14, ఆగస్టు 2014, గురువారం

నిర్ణయం (కధానిక) - భండారు శ్రీనివాసరావు
ప్రహరీ  గేటు తెరుస్తుంటే సెల్ మోగింది. శ్రీ కాంతం మామయ్య.
'ఒర్రేయ్ కృష్ణా - నువ్వు బాబాయి గారి వూరెళ్ళావని మీ ఆవిడ చెప్పింది. పరాంకుశం గారు పిల్లని చూడ్డానికి రేపు అక్కడికి వస్తున్నారని చెప్పు. నేనే చెబుదును కానీ, వొద్దులే నువ్వే అక్కడ వున్నావు కదా విషయం  నీకే బాగా తెలిసి వుంటుందిలే' అంటూ ఫోన్ ఆఫ్ చేసాడు. గేటు మీద చెయ్యి అప్రయత్నంగా వెనక్కు వచ్చింది. 'ఏవిటిలా అంటాడు. శ్రీ కాంతం మామయ్యకు  నాకంటే కూడా బాబాయి దగ్గర చనువు. పైగా నేను బాబాయి వూరికి  అనుకోకుండా వచ్చాను. ముందు అనుకున్నది కూడా కాదు. ఇప్పుడేం చేయాలి' అనుకుంటూనే గేటు తెరిచి చూసాను. బాబాయి ఏరి కోరి కట్టుకున్న ఇల్లు. ఇంటి ముందు పది మంచాలు వేసుకుని హాయిగా పండుకునే జాగా. మట్టే బంగారం అయిపోయిన ఈ రోజుల్లో కూడా ఆయన గజం జాగా కూడా అమ్మలేదు. అపార్ట్ మెంటుకు ఇవ్వాలనే ఆలోచనా  చెయ్యలేదు.
అంతా నిశ్శబ్దంగా వుంది. బాబాయి కొన్ని విషయాల్లో గంభీరంగా వుంటాడు కానీ అందరితో బాగా కలివిడిగా వుండే తత్వం. వచ్చేపోయేవాళ్ళతో హడావిడిగా వుండే ఇల్లు. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో దర్బారు మొదలవుతుంది. కొన్ని విషయాల్లో వయస్సును కూడా మరిచిపోయి హుషారుగా వుంటాడు. అందుకే నాకూ ఆయనకూ చాలా ఏళ్ళు తేడా వున్నా మేమిద్దరం ఎప్పుడూ కలిసినా చాలా సరదాగా కాలక్షేపం చేస్తుంటాం.
వసారా దాటుకుని వెళ్లాను. తలుపు వోరగా వేసి వుంది. మాటలు వినబడుతున్నాయి. అంటే ఇంట్లోనే వున్నారన్నమాట. కాలింగ్ బెల్లు నొక్కకుండానే తలుపు తోసుకుని లోపలకు వెళ్లాను. రాంబాయి పిన్నీ, పిన్ని కూతురు స్పందన ఇద్దరూ  నన్ను చూసి మాటలు ఆపేశారు.
'ఏం కృష్ణా చెప్పాపెట్టకుండా దర్శనం. అంతా బాగున్నారా. మీ ఆవిడ యెలా వుంది. ఈ మధ్య వొంట్లో బాగాలేదన్నారు. బాబాయి గారు ఇంట్లో లేరు. నేనూ స్పందనా  ఏదో లోకాభిరామాయణంలే. ఏవిటి సంగతులు?...' పిన్ని గడగడా మాట్లాడేస్తోంది. కానీ ఆ స్వరంలో ఏదో తేడా. మాటలకు చూపులకు పొంతన కుదరడం లేదు. ఈ టైం లో ఎందుకువచ్చానన్న సందేహం ఆమె కళ్ళల్లో కనబడుతోంది.
నా సందేహానికి సమాధానం స్పందన మాటల్లో నాకు  బోధపడింది.
'కృష్ణప్ప బాబాయి మనకు  ఏవన్నా కొత్తా. ఆయన దగ్గర దాచేది యేవుంటుంది. అదికాదు బాబాయి. పరాంకుశం తాతయ్య కొడుకు లేడూ. సుందరం. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చి వారం అయిందట. మళ్ళీ వెంటనే వెళ్ళాలట.  నన్ను చూసుకోవడానికి రేపో ఎల్లుండో వస్తాడట. అమ్మా నాన్నా ఒకటే ఇదై  పోతున్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కళ్ళముందు పెరిగారు. పైగా  పరాంకుశం తాతయ్యతో వ్యవహారం. బాగుండదు వొప్పుకోమ్మా అంటారు. నిన్నటి నుంచి ఇదే నస. ఏం చెప్పమంటావు' అనేసింది తానూ తల్లిలాగే లొడలొడా.
'ఓహో అందుకా అన్నీ నీకే తెలిసివుంటాయ'న్నాడు శ్రీకాంతం మామయ్య. విషయం అర్ధం అయింది. స్పందనతో  నేరుగా యెప్పుడన్నా అన్నామేమో  తెలియదు కాని,  సుందరం, స్పందన  చిన్నప్పటి నుంచీ మా అందరి లెక్కలో భార్యాభర్తలే.
ఆ మాటే పైకి అన్నాను. నామాట వినగానే స్పందన కస్సుమని లేవలేదు. పైగా మనసులోని మాటను యండమూరి వారే  ఆవహించారేమో అన్నంత చక్కగా తేటతెల్లం చేసింది.
చిట్టి, అదే స్పందన ముద్దు పేరు,  మా అందరి కళ్ళముందు పుట్టి పెరిగిన చిట్టి తల్లి, అలా ఆరిందాలా ఒక్కొక్క విషయం చెబుతుంటే నేను చెవులొప్పగించి వింటూ వుండిపోయాను.
'చూడు బాబాయి. నువ్వన్నది కరక్టే. నేనూ సుందరం మొగుడూ పెళ్లాలమని మనవాళ్లందరూ అనుకుంటున్న సంగతి నాకూ తెలుసు. కానీ మీకు తెలియంది ఒకటి వుంది. చిన్నప్పటి నుంచీ ఎన్నో అనుకుంటూ వుంటాం. అన్నీ జరుగుతాయా. నేను డాక్టర్ అయితే చూడాలని నాన్న ఆశపడ్డాడు. నాచేత నర్సింగ్ హోం పెట్టించాలని ఇల్లు చెడగొట్టకుండా అంతే వుంచేసాడు. కానీ అయినానా. లేదే. పెళ్లి అనేది మనసుకు సంబంధించింది కాకపొతే నేనూ తలవంచి సుందరం చేత తాళి కట్టించుకునేదాన్ని. చిన్నప్పటినుంచి కలిసి తిరగడం వల్లనో యేమో, 'ఒసే చిట్టీ' అంటే 'ఏరా సుందరం' అనిపిలుచుకునే వాళ్ళం. ఈ కాలంలో మొగుడూ పెళ్ళాలు   ఇలా పిలుచుకోడం మామూలయింది కాబట్టి ఈ వాదన నిలవదనుకో. కానీ, మరి మనసునేం చేయను. అది మరోలా చెబుతోందే. ఇక పరాంకుశం తాతయ్య సంగతి. ఆయనంటే అందరికీ సింహ స్వప్నమే. కానీ నాతో చిన్న పిల్లాడిలా వుంటాడు. తాతయ్య తాతయ్య అంటూ చిన్నప్పటి నుంచి ఆయన వొళ్ళో పెరిగాను. ఇప్పుడు కోడలు అవతారంలో వెళ్ళి 'మామయ్యా కాఫీ తాగుతారా' అని యెలా అడగను. సుందరం సంగతి తలచుకుంటే మరీ విడ్డూరం. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నవాడే. మళ్ళీ ఈ పెళ్లిచూపుల తతంగానికి తల వూపడం ఏమిటి? పైగా చేసే ఉద్యోగం అమెరికాలో. నేనూ ఇందులో ఇరుక్కున్నాను కనుక సరిపోయింది. లేకపోతే ఈ విషయంలో సుందరాన్ని కడిగి గాలించి వుండేదాన్ని. చివరిగా చెబుతున్నాను బాబాయి. అమ్మకూ, నాన్నకూ, పరాంకుశం తాతయ్యకూ ఇష్టం కాబట్టి ఏమి చేయమన్నా చేస్తాను, కానీ సుందరంతో పెళ్లి మాత్రం ఇష్టపడయితే చేసుకోను. అతడు జస్ట్ నా చిన్నప్పటి ఫ్రెండ్. అంతే. అంతకు మించి ఏమీ కాదు. ఇంకోమాట. ఇలా అంటున్నానని నా మనసులో ఎవరో వున్నారని అనుకోవద్దు. ప్రేమా దోమా అలాంటివేం లేవు. వుంటే ముందు చెప్పేది మా అమ్మానాన్నతోనే.'
ఎప్పుడు వచ్చాడో తెలియదు. స్పందన  చెప్పింది ఎంతవిన్నాడో తెలియదు. బాబాయి చేతులు స్పందన  తలను ఆప్యాయంగా నిమురుతున్నాయి. కళ్ళు అదేపనిగా వర్షిస్తున్నాయి.


 NOTE: Courtesy Image Ownerకామెంట్‌లు లేవు: