17, జులై 2022, ఆదివారం

నిమిషము అనగా ఏడాది.


(Published in Andhra Prabha daily on 17-07-2022, SUNDAY)

ఇదేం లెక్క అంటారా? పరీక్షలు నిర్వహించే వారి లెక్కలు ఇలాగే వుంటాయి. 

‘ఒక్క నిమిషం ఆలస్యం అయినా సరే పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదు’

ఎం సెట్ పరీక్షలకు ముందు టీవీల్లో ఈ స్క్రోలింగు చకచకా పరిగెత్తుతూ పరీక్షార్దుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తూ వుంటుంది. ఎం సెట్ ఒక్కటే కాదు ఏ సెట్టయినా ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. 

ఏదో సబబైన కారణం వుండి నిమిషం ఆలస్యం అయి పరీక్ష హాల్లో ప్రవేశించలేని వాళ్ళు మళ్ళీ పరీక్ష రాయాలంటే ఒక ఏడాది నిరీక్షించాలి. పైగా ఈ ‘సెట్ల’ కు సప్లిమెంటరీలు కూడా వుండవు, మార్చి తప్పితే సెప్టెంబరు ఉందిలే అనుకోవడానికి. ఏకంగా ఏడాది ఆగాల్సిందే. అందుకే చెప్పింది, నిమిషం అంటే ఏడాది అని. 

పరీక్షలు అనేవి రాసే పిల్లలకే కాదు, వాళ్ళ తలితండ్రుల పాలిట కూడా విషమ పరీక్షలే. ఆ పరీక్షలే పెద్ద పరీక్ష అనుకుంటే పరీక్ష రాయడం, రాయించడం మరో పరీక్షగా పరిణమిస్తోంది. రాసే పరీక్షకు సిద్ధం అవడం ఒక పరీక్ష అయితే, ఆ పరీక్ష రాయడానికి చదువుతో నిమిత్తం లేని అదనపు కసరత్తులు కొన్ని చేయాల్సివస్తోంది.

ముందు హాలు టిక్కెట్టు వస్తుందో లేదో అన్న ఆందోళన. వచ్చిన తరువాత అది సరిగా వుందో లేదో అని సరి చూసుకోవడం, అచ్చు తప్పులు వుంటే అదో మనాది. అది బాగుంటే, రాయాల్సిన పరీక్షాకేంద్రం ఆనుపానులు కనుక్కోవడానికి దుర్భిణీ వేసి వెతుకులాడడం. హైదరాబాదువంటి  మహానగరాల్లో వాటి అడ్రసులు కనుక్కోవడంలోనే తలప్రాణం తోకకు వస్తుంది. ఎలాగో అలా కనుక్కుని వెడితే ఇది కాదు మరో చోటికి పొమ్మంటారు. అది వెతుక్కుని వెళ్ళేలోగా పుణ్యకాలం ముంచుకు వస్తుంది. ‘నిమిషం నిబంధన’ నెత్తి మీది కత్తిలా వేలాడుతుంటుంది. ఆ ఆందోళన బుర్రల్ని  నిరామయం చేస్తుంది. ఇన్నాళ్ళు చదివింది పూజ్యంగా మారి, సమయానికి అక్కరకు రాని కర్ణుడి విలువిద్యను గుర్తుకు తెస్తుంది.

ఈ విషయంలో ఒక అధికారి ఇచ్చిన వివరణ ఇలా వుంది. 

“పోటీ పరీక్షల్లో ప్రతి నిమిషం అమూల్యమైంది. ఒక్క మార్కుతో వందల ర్యాంకులు తేడా వచ్చే అవకాశం వుంది. రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు రైలు సమయానికి రాదని ఖచ్చితంగా తెలిసినా, ఎందుకయినా మంచిదని ముందుగానే స్టేషనుకు వెడతారు. అలాగే విమానాల్లో వెళ్ళే వాళ్ళు నిబంధనల ప్రకారమే కొన్ని గంటలు  ముందుగా వెళ్లి నిరీక్షిస్తారు. ఇక సినిమాలకు వెళ్ళేవాళ్ళు సరే సరి. టైటిల్స్ నుంచి చూడాలనే కోరికతో నానా ఇబ్బందులు పడయినా సరే సినిమా హాలుకు ఒకింత ముందుగా చేరుకుంటారు. మరి తమ భవిష్యత్తుకు కీలకమైన పరీక్షలకు సకాలంలో చేరుకోవాలని నిబంధన పెడితే ఇన్ని విమర్శలు అవసరమా?” 

ఆ అధికారి చెప్పింది వినడానికి సబబుగానే వుంది.

నిజమే! పరీక్ష అనే కాదు, ఏ విషయంలోనయినా క్రమశిక్షణ అవసరమే. సమయపాలన మరింత ముఖ్యమే. చిన్నతనంలోనే ఈ రెంటికీ సరయిన పునాదులు పడడం అభిలషణీయమే. ఈ దిశగా అధికారులు కానీ, వారిని పర్యవేక్షించే ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవడం కూడా అవశ్యమే. కాదనలేని సంగతే. అయితే కొండ నాలుకకు మందు వేసే క్రమంలో వున్న నాలుక ఊడిపోకూడదు. ఇలా హితోక్తులు పలికేవాళ్ళు, తమ మార్గానికి అడ్డం వస్తున్నారని, మార్పుకి వ్యతిరేకులని అనుకోరాదు.

ఎంసెట్ అనేది చదువుకునే పిల్లలకు, వారి తలితండ్రులకి ఒక అపూర్వమైన ఘట్టం. ఈ పరీక్షే తమ భవితను నిర్దేశిస్తుందని నమ్మేవారు కోకొల్లలు. వారిలోని ఈ నమ్మకమే ప్రైవేటు విద్యా సంస్థలకు కల్పతరువుగా మారుతోంది. కోట్ల రూపాయలు కురిపించే కామధేనువుగా తయారవుతోంది.

అయితే  ఒక విషయం గమనంలో వుంచుకోవాలి. ఈ పరీక్షలు రాసేవాళ్ళు జీవితంలో ఢక్కామొక్కీలు తిన్న బాపతు కాదు. లేలేత ప్రాయంలో వున్నవాళ్ళు. ఎటువంటి ఎదురుదెబ్బలను అయినా తట్టుకోగల మానసిక నిబ్బరం ఈ వయస్సులో వారికి వుండదు. తమ బతుకు బాట మార్చే పరీక్ష రాసే అవకాశం చేజారి పోయిందన్నప్పుడు వారికి కలిగే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. బస్సు తప్పిపోయో, అడ్రసు దొరక్కనో, వారి చేతిలో లేని వేరే ఏదయినా కారణం చేతనో, నిమిషం ఆలస్యం అయిందన్న ఒకే ఒక్క కారణం తమ జీవిత ధ్యేయానికి తూట్లు పొడుస్తుంటే వారికి కలిగే  వేదనను అర్ధం చేసుకోవడానికి సైకియాట్రిస్టులు కానవసరం లేదు. 

కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే అసలు ఈ నిమిషం నిబంధన ఎంత అర్ధరహితమో అన్నది అర్ధం అవుతుంది. 

నిమిషం కూడా లేటు కాకూడదు అంటున్నారు సరే! అది ఏ లెక్క ప్రకారం? పరీక్ష రాసే అభ్యర్ధి పెట్టుకున్న గడియారం ప్రకారమా? గేటు కాపలాదారుడి చేతికి వున్న వాచీ ప్రకారమా? పరీక్ష హాల్లో పర్యవేక్షణ చేసే అధికారుల గడియారాల ప్రకారమా? నిమిషం ఆలస్యాన్ని నిర్ధారించడానికి ఏది ప్రామాణికం? ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒక సమయం చూపెట్టవని అంటారు. అలాంటప్పుడు నిమిషం ఆలస్యం అయిందా లేదా అనే విషయం ఎవరు నిర్ణయించాలి? ఎవరు నిర్ధారించాలి? అసలు ఈ నిమిషం నిబంధన ఏ  ప్రాతిపదిక పైన విధించారు? అనే ప్రశ్నకు కూడా సమాధానం కావాల్సివుంది.

ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలస్యం అనేది తమ హక్కుగా పరిగణిస్తున్నప్పుడు, ఒక్క నిమిషం ఆలస్యాన్ని కూడా ఉపేక్షించేది లేదు అనే ఈ వైఖరిని ఒక్క పరీక్షార్ధుల పట్ల మాత్రమే ఎందుకు వర్తింప చేస్తున్నారు? ఇది ఏమేరకు సమంజసం?

అధికారులు సమయానికి ఆఫీసులకి రారు. వారికోసం వచ్చిన వారికి,  వెయిట్ చేయండి, సారు  వచ్చే టైం అయింది అనే జవాబు సిద్ధంగా వుంటుంది. గంటలు గడిచి పోతున్నా ఆ నిమిషం అనేది ఎప్పటికీ రాదు. అదేమని అడిగే హక్కు ఎవరికీ వుండదు. మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం సరైన సమయానికి ఎగరాల్సిన విమానాలు ఆగిపోతాయి. బయలుదేరాల్సిన రైళ్ళు నిలిచిపోతాయి. ఎందుకు ఆలస్యం అని అడిగేవాళ్ళు వుండరు.

ఎవరూ ఎప్పుడూ పాటించని సమయ పాలన అనే నిబంధనను లేలేత ప్రాయంలోని విద్యార్ధుల పట్లనే ఇంత నిర్దయగా ఎందుకు అమలు చేస్తారు అన్నదే జవాబు దొరకని ప్రశ్న. ఒక్క నిమిషంలో పుట్టేమీ మునగదు అంటూ నీతి సూక్తాలు వల్లె వేసే వాళ్ళే ఈ నిమిషం నిబంధన పట్ల గంభీర ప్రకటనలు చేస్తూ వుండడం విడ్డూరం. 

అంశం సమయ పాలన కాబట్టి అందుకు సంబంధించిన మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం. 

సమయాన్ని ఎవరు పాటించినా పాటించక పోయినా పరవాలేదు కానీ, రాజకీయ నాయకులు, అధికారులు పాటించి తీరాలి. ఎందుకంటే, ఈ నియమం వారు పాటించని పక్షంలో, వారికోసం వేచి చూస్తూ అనేకమంది తమ విలువైన సమయం పాడు చేసుకోవాల్సి వస్తుంది.

ముఖ్యమంత్రి వెంగళరావు వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. హైదరాబాద్ పంజాగుట్ట,  ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు, గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా ప్రతి రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమేకానీ, నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. 

జలగం వెంగళరావు ఓసారి బ్యాంకర్ల మీటింగు పెట్టారు. ఇప్పట్లోలా అప్పుడిన్ని ప్రభుత్వ బ్యాంకులు ఉండేవి కావు. ఓ పది మంది బ్యాంకు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు.

ముఖ్యమంత్రి ఛాంబరులో మీటింగు. అధికారులు ఎందుకయినా మంచిదని ఓ పది నిమిషాలు ముందే వెళ్ళారు. ఇప్పట్లోలా సెక్యూరిటీ బాదరబందీలు లేవు కాబట్టి వెళ్లి సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి భద్రతాధికారి సీతాపతిని కలిసారు. ‘రండి రండి మీ కోసమే సి ఎం ఎదురు చూస్తున్నారు’ అంటూ లోపలకు తీసుకువెళ్ళి కూర్చోపెట్టారు. సరిగ్గా చెప్పిన టైముకు నిమిషం తేడా లేకుండా వెంగళరావు గారు గదిలోకి వచ్చారు. ఎజెండా ప్రకారం మాట్లాడాల్సినవి మాట్లాడి, వినాల్సినవి విని, ఇచ్చిన సమయం అరగంట కాగానే మంచిది వెళ్ళిరండి అని వీడ్కోలు పలికారు. గంటలు గంటలు పడిగాపులు పడకుండా వచ్చిన పని పూర్తయినందుకు అధికారులు కూడా సంతోషపడుతూ వెళ్ళిపోయారు.

తోకటపా: 

ఎనభయ్యవ దశకంలో కౌలాలంపూర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య వెళ్ళారు. విలేకరిగా నేను కూడా.

కారణాలు ఏమైతేనేం కాంగ్రెస్ అధిస్థానం అంజయ్యపై కినుకతో వున్నరోజులవి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీ అద్దంలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’, హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య వ్యవహారం. 



(17-07-2022)

2 కామెంట్‌లు:

bonagiri చెప్పారు...

నిజమే కాని, కెరీర్ లో ఓ పది పదిహేనేళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఒక్క ఏడాది పెద్ద విలువైనది కాదని అర్ధమవుతుంది. మన కంటే చిన్న వాళ్ళు కూడా మన కంటే ముందుకు వెళ్ళిపోతుంటారు.
సరైన అవకాశాలు దొరకడం, వాటిని సరిగ్గా అంది పుచ్చుకోవడం మీదే జీవితం ఆధారపడి ఉంటుంది.

అజ్ఞాత చెప్పారు...

ఒక్క నిమిషం ఆలస్యమయినా ……. అన్న నిబంధన అర్థరహితమే కాదు చాలా రాక్షస నిబంధన అంటాను. హైదరాబాద్ లాంటి ఊళ్ళో మామూలుగానే ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిన సంగతే. ఇక పరీక్ష రోజున చెప్పనక్కర లేదు. అటువంటి పరిస్ధితుల్లో ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించం అనడం ఎవరికి పైశాచికానందం ఇస్తోందో తెలియడం లేదు. ఆ అధికారెవరో ఇచ్చిన వివరణ సమస్య కన్నా దారుణంగా ఉంది. లేటుగా వచ్చిన అభ్యర్థులు ఆ ఫలితం తామే అనుభవిస్తారు. పోటీ పరీక్షలకే కాదండి ఇంటర్ లాంటి ఇతర పరీక్షలకు కూడా ఈ నిబంధన వర్తింప చేస్తున్నారు. అది మరీ దారుణం. ఈ నిబంధన తెచ్చే టెన్షన్ లో తన కొడుకుని కూర్చోబెట్టుకుని మోటర్ సైకిల్ మీద వెడుతున్న ఓ తండ్రి ఆక్సిడెంట్ జరిగి మరణించిన సంఘటన కొన్నేళ్ళ క్రితం జరిగింది. ఇటువంటి వాటికి ఈ అధికారులు బాధ్యత వహిస్తారా ?

అరగంట ఆలస్యం అనుమతించడం అన్నది ఏనాడో బ్రిటిష్ పాలన కాలం నుండీ ఉన్నదే. అప్పుడప్పుడు కొన్ని నిముషాలు ఆలస్యంగా వెళ్ళిన వాళ్ళమే మనలో చాలామంది. ఇప్పుడేమంత గొప్పగా ఉందని ఆ అమానుష ఒక నిమిషం నిబంధన ప్రవేశ పెట్టారు ? ఎవరికి వచ్చిన ఘనమైన ఆలోచన? దీన్ని కోర్టులో సవాలు చెయ్యాలంటాను.

- విన్నకోట నరసింహారావు