11, ఆగస్టు 2014, సోమవారం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములుఢిల్లీ నుంచి ప్రసారం అవుతున్న ఈ వార్తల్ని మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు రిలే చేస్తున్నాయి
ఉదయం  ఏడుగంటల సమయంలోనో, లేదా రాత్రి ఏడు కొడుతున్నప్పుడో ఈ కంఠస్వరం తెలుగు లోగిళ్లను పలకరిస్తూ వుండేది. వార్తల్లో విషయం కన్నా ఆయన వార్తలు చదివే పధ్ధతి, వాక్యాలను విరుస్తూ,  అక్కడక్కడ నొక్కుతూ ఉచ్చరించే తీరుకోసమే వింటున్నామనే వాళ్లు నాకు చిన్నతనంనుంచీ  తెలుసు. అయితే,  రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే కాని  ఆయన్ని తెలియని తెలుగు వాళ్లు అంటూ ఎవ్వరు వుండరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఆసేతుహిమాచలం హై పవర్ రేడియో  ట్రాన్స్ మీటర్లు వున్న ప్రతిచోటా ఆయన గొంతు వినబడేది.


(కీర్తిశేషులు తిరుమలశెట్టి శ్రీరాములు)

ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. ఎవరి స్టైల్ వారిదే. దుగ్గిరాల పూర్ణయ్య, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, జోలిపాళ్యం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి  ఇలా ఎందరో మహానుభావులు. ఎవరికి ఎవరు తీసిపోరు. వార్తలు మధ్యనుంచి విన్నా  చదువుతున్నది పలానా అని చెప్పగలిగేలా తమదయిన తరహాలో వార్తలు చదివేవాళ్ళు. (సందర్భాన్నిబట్టి కొన్ని పేర్లు మాత్రమే  ప్రస్తావించడం జరిగింది. మిగిలిన వారిని కూడా వీలువెంట గుర్తుచేయడం జరుగుతుంది. దురదృష్టం ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులో, మాగంటి వారు నిర్వహించే బ్లాగులో తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది)
శ్రీరాములు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన ఢిల్లీ నుంచి కొన్నాళ్ళు మాస్కో వెళ్ళి ఆ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్ళకుండా హైదరాబాదు బదిలీపై వచ్చారు. వార్తలు చదివే పద్దతే కాదు ఆయన ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఎప్పుడు ఫుల్ సూటులో కనబడేవారు. ఆరోజుల్లో ప్రాంతీయ వార్తా విభాగం ప్రస్తుతం క్యాంటీన్ వున్న షెడ్లలో వుండేది. అందులో రెండు విశాలమైన గదులు ఒకదానిలో న్యూస్ బులెటిన్లు తయారుచేసే సిబ్బంది, అంటే న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బులెటిన్ టైప్ చేసే వాళ్లు, రెండో గదిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లు ఆఫీసు అసిస్టెంట్లు కూర్చునే వారు.
నేను చేరినప్పుడు న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధ రావు గారు, కరస్పాండెంట్ ఎం ఎస్ ఆర్ కృష్ణా రావు గారు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ మాడపాటి సత్యవతి గారు, న్యూస్ రీడర్ గా వుంటూనే బులెటిన్లు తయారు చేసే బాధ్యతను ఐచ్చికంగా భుజాలకు ఎత్తుకున్న డి. వెంకట్రామయ్యగారు, సరే, ఆ వరసలో నేనూ. చివర్లో ఈ నేనుఎందుకంటే అసలు నేను ఆఫీసుకు వచ్చి పోయేదే చాలా తక్కువ. రిపోర్టింగ్ పని మీద రోజులో ఎక్కువ భాగం బయటే తిరిగేవాడిని.

మరో గదిలో తిరుమలశెట్టి  శ్రీరాములు గారు, ఉర్దూ న్యూస్ రీడర్ వసీం అక్తర్ కూర్చునే వారు. శ్రీరాములు గారు వార్తల టైము కాగానే  ఒక చేతిలో వెలిగించిన సిగరెట్, మరో చేతిలో న్యూస్ బులెటిన్  పట్టుకుని స్టూడియోకు బయలుదేరేవారు. మేమున్న చోటునుంచి స్టూడియోకి కొంతదూరం నడిచి వెళ్ళాలి. శ్రీరాములు గారు అడుగులో అడుగువేసుకుంటూ స్టుడియో దగ్గరికి వెళ్లేసరికి సిగరెట్ అయిపోయేది. వార్తలు చదవడానికి స్టూడియోకి వెళ్లేటప్పుడు యెంత టైం పట్టేదో తిరిగివచ్చేటప్పుడు కూడా సరిగ్గా అంతే సమయం పట్టేదని చెప్పుకునేవారు. వేసే అడుగులు కూడా లెక్కబెట్టినట్టు వుండేవి. ఒక్కోసారి ఏదయినా తాజా సమాచారం అందివ్వడానికి నేను స్టూడియో వైపు పరిగెత్తుకుంటూ వెడుతుంటే శ్రీరాములు గారు మాత్రం  నింపాదిగా నడుస్తూ  మధ్యలోనే కనిపించేవారు. ఆ కాగితం ఆయన చేతిలో పెడితే దాన్ని చదువుకుంటూ అలాగే అంతే  తాపీగా నడుస్తూ వెళ్ళేవారు కాని ఆయనలో ఏమాత్రం ఆందోళన కాని, కంగారు కాని ఏనాడు చూడలేదు. అలాగే ఒక్కోసారి చివరి నిమిషంలో మొత్తం వార్తని తిప్పిరాసి ఇచ్చినా ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా దాన్ని అనువాదం చేసేపనిలో నిమగ్నం అయ్యేవారు. అన్నట్టు చెప్పడం మరిచాను. ప్రాంతీయ వార్తా విభాగంలో మాస్టర్ బులెటిన్ ను ఇంగ్లీష్ లో తయారుచేసి ఇచ్చేవాళ్ళం. దాన్ని కాపీలు తీసి ఇస్తే తెలుగు న్యూస్ రీడర్, ఉర్దూ న్యూస్ రీడర్ తమ భాషల్లోకి అనువదించుకునేవారు.  

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇవన్నీ మన రాష్ట్రంలో ఇంటింటా ఎంతో ప్రాచుర్యం పొందిన పేర్లు. ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి రేడియో వార్తలు చదివిన వాళ్ళల్లో కొత్తపల్లి సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు కదా (ఆయన హైదరాబాదుకు మారిన తర్వాత వారితో నాకు స్వల్ప పరిచయం ఏర్పడిందిలెండి).

Saahitya Abhimaani చెప్పారు...

"...ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులో, ..... తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది..."

Due to lack of interest from any quarter, I have closed down Radio Abhimani Blog and clubbed it with my main blog Saahitya Abhimaani blog and all articles relating to Radio can be seen/read with the help of following link:

http://saahitya-abhimaani.blogspot.in/search/label/%E0%B0%B0%E0%B1%87%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B

Saahitya Abhimaani చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.