10, జులై 2022, ఆదివారం

నరంలేని నాలుకలు – భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు ఆదివారం 10-07-2022 తేదీ ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి అయిన ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960 అధ్యక్ష ఎన్నికలనాటికి డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధి రిచర్డ్ నిక్సన్ ని  ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే, తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.

అడ్లాయ్ స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.

రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి, జనాలను నమ్మించడానికి ప్రయత్నించే సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.

అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరుతెన్నులను గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.

సోవియట్ యూనియన్ లో స్టాలిన్ అనంతరం అధికారానికి వచ్చిన కృశ్చెవ్ వీలు చిక్కినప్పుడల్లా స్టాలిన్ విధానాలను తూర్పారబడుతుండే వాడు. నిజానికి స్టాలిన్ హయాములో కృశ్చెవ్ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. స్టాలిన్ ఏం చెప్పినా పెదవి విప్పి ఏమీ చెప్పలేకపోయేవాడు.

స్టాలిన్ తదనంతరం కృశ్చెవ్ సోవియట్ కేంద్ర కమిటీ అధినాయకుడిగా పదవి చేపట్టిన తర్వాత ఆయన స్టాలిన్ ను పదేపదే విమర్శించే తీరు కృశ్చెవ్ అనుయాయులకు విచిత్రంగా తోచేది. స్టాలిన్ జీవించి వున్న కాలంలో ఆయనకు వీర విధేయుడుగా ఉంటూ, ఆయన ఏమి చెప్పినా గొర్రెలా తల ఊపే కృశ్చెవ్ ఇతడేనా అనే అనుమానం వారిని తొలుస్తుండేది. ‘ఆ రోజునే ఇలా ఎందుకు మాట్లాడలేకపోయారు, ఇప్పుడెందుకు ఇలా దుయ్యబడుతున్నారు’ అని అడగాలని వారికి వున్నా ఆ మాట  పైకి అనే ధైర్యం ఎవరికీ లేదు. చివరికి  ఒకరోజు ఒక యువ నాయకుడు తెగించి మనసులో మాట అడిగేశాడు. కృశ్చెవ్ నవ్వి ఇలా అన్నాడు.

మీరు ఈరోజు నా ముందు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నారా! ప్రతిదానికి తందానా అంటున్నారా లేదా! ఆరోజుల్లో నేనూ అదేపని చేశాను’

ఇది ఒక జోక్ కావచ్చు. కేంద్రీకృత అధికార రాజకీయాలకు అద్దం పడుతుంది.

రోజూ టీవీ చర్చల్లో “మీరు ఆరోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు నిలదీస్తున్నారు” అని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకుంటూ వుంటే ఎందుకో ఏమో ఈ జోకు జ్ఞాపకం వస్తుంటుంది

కండవర్ విండిలై విండవర్ కండిలై’ అని తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే! కనబడడంలోనే తేడాలు.

'నిజం చెబుతున్నారా, నిజమే చెబుతున్నారా?' అనే సందేహాలు కలిగేలా వుంటాయి కొందరు రాజకీయ నాయకుల ప్రకటనలు.

ఇంత అయోమయం గతంలో ఎన్నడూ లేదు.

దొరికిన దొంగలు, దొరకని దొంగలు, దొరకాల్సిన దొంగలు అని మూడు రకాలు.  అందరూ దొంగలే అయితే కింకర్తవ్యం?

'డబ్బులు తీసుకుని పార్టీలు మారొచ్చు, డబ్బులు తీసుకుని పార్టీలు పెట్టొచ్చు. డబ్బులు తీసుకుని ప్రభుత్వాలు పడగొట్టొచ్చు, మళ్ళీ వాటిని  నిలబెట్టొచ్చు.

కానీ మేము మాత్రం ఓటేయడానికి వాళ్ళిచ్చే ముష్టి పైసలు, అదీ మేము అడుక్కుని కాదు, వాళ్లిచ్చినవి తీసుకుంటే, ప్రజాస్వామ్యం మంటకలిసి పోతుందట. ఇదెక్కడి న్యాయం'

అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వద్దనుకున్నా చెవిలో పడుతుంటాయి.

జనం గమనిస్తున్నారు అని రాజకీయులు తరచూ అంటుంటారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు అనే సోయి వారికి  వుందని ఎవరైనా అనుకుంటారా వాళ్ళ మాటలు వింటుంటే.

'మేము ఆ పార్టీని తిడుతుంటే మీరెందుకు తిట్టరు"

'మీకంటే ఘాటుగానే తిడుతున్నాము,వినబడడం లేదా'

ఈ తిట్ల పురాణాలు అవసరమా!

ఆత్మస్తుతి, పరనిందలతో చర్చోపచర్చలు ఇంటింటా డ్రాయింగు రూముల్లో  పొంగిపొరలుతున్నాయి

"ప్రజలకు మనం ఏంచెప్పినా వారికి గుర్తుండదు. ఏం చెప్పినా పర్వాలేదు"

అనేది రాజకీయ నాయకుల నమ్మకం లాగుంది.

విన్న లేదా చూసిన వార్త నిజమా! కాదా! అనే సంగతి నిర్ధారణగా చెప్పగలిగినవారికి ఏ బహుమతి ఇవ్వొచ్చు అంటారు?

 

తోకటపా:

 

అరవై ఏళ్ళ కిందట విన్న సంగతి.

మా నాన్నగారు గ్రామ కరణమే. అయినా కరణాల గురించి వాళ్ళ పరోక్షంలో ఊళ్ళో వాళ్ళు చెప్పుకునే సంగతి ఇది.

ఆ వూరికి తాసీల్దారో గిర్దావరో ఎవరో ఒక పై అధికారి వస్తారు. కరణం, మునసబులతో మాట్లాడుతుంటారు. ఊళ్ళో వాళ్ళు దూరం నుంచి చూస్తూ వుంటే కరణంగారు అంగీ జేబు నుంచి ఏదో కాగితం బయటకు తీసి మళ్ళీ జాగ్రత్తగా మడత పెట్టి జేబులో పెట్టేసుకుంటారు. అంతే! అది చూసిన జనం తలా ఒక రకంగా చెప్పుకుంటారు. ఇన్నాళ్ళుగా సాగు చేసుకుంటున్న బంజరు భూమికి నీళ్ళు వదులు కోవాల్సి వస్తుందేమో అని కొందరు, వేయని పంటకు అదనపు శిస్తు వేసే ఆలోచనలో వున్నారేమో అని మరి కొందరు ఇలా ఎవరికి వారు తమ సమస్యను భూతద్దంలో పెద్దదిగా చేసి ఊహించుకుని భయపడుతుంటారు.

నిజానికి కరణం గారు జేబులో మడిచి దాచిన కాగితం వాళ్ళావిడ రాసిచ్చిన ఇంటి సరకుల జాబితా!

(09-07-2022)



కామెంట్‌లు లేవు: