3, ఆగస్టు 2014, ఆదివారం

మనసు చేసే అల్లరి


మనసు పదిలం తమ్ముడూ! అన్నాడో కవి.
ఎందుకంటే మనసు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. లేని దాన్ని సృష్టిస్తుంది. వున్నదానిని కానరాకుండా చేస్తుంది. మనసు చేసే మాయనుంచి బయటపడలేకపోతే ఇక ఆ మనిషి గతి ఇంతే!
చైనా లో ఓ నీతి కధ వుంది.
ఓ వయసు మళ్ళిన పెద్దమనిషికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఇంటి పక్క మడుగులో వున్న కప్పలు రాత్రి వేళల్లో చేసే గోల.


మండూక సంతానం చేసే బెకబెకల శబ్దాలు ఆ పెద్దమనిషికి చిన్నపాటి కునుకు కూడా పట్టకుండా చేస్తున్నాయి. వాటి బెడద వొదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఆసామీ పొరుగున బస్తీలో హోటల్ నడుపుతున్న మరో పెద్ద మనిషిని సంప్రదించాడు.
నా దగ్గర ఓ లక్ష కప్పలు వున్నాయి. మీరు కొంటానంటే రోజూ ఓ వేయి కప్పలయినా సప్లయి చేస్తాను
బస్తీ పెద్దమనిషి సంతోషంతో కప్పలా గెంతబోయి వెంటనే తమాయించుకుని, రోజూ ఓ వెయ్యి చొప్పున  కొనడానికి  పల్లెటూరి పెద్దమనిషితో కప్పల బేరం కుదుర్చుకున్నాడు.
వూరికెళ్లిన పెద్దమనిషి మర్నాడే తిరిగొచ్చాడు. ఆయన చేతిలో రెండే రెండు కప్పలు వున్నాయి.
మిగిలినవేవి?’ అని బస్తీ మనిషి అడిగాడు.
రాత్రిళ్ళు  అవి చేసే బెకబెకల ధ్వనులు విని ఆ మడుగులో కనీసం ఓ లక్ష కప్పలయినా వుంటాయని భ్రమ పడ్డాను. తీరా చూస్తే అంత గోల చేస్తున్నవి ఈ రెండే! పల్లెటూరి మనిషి బదులు చెప్పాడు.
అంటే ఏమిటన్న మాట!
చుట్టూ జగమంతా నిద్రిస్తున్నప్పుడు, వొంటరితనం వేధిస్తున్నప్పుడు మనసు చేసే అల్లరి ఇది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. 


(ఆంగ్ల కధనానికి అనువాదం - Courtesy Image Owner)

కామెంట్‌లు లేవు: