28, జులై 2022, గురువారం

సమర్ధత, సచ్చీలతలకు చిరునామా జైపాల్ రెడ్డి

 (ఈరోజు ఆయన వర్ధంతి)

ప్రభుత్వాలను కార్పొరేట్లు శాసిస్తాయనే అపవాదు ఒకటి వుంది. కార్పొరేట్లను అదుపుచేయాలని చూసే కేంద్ర మంత్రుల అడ్డు తొలగించుకునే శక్తి సామర్ధ్యాలు వాటికి పుష్కలం అని చెప్పుకోవడం కద్దు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న శ్రీ ఎస్. జైపాల్ రెడ్డికి కూడా ఈ బెడద తప్పలేదు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ వచ్చిన జైపాల్ రెడ్డి అప్పుడు పెట్రోలియం మంత్రిగా వున్నారు.
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే, ఉత్తరాది మీడియా బాంబు లాంటి వార్త పేల్చింది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభీష్టం మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డిని తప్పిస్తున్నారని.
పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారంలో అగ్రగామిగా వున్న రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి అనుకూలమయిన నిర్ణయాలు తీసుకోవడంలో జైపాల్ రెడ్డి విముఖత ప్రదర్శిస్తూ వుండడమే దానికి కారణమని కొన్ని పత్రికలు ముక్తాయింపు కూడా ఇచ్చాయి.
మీడియా వూహాగానాలను నిజం చేస్తూ జైపాల్ రెడ్డి శాఖ మారింది. చాలా చిన్న శాఖగా పరిగణించే శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖను జైపాల్ రెడ్డి వంటి సీనియర్ కు వొప్పగించిన తీరు చూసి నివ్వెర పోవడం అందరి వంతు అయింది. ఆయన మాత్రం నిబ్బరం కోల్పోలేదు. ‘పెట్రోలియం శాఖ ఇచ్చినప్పుడు కొంత అసంతృప్తికి గురయ్యాను. కాని ఇప్పుడు శాస్త్ర సాంకేతిక శాఖ కేటాయించినప్పుడు ఎలాటి అసంతృప్తి లేద’ని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పండిపోయిన మనిషి. యెలా స్పందించాలో ఆ మాత్రం తెలియని వ్యక్తి కాదు కదా. కానీ ఆ అవకాశాన్ని కేజ్రీవాల్ అందిపుచ్చుకున్నారు. ఆయన అప్పటికి ఇంకా పేరుపెట్టని ఓ కొత్త పార్టీ పెట్టి, అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులపై అవినీతి ఆరోపణాస్త్రాలు గుప్పిస్తూ మీడియాలో వెలిగిపోతున్న రోజులవి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు కదా!
ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, ఇందులో భాగంగానే జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారని కేజ్రీ వాల్ ఆరోపణ.
ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనకు విరుద్ధంగా రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేసి ధర పెంచాలని అడ్డదారిలో వొత్తిడి తెస్తోందని అంటూ, సరకును దాచి పెట్టి కృత్రిమంగా రేట్లు పెంచాలని చూసే చిల్లర వ్యాపారుల నైజంతో రిలయన్స్ దిగ్గజం వ్యవహారాన్ని కేజ్రీ వాల్ పోల్చారు.
ముఖేష్ అంబానీ డిమాండ్లను అంగీకరిస్తే రిలయన్స్ సంస్థకు 43 వేల కోట్ల రూపాయల అదనపు లాభం రాగలదని., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై 53 వేల కోట్లు అదనపు భారం పడగలదని జైపాల్ రెడ్డి తయారుచేసిన నోట్ లో పేర్కొన్నారని కేజ్రీ వాల్ వెల్లడించారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ అన్వేషణ విషయంలో ప్రభుత్వంపై అధిక భారం పడగల అనేక రాయితీలను గతంలో బీజేపీ సారధ్యంలోని ఎన్ డీ యే ప్రభుత్వం కూడా సమకూర్చి పెట్టిందని ఆయన గుర్తుచేశారు.
కేజ్రీవాల్ ఆరోపణలు ఎలావున్నా, వాటిపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ హయాములో న్యూఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ జరిగినప్పటి మాట. ఇందులో కూడా జైపాల్ రెడ్డి సమర్ధతతకు అద్దంపట్టే ఓ ఉదంతం వుంది. ఈ క్రీడలు ప్రారంభం కాకమునుపే అనుమానపు మబ్బులు కమ్ముకున్నాయి.
ఈ క్రీడలు మొదలు కావడానికి రెండు రోజులు ముందువరకు కూడా అందరి మనసుల్లో నూటొక్క సందేహాలు. నిర్వాహకుల నిర్వాకంపై వేయిన్నొక్క అనుమానాలు.
అవినీతి పునాదులపై స్టేడియాల నిర్మాణం జరిగిందనీ, అతిధులకూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకూ సరయిన వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ,
భద్రతా ఏర్పాట్ల పట్ల శ్రద్ధ కరువయిందనీ,
ఉగ్రవాదులనుంచి పెను ముప్పు పొంచివుందనీ,
ఇలా ఎన్నో ఆరోపణలు.
ఎన్నెన్నో విమర్శలు.
ఈ నేపధ్యంలో –
దేశ ప్రతిష్ట మసకబారబోతోందనే దశలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చక చకా చర్యలకు ఉపక్రమించింది. ఆరోపణలకు కేంద్ర బిందువయిన క్రీడల కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ అనుదిన జోక్యంపై అంటకత్తెర వేసింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికార బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన బాధ్యతలన్నీ అప్పగించింది. ప్రారంభ సంరంభానికి పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేని స్తితిలో, పరిస్తితులను చక్కదిద్దే భారాన్ని జై పాల్ రెడ్డి బృందం భుజస్కందాలపై మోపింది.
పనులు ఓ గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో క్రీడోత్సవ నిర్వహణలో భాగంగా నిర్మిస్తున్న ఒక వంతెన హఠాత్తుగా కూలిపోవడంతో విమర్శల జడివాన మళ్ళీ మొదలయింది. అయితే, జైపాల్ రెడ్డి పూనికతో ప్రధాని కల్పించుకుని సైన్యాన్ని రంగం లోకి దింపి, వంతెన నిర్మాణాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేయించడంతో ఆరోపణల కారు మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి.

https://www.andhrajyothy.com/telugunews/special-story-about-jaipal-reddy-political-carrer-in-the-memory-of-his-death-anniversary-hsn-mrgs-telangana-1822072811521232?fbclid=IwAR3tA4pr3171uJPzmEr9n-PJ41TaFRkWqDVnn3Z1tAbEkUo_3lIqmfeT36k
(28-07-2022)

కామెంట్‌లు లేవు: