ఈ నెంబరుకు ఉచితంగా ఫోను చేయవచ్చు. ఈ కేంద్రంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన సమస్త సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి వుంచారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, డ్యూటీలో వున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, దగ్గరలో వున్న ఎక్సరే, రక్త పరీక్షా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు, మందుల షాపులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు నర్సింగు హోములు, ఇలా అన్ని వివరాలు సిద్ధంగా వుండడం వల్ల ఫోను చేసిన వారు ఏ సమాచారం అడిగినా క్షణాల్లో వారికి అందించడానికి వీలుపడుతుంది. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో డాక్టర్లు సెలవులో ఉన్నదీ, ఎక్సరే, స్కానింగు వంటి పరికరాలు మరమ్మత్తుల్లో ఉన్నదీ, ఎక్కడ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోతలు వున్నదీ ఇటువంటి వివరాలు అన్నింటినీ ప్రభుత్వ విభాగాలతో ఏర్పరచుకున్న సమన్వయం ద్వారా సేకరించి ఉంచుకుంటారు. మొదటిసారి ఫోను చేసినప్పుడు వైద్య సలహా అవసరం వున్న వ్యక్తుల వివరాలను, పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా అన్నింటినీ రికార్డు చేసుకుని ఒక నెంబరు ఇస్తారు. తరువాత ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ ఫోనుచేసినా ఈ వివరాలన్నీ కేంద్రంలో కంప్యూటర్ తెరపై సిద్ధంగా వుంటాయి కనుక, డాక్టరు కాలయాపన లేకుండా రోగికి తగిన వైద్య సలహా సూచించడానికి వీలుంటుంది. ఈ కేంద్రంలో వైద్యులు రాత్రింబవళ్ళు వైద్య సలహాలు ఇవ్వడానికి సంసిద్ధంగా వుంటారు. పెద్దగా చికిత్స అవసరం పడని సందర్భాలలో డాక్టర్లు అప్పటికప్పుడు చేయాల్సిన ప్రధమ చికిత్సలు సూచించి ఉపశమనం లభించేలా చూస్తారు. మందులు ఎక్కడ లభిస్తాయో ఆ షాపుల వివరాలు సిబ్బంది తెలియపరుస్తారు. ఒకవేళ చికిత్స అవసరమని భావిస్తే 108 కి తెలియపరచి అంబులెన్సు పంపిస్తారు. 

స్థూలంగా ఇవీ 104 సేవాకేంద్రం నిర్వహించే ఉచిత సర్వీసులు.

ఇక అసలు విషయం చెప్పుకుందాం.

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సమయానికే సమావేశానికి వచ్చారు. ఈ పధకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రారంభ సూచకంగా సభావేదిక మీద నుంచే 104 నెంబరుకు ఫోన్ చేశారు.

అవతల నుంచి కాల్ సెంటర్ ఉద్యోగిని క్షణాల్లో స్పందించింది.

“104కు స్వాగతం. దయచేసి మీ పేరు చెబుతారా?”

ముందు కంగు తిన్నా ముఖ్యమంత్రి తన పేరు చెప్పారు. హాజరైన సభికులు అందరూ అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టీవీ తెరలపై ఇదంతా వీక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి తన పేరు చెప్పగానే, కాల్ సెంటర్ ఉద్యోగిని తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండో ప్రశ్నను సంధించింది.

“ఎక్కడ వుంటారు, ఏం చేస్తుంటారు, మీ చిరునామా చెబుతారా?”

వై.ఎస్. ఇక నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశారు. ఆయన నవ్వడంతో సభాప్రాంగణం కూడా నవ్వులతో నిండిపోయింది.
కామెంట్‌లు లేవు: