13, జులై 2022, బుధవారం

మరణ రహస్యం – భండారు శ్రీనివాసరావు

 చనిపోయిన తరువాత ఇద్దరు ఆడవాళ్ళు కలుసుకున్నారు. ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెప్పుకుంటూ వెడుతుంటే అందులో ఒక ఆత్మ రెండో ఆత్మని అడిగింది, ఇంతకీ నువ్వెలా చనిపోయావని.

మొదటి ఆవిడ చెప్పింది, 'బహుశా ఇలాటి చావు నాకు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. చావుకు కాసేపు ముందు వరకు నేను కలల లోకంలో తేలిపోతూనే వున్నాను. అంతే, అరగంటలో చావు ముంచుకు వచ్చింది. భయంతో గడ్డకట్టి చనిపోయాను. ఒక్క భయంతోనే కాదు నిజంగానే గడ్డగట్టిపోయాను. మరి నీ సంగతి?'

'నాదా! నాదో విషాద గాధ. నాకు నా మొగుడి మీద చచ్చేంత అనుమానం. అనుమానం కాదు. అది నిజం. పెద్ద గ్రంధసాంగుడు. నేనలా ఆఫీసు దోవపట్టగానే ఎవత్తనో ఒకత్తిని ఇంట్లోకి తెచ్చి కులికే రకం. అందుకే అతడ్ని హఠాత్తుగా పట్టేసి నలుగుర్లో పెట్టి పంచాయితీ చేయాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. అది ఇన్నాళ్లకు ముడిపడింది. ఆఫీసుకు పోతున్నానని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి పోయాను. ఆయన హాల్లో కూర్చుని తాపీగా టీవీ చూస్తున్నాడు. పడగ్గదిలోకి వెళ్ళి చూసాను. పడక చిందరవందరగా వుంది, కాని ఆ సోకులాడి జాడ లేదు. వంటింట్లోకి వెళ్లాను. పెరట్లోకి పరుగెత్తాను. బాతు రూములో చూసాను. ఇంతట్లోకే ఎటుపోయినట్టు. నాకు ఒళ్ళు మండుతోంది. పిచ్చిపట్టినట్టు మళ్ళీ ఇల్లంతా వెతికాను. పడగ్గది, వంటగది, పెరడు, బాతు రూము, వెతికినచోటే వెతుకుతూ పోయాను. నీరసం వచ్చింది. అలుపు అనిపించింది. ఎక్కడో గుండె పట్టుకున్నట్టు అనిపించింది. వళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళు మూసుకుపోయాయి. తెరిచేసరికి ఇదిగో ఇక్కడ నీతో.....'

మొదటి ఆవిడ పైకి అనబోయి తెలివి తెచ్చుకుని మనసులోనే అనుకుంది.

'ఇల్లంతా వెతికింది కాని ఈ మహా ఇల్లాలు, కాస్త ఫ్రిజ్ తెరిచి చూసివుంటే ఇద్దరం బతికిపోయేవాళ్ళం'(ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

 

కామెంట్‌లు లేవు: