5, ఆగస్టు 2014, మంగళవారం

నా గురించి నలుగురూ.....2


1988 లో ఆంధ్ర జ్యోతి మాజీ ఎడిటర్, మహా టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ ఐ. వెంకట్రావ్, నాటి సోవియట్ ప్రభుత్వ వార్తా సంస్థ 'నోవొస్తీ' ఆహ్వానంపై  రెండు వారాలపాటు సోవియట్ యూనియన్ ని సందర్శించారు. అందులో భాగంగా మాస్కో వచ్చారు. 'ఫ్లాష్ బ్యాక్' అనే పేరుతొ రచించిన పుస్తకంలో శ్రీ వెంకట్రావ్ నా గురించి ప్రస్తావించారు.
"మాస్కోలో వున్నప్పుడు మిత్రుడు భండారు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లాను. ఆకాశవాణిలో పనిచేసే శ్రీనివాసరావు రేడియో మాస్కోలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు, నేనూ ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో సహచరులం. శ్రీనివాసరావు సరదా మనిషి. ఒకటే జోకులు. తెగ నవ్విస్తుంటారు. ఆయన కుటుంబం అంతా నాకు తెలుసు. అందువల్ల నన్ను డిన్నర్ కు ఇంటికి ఆహ్వానించారు. నాతొపాటు ఇండియా నుంచి వచ్చిన మరో ఇద్దరు జర్నలిష్టులను కూడా. ఆయన ఇంటిలోనే ప్రముఖ కూచిపూడి నర్తకి శోభానాయుడి గారిని కలిసాను. ఆవిడా, ఆవిడ బృందం ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా సోవియట్ నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. మాలాగే, ఆవిడా, ఆవిడ సహచర బృందం కూడా శ్రీనివాసరావుకి గెస్టులు. అర్ధరాత్రివరకు కబుర్లు, తిండి తినడాలతో కాలం ఇట్టే గడిచిపోయింది. హోటల్ కు తిరిగి రావడానికి ఇంటి బయటకు వస్తే వీధులన్నీ నిర్మానుష్యం. లైట్లు  దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. కానీ జనసంచారం నిల్. శ్రీనివాసరావుని అడిగాను - 'భయం వుండదా?'అని. మిగతా సమస్యలు యెలా వున్నా మాస్కోలో భయం అన్నది మాత్రం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి వొంటరిగా ఆడమనిషి బయటకు వెళ్ళినా నిక్షేపంగా ఇంటికి చేరగలదని ఆయన చెప్పారు. దగ్గర్లో  వున్న మెట్రో స్టేషన్ వరకు మా వెంట వచ్చి రైలు ఎక్కించి వెళ్లారు."1 కామెంట్‌:

Vennelakeratam Team చెప్పారు...

"వెన్నెలకెరటం" సాహిత్య బ్లాగుకు సభ్యత్వనమోదుకు ఆహ్వానం
http://vennelakeratam.blogspot.in/p/blog-page_4312.html