25, జులై 2022, సోమవారం

పుట్టింట్లో కొన్ని ఘడియలు

 

ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొందురు గాని, ఓమారు దయచేయండి అని పుట్టిల్లు ఆకాశవాణి నుంచి పిలుపు. ఎగిరి గంతేసా. రిటైర్ అయి పదిహేడేళ్లు. చాలాకాలం తర్వాత వెళ్ళే అవకాశం.
ఇంటర్వ్యూ చేయాల్సింది ఎవర్ని. బ్రిగేడియర్ శ్రీరాములు గారిని. మరో గంతు వేసా.
ఎందుకంటే ఆయన ఎవరో కాదు, ఎస్సారార్ కాలేజీలో మూడేళ్లు కలిసి చదువుకున్నాం. కాకపొతే ఆయన ఎంపీసీ. నేను కామర్స్.
ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఇద్దరం వెళ్లాం. ఆయన సైనిక పురి నుంచి, నేను ఎల్లారెడ్డి గూడా నుంచి. బ్రిగేడియర్ కి సాంప్రదాయక మర్యాదలు, నాకు ఆత్మీయతతో కూడిన పలకరింపులు. కొన్ని పరామర్శలు కూడా.
ఆయన నేనూ కాలేజీలో ఎన్సీసీ వాళ్ళమే. నేనేమో బూట్లు, యూనిఫారం కోసం, ఆయనేమో చిత్తశుద్ధిగా చేరిన బాపతు. 1971 ఇండో పాక్ యుద్ధంలో సైనికాధికారిగా పాల్గొని వీరోచితంగా పాల్గొని ఆయన ప్రసంశలు, పతకాలు సాధిస్తే, అదే సమయంలో నేనేమో బెజవాడ ఆంధ్రజ్యోతిలో నైట్ డ్యూటీలు చేస్తూ అదే యుద్ధ వార్తలు అనువాదం చేస్తూ ఉండేవాడిని.
బ్రిగేడియర్ చాలా విషయాలు చెప్పారు. ఎక్కడో హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో, నిశిలో అయినవారికి దూరంగా మృత్యువు నీడలో సంచరిస్తూ, శత్రుసైనికుల కదలికలను గమనిస్తూ భారత సైనికులు తమ ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న విధానాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
మిలిటరీలో జవాన్ నుంచి జనరల్ వరకు సైన్యంలో చేరిన రోజే వీలునామా రాయించి తీసుకుంటారట. ఎప్పుడు ఏ క్షణంలో మృత్యువు పంజా విసురుతుందో తెలియని ఆ ఉద్యోగంలో ఎందుకైనా మంచిదని ఆ ఏర్పాటు. ఆంధ్రజ్యోతిలో చేరడానికి వెళ్ళిన రోజు, ఎడిటర్ నార్ల గారు, నీ రాజీనామా ఏదీ అని అడిగిన సంఘటన జనపకం వచ్చింది. బలవంతపు రాతలు రాయడం ఇష్టం లేకపోతె, ఉద్యోగం నుంచి స్వచ్చందంగా తప్పుకుని ఆత్మ గౌరవం వ్యక్తిత్వం కాపాడుకోవడానికి ప్రతి జర్నలిస్టు రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలని నార్లగారి ఉవాచ.
త్రివిధ సైనిక దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటిలోనే ఒక సైనికాధికారిని రేడియోలో ఇంటర్వ్యూ చేయడం కాకతాళీయమే అయినా గొప్ప సంతృప్తిని కలిగించింది.
ప్రోగ్రాం పూర్తయింది. పెళ్లి చూపుల తతంగం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి ఏ సంగతి కబురు చేస్తాం అని మగ పెళ్లివాళ్ళు అన్నట్టు, ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అయ్యేది తర్వాత చెబుతాం అన్నారు రేడియో అధికారులు.
సరే! ఏదైతేనేం! ఏదో ఒక పేరుతో పుట్టిల్లు చూడడం, పుట్టింటి వారితో మాట్లాడడం అనే ఒక పని పూర్తయింది.
పదిహేడేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తు పట్టి పాత రోజులు గుర్తుకు తెచ్చిన ఇంజినీరింగ్, ప్రోగ్రాం సిబ్బందికి మనః పూర్వక ధన్యవాదాలు. ఒకప్పుడు మా దగ్గర న్యూస్ యూనిట్ తలలో నాలుకలా మా దగ్గర పనిచేసి, ప్రస్తుతం స్టేషన్ డైరెక్టర్ పేషీలో పనిచేస్తున్న శైలజారంగాచారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఆవిడ చనిపోయిన మూడేళ్ల తర్వాత కూడా ఆ విషయం తలచుకుని ఇవ్వాళ కన్నీళ్లు పెట్టిన ఆమె పెద్ద మనసుకు జోహార్లు.
కింది ఫోటోలలో బ్రిగేడియర్ ఎస్. శ్రీరాములు, స్టేషన్ డైరెక్టర్ ఉదయ శంకర్, సరే ఎలాగు నేను.











(25-07-2022)

కామెంట్‌లు లేవు: