12, మార్చి 2021, శుక్రవారం

రాయాలంటే భయమేస్తోంది – భండారు శ్రీనివాసరావు

 ‘రాయాలనే వుంది. కానీ భయమేస్తోంది అన్నాడు ఓ ముప్పయ్ అయిదేళ్లకు పైగా పరిచయం ఉన్న ఓ సీనియర్ పాత్రికేయ  మిత్రుడు, ‘ఖాళీగానే  వున్నావ్, ఏదైనా రాయొచ్చు కదా’ అనే నా ప్రశ్నకు జవాబుగా.

ప్రముఖ ఆంగ్ల పత్రికలో విలేకరిగా పాత్రికేయ జీవితం ప్రారంభించి అదే పత్రికలో దాదాపు నలభయ్ ఏళ్ళు పనిచేసి ఉన్నత స్థానానికి ఎదిగిన ప్రస్థానం ఆయనది. రాజకీయ నాయకులతో అంటకాగిన జీవితం. ముఖ్యమంత్రులను, మంత్రులను నేరుగా కలిసి, లేదా ఫోనుచేసి  మాట్లాడగలిగిన అవకాశం కలిగిన వృత్తి. ఆయన రాసిన వార్తలకు రాజకీయ నాయకులు స్పందించి నేరుగా ఆ పత్రిక ఆఫీసుకే వెళ్లి ఆయన్ని కలిసి తమ గోడు విన్నవించుకున్న సందర్భాలు అనేకం.   

‘సోషల్ మీడియాలో నువ్వూ మరికొందరు మితృలు రాస్తున్న జ్ఞాపకాలు ఆసక్తిగా చదువుతుంటాను. నాకూ రాయాలని అనిపిస్తుంది. కానీ మన రోజుల్లో ఏదైనా వార్త కానీ వ్యాసం కానీ రాస్తే  దాన్ని సానుకూలంగా తీసుకునే వారు. లేదా ఓ ఖండన ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం ప్రచురించేవాళ్ళం. జర్నలిజంలో, రాజకీయాల్లో అలాంటి విలువలు ఉండేవి. ఇప్పుడు నాయకులే కాదు, వారి అనుచరులు, అభిమానులు కూడా చెలరేగిపోయి ఉచ్చనీచాలు లేకుండా కామెంట్లు పెడుతున్నారు. వారికి మనం రాసిన దాంతో నిమిత్తం లేదు. మొత్తం వ్యాసంలో వారి అభిమాన నాయకుడు లేదా పార్టీకి ఎక్కడైనా వ్యతిరేకంగా రాశామా అన్నదే వారికి ముఖ్యం.  అలా వారికి అనిపిస్తే చాలు, కాగితం మీద పెట్టడానికి వీలులేని వికృత భాషలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా అని మన బంగారం మంచిదని నేను అనడం లేదు. జర్నలిజం అనేది మార్కెట్లో దొరికే  మిగిలిన వస్తువుల్లో ఒకటిగా మారిపోయింది. ఏ వార్త వెనుక ఏ రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయో సామాన్య పాఠకుడికి కూడా ఇట్టే అర్ధం అవుతోంది. మీడియా యాజమాన్యాలే రాజకీయ రంగులు నిస్సిగ్గుగా పూసుకుని తిరుగుతున్నప్పుడు ఇక మనం  చేయగలిగింది ఏముంది?

మిత్రుడి పలుకుల్లో నిర్వేదంతో కూడిన నిజం ధ్వనించింది.

‘సరే! ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే నువ్వు తప్పకుండా ఇదంతా ఓ పోస్టు రూపంలో రాస్తావనే నమ్మకం నాకుంది. ఆ విధంగా నా మనసులోని భారం కొంతైనా తగ్గుతుందేమో

(12-03-2021)

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మాకేమో అసలు టీవీ ఛానెళ్ళ వార్తల కార్యక్రమాలు చూడాలంటేనే భయమేస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

నిజం చెప్తున్నా , నేను 25 సంవత్సరాల క్రితం , కేవలం ఒక పేపర్ మాత్రమే చదివేవాడిని ( చదవాల్సి వచ్చేది , వేరేవి అంత బాగుండేవి కాదు, మా ఊరు బార్బర్ షాప్ వాడు ఈనాడు అభిమాని ) . ఆ పేపర్ ఒక పార్టీ ని , నాయకుడికి విపరీతమైన పాదసేవ చేసేది , పైకి ఎత్తి మోసేది . నాకు ఆ వయసు లో ( 12 లేక 13 ) అవి తెలియదు . ఆ నాయకుడి నవ తరానికి ప్రతినిధి అని , దేశం లో అలాంటి ముఖ్యమంత్రి లేడని , అసలు అవినీతి , మనుషులని మేనేజ్ చేయడం అనేవి అయన బుర్రలో ఏ కోశానా ఉండవని , ఈయనే మనకి కలకాలం ఉండాలని అన్న ఆలోచనలతో ఉండేవాడిని . ఇంచు మించు నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేవరకు అవే ఉద్దేశ్యాలు , కాకపోతే కొంచెం కొంచెం ఆ ఆలోచనలలో గాఢత తగ్గుతూ ఉండేది , దానికి కారణం ఊరు వదిలి బయటకి రావడం , వేరే పత్రికలూ కూడా చదవడం , మనకి నచ్చని ఆలోచనలు కూడా వినడం , ఇలా ..

ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే , ఒక మనిషి ఎలా influence అవుతాడు అని ఆలోచించుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది . నేను కూడా ఒకప్పుడు ఇలానే అయ్యాను అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా ఉంటుంది . అదే సమయం లో , నాలో మార్పు నాకు గర్వంగా ఉంటుంది . ఇప్పుడు నాకేదో నిజం తెలిసిపోయి ఆ నాయకుడిని ద్వేషించడం లేదు . వేరే నాయకుడిని ప్రేమించడం లేదు . కానీ పత్రికలపై నమ్మకం పోయింది . మన రాష్ట్రాలకి సంబంధించి న ఏ న్యూస్ కూడా నమ్మాల్సిన అవసరం లేదు , ఏ న్యూస్ వెనక ఏ ప్రయోజనం ఉందొ , అది ఏ విత్తనామో ? భవిష్యత్తు లో ఏ మర్రిచెట్టు అవుతుందో ? ఎవరికి తెలియదు . కాకపోతే ఇంత చిన్న విషయం తెలియడానికి అంత ఎక్కువ టైం పట్టింది నాకు అన్న బాధ తప్పితే .

సోషల్ మీడియా లో చదువుకున్న మూర్ఖులు కన్నా , పల్లెటూళ్లలో చదువు లేని జనం ఇంకా బాగా ఆలోచిస్తున్నారు . వాళ్ళు చాల ప్రాక్టికల్ గ ఉంటారు , డబ్బులు చేతిలో పెట్టు , ఓటు అడుగు . ఎందుకంటే ఆ నాయకుడు ప్రజా సేవ కోసం ఓటు కి డబ్బులు ఇస్తున్నాడా ? మాకు తెలియదా ? అని సింపుల్ గా తేల్చేస్తారు . ఇద్దరు కలిసి కూర్చుని మా నాయకుడు ఎంత సొమ్ము నొక్కేసాడో నిర్లజ్జగా మాట్లాడుకుంటారు . ఈ సోషల్ మీడియా లో చదువుకున్న జనం ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియదు .

మీ పోస్ట్ కి సంబంధం లేకపోవచ్చు . కానీ , ఈ ఫేస్బుక్ లో, వాట్సాప్ గ్రూపు ల్లో , జనం కొట్లాట లు చూస్తుంటే బాధేస్తుంది

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: పోస్టుకు సంబంధం వున్నా లేకపోయినా నేను రాసిన దానిని మించి విషయాలు తెలియచేసారు. చాలా సంతోషం