23, ఆగస్టు 2014, శనివారం

అసెంబ్లీలో అసలేంజరుగుతోంది? -భండారు శ్రీనివాసరావు


(24-08-2014 ఆదివారం 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 
గత కొంత కాలంగా పేపర్లు చదువుతున్నా,  పాత పేపర్లు తిరగేస్తున్నా,  టీవీ చర్చలు చూస్తున్నా  సామాన్య జనానికి  మనసులో మెదిలే ప్రశ్న ఇదే.
ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎలాంటి  రాజకీయపార్టీకయినా ఏవో కొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్థిరమైన భావజాలాలుంటాయి. కానీ ఈనాడు  దాదాపు  అన్ని రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.
ఏకంగా  శాసన సభను వేదికగా చేసుకుని ఎదుటివాళ్ళు అసభ్యపదజాలం వాడుతున్నారంటూ చేసే ఆరోపణల్లో కూడా అదేమాదిరి పదాలు దొర్లడం చూస్తుంటే  గోటితో పోయేదానికి గొడవలవరకు లాగుతున్నారన్న అభిప్రాయం సామాన్య జనాల్లో కలుగుతోంది. గొడవలకు కారణభూతులెవ్వరో తేల్చుకునే క్రమంలో మరిన్ని గొడవలకు అంకురార్పణ చేస్తున్నారు. జరిగినదానికి మొత్తం బాధ్యత అవతలవారిపై మోపుతూ అసలు బాధ్యతల నుంచి తప్పించుకునే దృశ్యం దృగ్గోచరమవుతోంది.
విమర్శలు చేసినప్పుడు, వివరణలు ఇస్తున్నప్పుడు గతాన్ని తవ్వుకోవడం వల్ల విషయం పక్క దోవపడుతూ, సభాసమయం వృధా అవుతున్న అంశాన్ని పట్టించుకోవడం మరచిపోతున్నారు. ఏది పార్లమెంటరీ పదం? ఏది కాదు? అనే విషయంలో ఇదమిత్థమైన నిబంధనలు ఉన్నప్పటికీ, సభాసాంప్రదాయాల విషయంలో లక్షలు ఖర్చు చేసి శిక్షణ ఇప్పించినప్పటికీ వాదప్రతివాదాల వేడిలో అవన్నీ ఆవిరైపోతున్నాయి. గొడవలకు మూలకారణం మీరంటే మీరని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ, చివరికి ఎవరిది తప్పో ఎవరిది వొప్పో తేల్చుకోలేని పరిస్తితిని స్వయంగా కల్పించుకుంటున్నారు. తమ వాదాలకు బలం చేకూర్చుకునే క్రమంలో వాడే భాష అదుపుతప్పి అనవసర గందరగోళాలకు కారణమవుతోందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. సభలో సాగుతున్న ప్రతిదాన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్న సంగతి మరచిపోతున్నారు.     
పార్టీల విషయం వచ్చేసరికి ఎవరికీ నిబంధనల  సంగతి  పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. నిందారోపణలు చేయడానికి, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఏ పార్టీకి  ఆ పార్టీవారు మూకుమ్మడిగా ఒక్కటై  ఒక్కపెట్టునలేచి మాట్లాడడం, అధికారపక్షం, ప్రతిపక్షం తేడాలేకుండా పోడియంలోకి దూసుకుపోయి సభాకార్యక్రమాలకు అంతరాయం కల్పించడం ఇవన్నీ గమనిస్తున్నవారికి, ముందే పేర్కొన్నట్టు అసలు అసెంబ్లీలో ఏం జరుగుతోంది అన్న అనుమానం అందరి మనసుల్లో ఇంతింతై అంతింతై అన్నట్టు పెరిగిపోతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.
గతాన్ని తవ్విపోసుకోవడం  తప్పుకాదు అన్న తరహాలో అందరూ  వ్యవహరిస్తున్నారు కాబట్టి ఒకసారి  గతంలోకి తొంగిచూస్తే, పాత రోజుల్ని పునశ్చరణ చేసుకుంటే కానవచ్చే దృశ్యం 'గతకాలము మేలు' అన్న సూక్తిని గుర్తుచేస్తుంది.
రాష్ట్రం విడిపోయిన తరువాత కొత్తగా ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ శాసన సభకు పాత అసెంబ్లీ భవనాన్ని కేటాయించారు. అయ్యదేవర కాళేశ్వర రావు వంటి స్పీకర్లు, పుచ్చలపల్లి సుందరయ్య,  తెన్నేటి విశ్వనాధం, పిల్లలమఱ్ఱి వెంకటేశ్వర్లు వంటి ప్రతిపక్ష దిగ్గజాలు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావువంటి నేతలు కలిసి కూర్చుని సమాలోచనలు జరిపిన సభామందిరం అది.  అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు.
శాసన సభలో ఏం జరిగిందో సవివరంగా అదే రోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు
పదిహేను నిమిషాలపాటు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి పత్రికల్లో పనిచేసే జర్నలిష్టులు సమీక్షలు రాసేవాళ్ళు. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది.
సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో కదలికమొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి.
ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.
ఇక శాసనసభ విషయానికి  వస్తే-
అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. 

టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో మరో అంశం చర్చనీయాంశం అవుతోంది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు. అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారడం ఇందులో దాగున్న విషాద కోణం. అయితే,  టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  ఒకే ఒక్క  అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని ప్రతిపక్షాలు కూడా అలవరచుకోవాలి. అదే సమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే భాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌధ పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి. (23-08-2014)

                                                      2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాగా చెప్పారు .ప్రజా సమస్య లని చర్చించడం మాట ఎలా వున్నా ,నిందారోపణలు చేయడానికి, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికి సభాసమయం వృధా చేయడానికి అన్ని పార్టీలు కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తోంది ."నిజమే .గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ "

srinivas చెప్పారు...

ఒకనాటి అసెంబ్లీ సమావేశాలకూ ఇప్పటి సమావేశాలకు తేడాను బాగా చెప్పారు . నాటి శాసన సభ్యులలోని హుందాతనం నేడు ఏదీ ! క్రొత్తగా ఎన్నికైనవారు కూడా నేర్చుకుంటున్నది ఎదుటివారిని ఎలా దుమ్మెత్తి పోయాలి, ఎలా ఇరుకున పెట్టాలి అనేదే