20, జులై 2022, బుధవారం

రాజకీయాల్లో ఏదో వుంది? - భండారు శ్రీనివాసరావు

 

ఈ కింది సంభాషణలు చిత్తగించండి:

ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:

ఐ.ఐ.టి. టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”

ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”

విలేకరి:

మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”

రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”

విలేకరి:

రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”

అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

విలేకరి:

“దేశంలోనే కాదు ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చందసంస్థలకూ కోట్ల రూపాయలు  భూరి విరాళాలు ఇస్తుంటారు. మరి  రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమివచ్చింది”

“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”

విలేకరి:

“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మ ధాన్యం అనుకునే అభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. ఈ వయసులో ఎండ అనకా, వాన అనకా ప్రజాసేవ కోసం అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?

“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే మార్గం”   

విలేకరి:

“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ. వృత్తి పరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ అరంగేట్రం ఎందుకు చేసినట్టు”

“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”

విలేకరి:

“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం.అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”

“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను” 

 

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!

చివరికి ప్రజాసేవ కూడా సోషలిజం లాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.

తోకటపా:

 

తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.

 

కామెంట్‌లు లేవు: