9, జులై 2022, శనివారం

భర్త అంటే ఎలా వుండాలి? – భండారు శ్రీనివాసరావు


రెండు నెలల క్రితం ఓ ఉదయం ఫోన్ మోగింది.

‘నేను  కృష్ణయ్యను మాట్లాడుతున్నాను

పరిచయమైన పేరు, అపరిచితమైన గొంతు.

ఆయనే తనని తాను పరిచయం చేసుకున్నారు. పేరు లోకం కృష్ణయ్య.  గత ఇరవై ఆరేళ్లుగా హైదరాబాదులో ఆరాధన పేరుతొ ఓ సాంస్కృతిక సంస్థను నడుపుతున్నానని, ఈ ఏడాది జులై ఎనిమిదిన ఇరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నాకు పాత్రికేయ పురస్కారం ఇవ్వాలని అనుకున్నానని ఆయన చెప్పారు.

డెబ్బయ్ ఆరేళ్ల జీవితం,  యాభయ్ ఏళ్ళకు పైగా వృత్తి వ్యాపకం. ఇన్నేళ్ళుగా వినని మాట. ఎవరూ అనని మాట.

పైగా నాకు అలవాటు లేని ఔపోసనం.

అదే మాట చెబుతూ, నన్ను మన్నించండి అని సున్నితంగానే  కృష్ణయ్య గారికి చెప్పాను.

కానీ ఆయన గట్టి పిండంలా వున్నారు. పట్టిన పట్టు విడవలేదు.

‘అసలు నా గురించి మీకెవరు చెప్పారు, నా నెంబరు మీకు ఎలా తెలుసు?

నా ఈ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం వింతగా అనిపించింది.

‘నాకెవరూ చెప్పలేదు.  ఆదివారం ఆదివారం మీ  వ్యాసాలు ఆంధ్రప్రభలో  చదువుతూ వుంటాను. ఫేస్ బుక్ లో చూస్తూ వుంటాను

ఎవరి సిఫారసువల్లా కాదు.  ఇక కాదు  అనడానికి కారణం కనపడలేదు.

నిన్న జులై ఎనిమిది.

చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభకు వెళ్లాను. డెబ్బయ్యవ దశకంలో అంటే దాదాపు నలభయ్ ఏడేళ్ల క్రితం గానసభకు కూతవేటు దూరంలో ఓ సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్ లో అయిదేళ్లు కాపురం చేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. గానసభలో నటుడు ఎవరైనా ఆరున్నొక్క రాగంలో పద్యం పాడితే మా ఇంటికి వినిపించేది.  ఆ ఇంటి స్థానంలో ఇప్పుడు ఓ అపార్ట్ మెంట్ వెలిసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి. భవానీ ప్రసాద్ ముఖ్య అతిథి. నేనెవరో ముఖతః తెలియకపోయినా నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. రాతల ద్వారా కూడా నలుగురికి తెలుస్తాం అనే ఎరుక కలిగింది.

వివిధ రంగాల్లోని  వారికి కూడా ఈ సందర్భంగా సన్మానం చేశారు. కిన్నెర సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మద్దాళి రఘురాం  వీరిలో వున్నారు. అలాగే, భర్త విజయంలో భార్య, భార్య విజయంలో భర్త పాత్ర లేదా వారి భాగస్వామ్యం వుంటుంది అనే  కాన్సెప్ట్ తో కొందరు దంపతులను ఈ సందర్భంగా సత్కరించారు. ఆకాశవాణిలో క్యాజువల్ గా న్యూస్ చదివే సి.హెచ్. సతీష్ కుమార్, అయన భార్య కల్యాణి సన్మాన స్వీకర్తల్లో వున్నారు.    

వారిలో  మరొకరు శ్రీమతి పి. విజయదుర్గ. ఈమె ఎవరో కాదు ఒకానొక కాలంలో విఠలాచార్య సినిమాల్లో ప్రాచుర్యం పొంది పొట్టి వీరయ్యగా ప్రసిద్ధులైన నటుడి కుమార్తె. భర్త శ్రీ మల్లికార్జున సన్మాన పీఠం మీద  ఆమెను రెండు చేతులతో  ఎత్తి కూర్చోబెడుతున్న దృశ్యం చూసి సభికుల కళ్ళు చెమర్చాయి. శారీరక అంగవైకల్యం కలిగిన భార్యను మనసుతో ప్రేమించే భర్తను  చూసి,  నేనయితే ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరించాను.

పొతే, అసలు కార్యక్రమం మొత్తానికి  కర్తాకర్మాక్రియ అయిన కృష్ణయ్య గారిని చూడాలనే నా వెతుకులాట చివరి వరకు కొనసాగింది. వెనుకవుండి అంతా నడిపించిన ఆయన మాత్రం  నిజంగా తెర వెనుకనే వుండిపోయారు.

పావలా ఖర్చుతో పాతిక రూపాయల ప్రచారం కోరుకునే ఈ కాలంలో కృష్ణయ్య గారి లాంటి వ్యక్తులు అరుదే అని చెప్పాలి.   

(08-07-2022) 
కామెంట్‌లు లేవు: