23, జులై 2022, శనివారం

అసలేముంది రాజకీయంలో - భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 24-07-2022, SUNDAY)

ఈ కింది సంభాషణలు చిత్తగించండి:

“ఐ.ఐ.టి. టాపర్ అయిన  మీరు ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”

“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని  అప్పట్లో  భావించాను”

“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి  అయివుండి, ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”

“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”

“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”

“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

“దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చంద సంస్థలకు కోట్ల రూపాయలు  భూరివిరాళాలుగా  ఇస్తుంటారు. మరి  రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది”

“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”

“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. మీకు మీరే సాటి అనే పేరుంది. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మధన్యం  అనుకునే వీరాభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. మరి ఈ వయసులో రాజకీయ అరంగేట్రం చేసి,  ఎండనకా, వాననకా ప్రజాసేవ అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”

“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే సరైన  మార్గం”   

“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ.గా వున్నారు.  వృత్తిపరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ ప్రవేశం ఎందుకు చేసినట్టు”

“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”

“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం. అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”

“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను” 

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!

చివరికి ప్రజాసేవ కూడా సోషలిజంలాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.

మరో అర్ధం కాని విషయం వుంది. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఎవరూ డబ్బులు లేని వాళ్ళు కాదు. మరిన్ని ఎక్కువ సొమ్ములు సంపాదించేందుకు రాజకీయాల్లో చేరుతున్నారా అంటే అదీ కాదు. మరి ఎందుకోసం ఈ యావ!  

ఎందుకంటే రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికారచక్రం అలవోకగా  తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయనీటికి ఎగబడే చేపల చందంగా రాజకీయ కండువాలు కప్పుకోవడం కోసం తహతహలాడేది అందుకే.

ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం!

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. కానీ  బయటకు తెలియని విషయం ఒకటుంది. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క బీట్ కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు, షూటింగ్ పర్మిషన్  ఒక్కటే కాదు, కస్టడీలో ఉన్న మనిషికూడా దర్జాగా బయటకు వస్తాడు. ఇక మా ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోవాలి? అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ అనేది  ఓ ప్రముఖ సినీనటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు మరుక్షణంలో క్లియర్ అవుతాయి. కానీ మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎంత గట్టి ఆఫీసర్లం అయినా సరే, పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా ఒక్కోసారి  మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసే బదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా, కాలం గడుస్తున్నకొద్దీ  తత్వం బోధపడి సర్దుకుపోవడమే మేలనే స్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో మనసు మూలల్లో  బాధ. ఇంత చదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మేము అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ అనేది  ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

“ఏళ్ళ తరబడి కష్టపడి సువిశాల వ్యాపార, వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాను. నెలకు లక్షలు లక్షలు జీతాలు తీసుకునే సిబ్బంది నా దగ్గర వేల మంది అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. వాటిని చుట్టి రావడానికి సొంత విమానాలు వున్నాయి. బస చేయడానికి ఏడు నక్షత్రాల హోటళ్ళకు ఏమాత్రం  తీసిపోని సొంత అతిథి గృహాలు అన్ని నగరాల్లో  లెక్కకు మిక్కిలిగా వున్నాయి. కానీ ఏం లాభం. గవర్నమెంటులో  ఒక్క చిన్న ఫైలు కదిలించడానికి మా సీనియర్ అధికారులు సచివాలయం చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు హోటల్లో ఇచ్చే టిప్పు పాటి చేయని నెల జీతాలు తీసుకునే ప్రభుత్వ గుమాస్తాల ముందు చేతులు కట్టుకుని నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటారు. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడు కల్పించుకుని పై వాళ్లకు ఓ మాట చెబితే ఆ ఫైలు  ఆఘమేఘాల మీద కదిలి, అన్ని సంతకాలతో ఆమోద ముద్ర వేసుకుని బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురయినప్పుడు అనిపిస్తుంది, ఎందుకీ పనికిరాని వైభోగాలు, సిరి సంపదలు అని. అసలైన అధికారం మా దగ్గర లేదని తేలిపోయింది. ఎక్కడ ఉన్నదో కూడా తెలిసిపోయింది. అందుకే రాజకీయ రంగప్రవేశానికి అడుగులు వేస్తోంది” ఒక వ్యాపారవేత్త అంతరంగం.

“ఒక చిన్న వీధి రౌడీ దగ్గర కుడి భుజంగా చాలా కాలం వున్నాను. అతడు చెప్పిన పనల్లా చేస్తూ పోయాను. చాలాసార్లు  పోలీసులకు దొరికిపోయి నానా అవస్థలు పడ్డాను. వాళ్ళు నన్ను  నన్ను నడి బజారులో తన్నుకుంటూ స్టేషన్ కు తీసుకు వెడుతుంటే మిన్నకుండిపోయాను. ఇక ఎన్నాళ్ళీ కష్టాలు అని ఓ శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ నాయకుడి దగ్గర అనుచరుడి  అవతారం ఎత్తాను. కొంత పేరు వచ్చిన తర్వాత నన్ను అడిగేవాడే లేడు, అడ్డుకునే వాడే లేడు. నన్ను పట్టుకునే పోలీసు పుట్టలేదు, నన్ను పెట్టే జైలు కట్టలేదు అనే తరహాలో రొమ్ము విరుచుకుని తిరిగే అవకాశం నాకీ కొత్త వృత్తి ఇచ్చింది” అని ఓ మాజీ గ్యాంగ్ లీడర్ తన  గోడు వెళ్ళబోసుకుంటాడు.

అంటే వీరందరినీ రాజకీయాల వైపు  బలంగా లాగుతోంది వ్యవస్థలో ఉన్న లోపం అనుకోవాలి.  

తోకటపా:

ఇలా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు పైకి చెప్పే ప్రజాసేవ అనేది ఒక పడికట్టు పదం మాత్రమే. అసలు కారణాలు మాత్రం  వేరే అనిపిస్తే తప్పేముంది!

నిజానికి ప్రజాసేవే చేయాలి అనుకుంటే అంటే రాజకీయ పదవులు అవసరమా!

ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకే వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.



కామెంట్‌లు లేవు: