14, జులై 2022, గురువారం

గోదావరి వరదలు – భండారు శ్రీనివాసరావు


నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లో ఓసారి గోదావరి నదికి ఉధృతంగా వరదలు వచ్చాయి. పెరుగుతున్న వరద నీటి మట్టాలను గురించి ఎప్పటికప్పుడు చెబుతూ, ప్రజలని అప్రమత్తం చేయడానికి ఆ రోజుల్లో ఉన్న ఏకైక మీడియం బేటరీలతో పనిచేసే రేడియో ఒక్కటే. దూరదర్సన్ వున్నా దానికి కరెంటు వుండాలి. మామూలుగానే కరెంటు నిలకడగా వుండని ప్రదేశాలు. ఇక వానలు, వరదలు వస్తే చెప్పాలా! రోజులతరబడి చీకటి రాత్రులే. వరదలు ముంచెత్తి లంకలుగా తేలిన గ్రామాలకు పత్రికలు చేరే చాన్స్ అసలు లేదు. అంచేత ఏ సమాచారం వాళ్లకు చేరవేయాలన్నా పనికొచ్చేది, అందుబాటులో వుండేది రేడియో మాత్రమే.
హైదరాబాదు నుండి ఆహార పొట్లాలను ప్రతి రోజూ రెండు దఫాలుగా హెలికాప్టర్ లో తీసుకువెళ్ళి వరద ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు పైనుంచి జారవిడిచేవాళ్ళు. సహాయ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుతెన్నులను రేడియో వార్తల ద్వారా తెలియచెప్పడానికి రేడియో విలేకరిగా నేను కూడా ఒకసారి హెలికాప్టర్ లో భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాను. అది మిలిటరీ హెలికాప్టర్. సీట్లు అవీ వుండవు. ఒక పక్కగా సీటు బెల్టులు ఉన్న ఒక చెక్క బల్ల లాంటిది వుంది. మిగిలిన జాగా అంతా పులిహోర పొట్లాలు, బిస్కెట్ల సంచులు. వాటిని కిందికి విసిరేసేటప్పుడు హెలికాప్టర్ ని బాగా కిందికి దించేవాళ్ళు. చెట్ల కొమ్మల మీదా, ఇంటి కప్పుల మీదా నిలబడిన జనం హెలికాప్టర్ చప్పుడు వినగానే ప్రాణం లేచొచ్చినట్టు, పైకి చూస్తూ తమని గమనించమని చప్పట్లు కొట్టేవాళ్ళు. పైనుంచి సంచులను కిందికి వదిలేలోగా హెలికాప్టర్ వేగానికి బాగా ముందుకు వెళ్ళిపోయేది. ఆ సంచులు పడాల్సిన చోట పడకుండా ఎక్కడెక్కడో పడి నీళ్ళ పాలు అయ్యేవి. కానీ సైనికులది జాలిగుండె. మళ్ళీ వెనక్కి తిప్పి ఎక్కడనుంచి, ఎప్పుడు కిందికి పడేస్తే వాళ్లకు చేరుతుందో ఉజ్జాయింపుగా లెక్క వేసుకుని అనేక ప్రయత్నాలు చేసి ఏదో ఒక విధంగా వాళ్లకు అందేటట్టు చూసేవాళ్ళు. నాచేత కూడా కొన్ని సంచులు కిందికి విసిరేయించారు.
హైదరాబాదు తిరిగి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ‘చుట్టూ నీళ్ళు వున్నా అవి తాగడానికి పనికి రాని నీళ్ళు’ అని చెప్పాను. అప్పట్లో ఈ వాటర్ బాటిళ్ళ పద్దతి లేదు. ప్లాస్టిక్ సంచుల్లో నీళ్ళు సప్లయి చేద్దామంటే అదీ కుదిరే పనికాదని తేలింది. రెండు మూడు రోజులు నిలవ వుండాలంటే పులిహోర తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదులా వుంది. డిసెంట్రి లాంటి రోగాలు వచ్చే ప్రమాదం కూడా వుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు శుభ్రమైన నీళ్ళు అవసరం అని డాక్టర్లు చెబుతారు. ఆ సంగతే నేను వాళ్ళతో చెప్పాను. ఈ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చేలోగా గోదావరి వరదలు తగ్గుముఖం పట్టాయి.

కామెంట్‌లు లేవు: