8, ఆగస్టు 2014, శుక్రవారం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ........నలభయ్ ఏళ్ళ క్రితం  రేడియోలో  వార్తలు  చదివే  న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. పరీక్షలో నెగ్గినవారికి స్టూడియోలోనే కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డ్ చేయించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన ఓ పెద్దమనిషి వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని బోధపరచడానికి ముందు ముందు అది  పనికొస్తుందన్నది  ఆయన తాత్పర్యం.

రేడియో వార్తలను ఏర్చి కూర్చడం ఒక వంతయితే, వాటిని చదివే తీరుతెన్నులే శ్రోతల ఆసక్తిలో హెచ్చుతగ్గులను నిర్ధారిస్తాయి.

పది  నిమిషాలేనా! ఇంకావుంటే బాగుండు అనుకోవడానికీ-
పది నిమిషాలేగా! వింటే ఓ పనయిపోతుంది అని సరిపెట్టుకోవడానికీ  ఎంతో తేడా వుంది.

సమర్దుడయిన న్యూస్ రీడర్ తనదయిన శైలితో శ్రోతలను ఆకట్టుకుంటాడు. రేడియో కట్టేయాలని కసితో వున్న శ్రోతను కూడా  రేడియోకి కట్టిపడేయగలుగుతాడు.

నోటికీ, చెవికీ మధ్యవున్నది నిజానికి బెత్తెడు దూరమే. అయితే, రాసింది చదవడానికీ, చదివేది వినడానికీ నడుమ కాసింత తేడా వచ్చినా సరే అందులోనే స్వారస్వం దెబ్బతింటుంది. ఈ చదవడం వినడం అన్న ప్రక్రియ రేడియో వార్తలకు ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి ఈ తేడాని పట్టుకోగలగడం లోనే రేడియోవారి ప్రతిభ బయట పడుతుంది. వెనుకటి తరం రేడియో న్యూస్ రీడర్లు
వార్తలను మనసు పెట్టి చదవడం వల్లనే వారి పేర్లు ఈనాటి తరానికి కూడా గుర్తుండిపోయాయి.

కాలం వేగంగా మారుతోంది. ఛానళ్లకు  వేగంగా వార్తలను అందించే క్రమంలో విలేకర్లు కూడా వార్తాప్రసారంలో తమ వంతు పాత్ర పోషించాల్సి వస్తోంది. స్టుడియోలో కూర్చుని వార్తలు చదివే వారికి దీటుగా బయటనుండి వార్తలు అందించే విలేకరులు సయితం ఎలాటి తడబాటు లేకుండా అప్పటిఅకప్పుడు తాజా వార్తని వివరించాల్సి రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో న్యూస్ రీడర్లకు కొంత  వెసులుబాటు ఉంది. ఎందుకంటె- వారు చదవాల్సిన వార్తల స్క్రిప్ట్ వారివద్దనే సిద్ధంగా వుంటుంది.  స్పాట్ నుంచి వార్తలు అందించే విలేకరి పరిస్తితి ఇందుకు భిన్నం. అంతేకాకుండా విలేకరులు వార్తలు చదవకూడదు. వార్తని చెప్పగలగాలి. పైగా అంతకుముందు పంపిన వార్తకు తాజా సమాచారాన్ని జోడించి తడుముకోకుండా చెప్పాల్సివుంటుంది. ఏకకాలంలో న్యూస్ రీడర్ పాత్రనీ, న్యూస్ రిపోర్టర్ పాత్రనీ పోషించగలగాలి. అప్పుడే వార్తలు వింటున్న శ్రోతకు కంటిన్యుటీ వున్న భావన కలుగుతుంది.

వార్తలు పంపేటప్పుడు, ముఖ్యంగా రేడియోకి విలేకరులు మూడింటిని -   సూటిగా, స్పష్టంగా, సరళంగా అనే పదాలు గుర్తుంచుకోవాలి. అంటే చెప్పదలచుకున్న వార్త, డొంకతిరుగుడులు లేకుండా  సూటిగా వుండాలి. స్పష్టంగా చెప్పడం వల్ల వార్త లోని నిబద్ధత పెరుగుతుంది. సామాన్య శ్రోతకు సయితం అర్ధం అవడానికి సరళత తోడ్పడుతుంది. వీటికి తోడు సాధికారత తోడయితే ఆ వార్తకు ఇక అడ్డే వుండదు.
1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

చాలా కాలం క్రిందటి సంగతి. ప్రజలు ఆకాశవాణి అధికారులతో మొఱ పెట్టుకున్న వైనం.

"మహాప్రభో దయచేసి ఆ అనౌన్సర్ గారిని కొంచెం పక్కకు తప్పించి పుణ్యం కట్టుకోండి. వారు వడ్డించే వాతలకు తట్టుకోలేకపోతున్నాం"

ఎందుకో తెలుసా?
ఆ వ్నౌన్సర్ గారి ప్రకటన తీరు ఇలా ఉండేది మరి.

"సమయం ఏడు గంటలు కావస్తోంది. ఇప్పుడు సంస్తుతంలో వాతలు, ఆ తరువాత తెలుగులో వాతలు ప్రసారం అవుతాయి"