13, ఆగస్టు 2014, బుధవారం

"విత్ మి ఆర్ విత్ మై ఎన్మీ"


"వుంటే నాతొ వుండు, లేదా నా శత్రువుతో వుండు" అని అర్ధం వచ్చే ఈ మాట అన్నది ఒక అమెరికన్ ప్రెసిడెంటు. పేరు గుర్తుకు రావడం లేదు.
"వుంటే నాతో వుండు. పోతే నీ దేశం పోరా" అనే సినిమా పాట అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది.  ఏ సినిమాలోదో, ఎవరు రాశారో అదీ గుర్తులేదు.
ఇప్పుడవి గుర్తుకువచ్చిన సందర్భం మాత్రం గుర్తుంది.
ప్రతిరోజూ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల నడుమ సాగుతున్న మాటల యుద్ధం గమనిస్తూ, వాటిని గురించి విశ్లేషణ చేసే సందర్భంలో మహా విసుగు వస్తోంది. ఈ రెండు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల సముఖంలో ఇలాటి చర్చ జరిగినప్పుడు మరీ ఇబ్బందిగా వుంటోంది. ఏ విషయానికయినా బొమ్మా బొరుసూ మాదిరిగా 'మంచీ చెడూ' అనే రెండు పార్శ్వాలు వుంటాయి. పీపీయేలు, ఫీజు రీఇమ్బర్స్ మెంట్లు,  సర్వే ముచ్చట్లు ఏది తీసుకున్నాఈ విషయంలో  'మాదే రైటు' అనే మొండి ధోరణి తప్ప ఒక అంగుళం దిగివచ్చి మంచేదో చెడేదో మాట్లాడుకుందాం అన్న ధోరణి కానరావడం లేదు. ఏ విధానం అయినా, ఏ ప్రణాళిక అయినా నూటికి నూరు శాతం కరక్టుగా వుండే అవకాశం  వుండదు. మొత్తం మీద బాగున్నా ఏవో కొన్ని లోటుపాట్లు వుండడం సహజం. కానీ, ఒక్క చిన్న విషయంలో  కూడా అవతలవాళ్ళు చెప్పింది అంగీకరించడానికి ఇవతలవాళ్ళు సిద్ధంగా వుండరు.  వాళ్ల నాయకుల విధానాలను సమర్ధించుకుంటూ పోవాలనే ఏకైక లక్ష్యం ఒక్కటే కనబడుతుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇంత గుడ్డిగా సమర్ధించుకుంటూ పోవడం ఏమేరకు మేలు చేస్తుందో అర్ధం కావడం లేదు. పార్టీలతో ప్రమేయం లేని వ్యక్తులు కూడా వుంటారని వాళ్లు మరచిపోతున్నారు. చాలా దురదృష్టకరం.


అనేక విషయాల్లో విబెదిస్తున్న అటూ ఇటూ నాయకుల వరస ఒక విషయంలో మాత్రం ఒకే విధంగా వుంది.
'మధ్యే మార్గం వద్దు. వుంటే నాతో వుండు. లేదా శత్రువుతో వుండు'
మరి నాయకుల్నిబట్టే వారి అనుచరులు.
దీనికి ముక్తాయింపు అన్నట్టుగా పక్కన  టీవీలో తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతుంటే వారి పార్టీ సభ్యులు గుడ్డిగా బల్లలు చరుస్తున్న దృశ్యం కనబడుతోంది.      

NOTE: Courtesy Image Owner 

7 కామెంట్‌లు:

Kishore చెప్పారు...

శ్రీనివాస రావు గారికి నమస్కారములు.

ఈ రోజు నేను చూసిన ఈ బ్లాగు లో ఇచ్చిన చిత్రాలలోని రేడియో ప్రముఖులు చాలా మంది నాకు తెలియదు. ఈ పోస్ట్ మీకు ఆసక్తికరమని భావించి లింక్ ఇస్తున్నాను.

http://sobhanaachala.blogspot.in/2014/08/blog-post_12.html

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@కిశోర్ - ధన్యవాదాలు

Jai Gottimukkala చెప్పారు...

సార్ పనికొచ్చే విషయాలపై విషయ పరిజ్ఞానం ఉన్న నిష్ణాతుల మధ్య సామరస్య చర్చ ప్రసారం చేస్తే ఇంకేమన్నా ఉందా, కొంపలు అంటుకుపోతాయి. వివాదం (కావాలంటే మనమే పుట్టించి) భయంకరమయిన వైరుధ్యాలు ఉన్న వ్యక్తులను అందునా గట్టిగా అరిచి ఇతరుల నోరు నొక్కించగలిగిన ఘనాపాటులను పిలిపిస్తే కేకలు, పెడబొబ్బలు, హుంకారాలు, ఘీంకారాలు తద్వారా రేటింగుల పండగే పండగ.

పుట్టగొడుగుల్లా డజన్ల కొద్దీ చానెళ్ళు, వచ్చిన వారిని ఎలా రెచ్చగొట్టాలో తప్ప ఇంకే విషయంలో అనుభవం లేని ఆన్కర్లు, కుళ్ళిపోయిన ప్రసార ప్రమాణాలు ఉన్న ఈ రోజులలో మీరు చెబుతున్నవన్నీ రేటింగు దేవత పూజకు నైవేద్యాలే.

ఉ. ఫీసుల రాద్దాంతం తీసుకుంటే కాలేజీలలో పూర్తిగా అడుగంటిన ప్రమాణాలు, విద్యా వ్యాపారస్తుల లీలలు, ఉద్యోగానికి పనికి రాని డిగ్రీలనబడే చిత్తు కాగితాలు అన్నవి సమస్యకు మూలాలు. ఉపాధ్యాయులను పిలిచి వీటిపై చర్చించే ధైర్యం ఎవరయినా చేస్తారా? వామ్మో ఉద్యోగం ఊడదూ!

మీ అపార అనుభవం దృష్ట్యా ఇది మీకు తెలియంది కాదు. కావాలంటే "ఇలాంటి చెత్త చర్చలకు నేను రాను" అని బెదిరించి చూడండి.

అజ్ఞాత చెప్పారు...

గొట్టిముక్కల : ఇంతకీ తమరు రాసింది తమ కామెంట్స్, నమస్తే తెలంగాణా పేపర్, T న్యూస్ గురించే కదా. అయితే కరెక్టే బూతులు తిట్టటం తప్ప అసలు సంగతి వినేదెవరు.

hari.S.babu చెప్పారు...

"వుంటే నాతో వుండు. పోతే నీ దేశం పోరా" అనే సినిమా పాట అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది. ఏ సినిమాలోదో, ఎవరు రాశారో అదీ గుర్తులేదు.
>>
ప్రేమ నగర్?!

Jai Gottimukkala చెప్పారు...

@హరిబాబు: "ఉంటె ఈ ఊర్లో ఉండు, పొతే నీ దేశం పోరా" అనే ప్రేమనగర్ సినిమా పాట రాసింది ఆత్రేయ అనుకుంటా.

hari.S.babu చెప్పారు...

@jai
అవును, నేను పుట్టాను-- ఇంకా సూపర్!అసలు ఆ సినిమాలో పాటలన్నీ సూపరే!ఆ సినిమా చూఒసిన రోజులు గతజన్మ జ్ఞాపకాల్లా వున్నాయి.
క్లబ్ సాంగ్స్ లోనూ ఐతెం సాంగ్స్ లోనూ జానపదాన్నీ వేదాంతాన్నీ కలిపేసాడు కవి?!