12, ఆగస్టు 2014, మంగళవారం

మావారి ముచ్చట్లు


"ఇదిగో బాబూ! నీపేరు ఏమన్నావు రమేష్ కదా! అయినా నీ పేరుతొ పని లేదు నీ సెల్ నెంబరు వుంటే చాలు"
అంటున్నారు మావారు పొద్దున్నే.
మళ్ళీ మొదలయిందన్నమాట కారు డ్రైవరు ఇంటర్వ్యూ, మనసులోనే అనుకుంటూ నేనూ అక్కడికే వెళ్ళాను. కారుకొన్న ఈ మూడేళ్లలో పదిమంది మారారు. ఇతను అంటే  రమేష్ అంటే పేరుతొ పనిలేని సెల్ ఫోన్ కుర్రాడు, మా వారికి నచ్చి కుదిరితే పదకొండో డ్రైవర్ అవుతాడు.
"ఈ కారు ఎవరిదీ?' మా వారి ప్రశ్న.
"మీదే కదా!" అనుమానంగా అడుగుతున్నాడు ఆ కుర్రాడు.
"కాదు. ఆ కారు నాది కాదు. ఇక నుంచీ నీది. అంటే  ఏమిటి. నీ సొంత కారులా జాగ్రత్తగా చూసుకోవాలన్న మాట"
"అలానా!" అన్నాడు కుర్రాడు నిరుత్సాహంగా ఏదో పోగొట్టుకున్నట్టు మొహం పెట్టి.
"నీకు డ్రైవింగు లైసెన్స్ వుందా అని నేను అడగను. ఎందుకంటే దాన్ని చూపించమని ఈ హైదరాబాదులో ఏ పోలీసూ కారు ఆపి అడగకూడదు. అంటే ఏవిటన్నమాట. అంత జాగ్రత్తగా ఏ తప్పూ చేయకుండా డ్రైవ్ చేయాలన్నమాట"
రమేష్ అనే సెల్ నెంబరు కుర్రాడు నిలువు  గుడ్లేసుకుని వింటున్నాడు. వినేవాడు దొరికాడు కదా అని మా ఆయన చెలరేగిపోతున్నాడు. మధ్యలో కల్పించుకోవడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి వుండదని కాపురానికి వచ్చిన కొత్తల్లోనే అర్ధం అయింది.
" నాకు కారు నడపడం కాదుకదా, ఆగితే దిగి తొయ్యడం కూడా తెలవదు. కానీ కారు ఆక్సిడెంటు కాకుండా యెలా నడపాలో బోలెడు పుస్తకాలు చదివి తెలుసుకున్నాను"  
"కారు నెమ్మదిగా తోలాలి. యెంత నెమ్మదిగా అంటే వెనుకనుంచి ఎవరయినా సైకిల్ మీద వస్తూ మనల్ని దాటి పోయినా పర్వాలేదు. మనకు  అంత అర్జంటు వ్యవహారాలు ఏవీ లేవు.
"రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు విధిగా కారు ఆపాలి. చలాన్ ఇంటికి వచ్చినా, మధ్యలో పోలీసు వసూలు చేసినా అది నీ జీతంలోనుంచి కోత కోస్తాను.
"రిటైర్ అయి ఇంట్లో కూర్చున్నాను. కొంపలు మునిగి పోయే పనులేవీ లేవు. ఏదో పెట్రోలు ఆదా చేయాలని స్పీడుగా నడుపుతానంటే కుదరదు. అయినా పెట్రోలు కొట్టించేది నీవు కాదుకదా!"
"అందరూ ఇచ్చే జీతం నేను ఇవ్వనుగాక ఇవ్వను. ఎందుకంటే దానికి రెట్టింపు ఇస్తాను కాబట్టి"
ఈ చివరి మాటతో కుర్రాడు కొంత తెరిపినపడ్డట్టు మొహం పెట్టాడు. కానీ అది క్షణం నిలవలేదు.
"మాకూ మా ఆవిడకూ వూళ్ళేలే రాచకార్యాలు లేవు. వారానికి ఒకటి రెండు సార్లు వస్తే చాలు. కానీ పిలిచినప్పుడు అర్ధరాత్రీ అపరాత్రీ అని నకరాలు పోతే కుదరదు. అర్ధం అయిందా?"
అర్ధం కాకపోవడానికి ఏముంది. మావారి సంగతి ఆ కుర్రాడికి పూర్తిగా అర్ధం అయివుంటుంది.
'రేపు కలుస్తాను' అంటూ తుర్రుమన్నాడు.
నాకు తెలుసు ఆ రేపు అనేది ఇక రాదనీ. ఎల్లుండో, ఆ మర్నాడో పన్నెండో వాడు ఇంటర్వ్యూ కి వస్తాడని.

Note: Courtesy Image Owner 

కామెంట్‌లు లేవు: