19, మార్చి 2021, శుక్రవారం

మార్పు మంచిదే కాదు, అవసరం కూడా – భండారు శ్రీనివాసరావు

రోజులు మారుతున్నాయి. మార్పులకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి.
స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో దేశంలో జనాభాతో పోలిస్తే ఓనమాలు వచ్చిన వారి సంఖ్య నామమాత్రం. ఇక పట్టభద్రుల సంగతి చెప్పాల్సిన పనేమి వుంది.
చట్ట సభల్లో చదువుకున్నవారికి ప్రవేశం కల్పించడం కోసం ఆ రోజుల్లో పట్టభద్రుల నియోజక వర్గాలు ఏర్పాటు చేశారు.
మరి ఇప్ప్డుడో! పరిస్థితి పూర్తిగా మారింది. పట్టా పుచ్చుకున్నవారి సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరుతోంది. అంటే ఒక్కో పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లు ఒక పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లని మించి పోయినా ఆశ్చర్యం లేదు. దీనికి తోడు పోటీకి దిగేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొన్నేళ్ళ తర్వాత ప్రచారానికి ఇచ్చిన గడువుకంటే, ఓట్ల లెక్కింపుకు ఎక్కువ వ్యవధానం పట్టే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. రెండు మూడు రోజుల పాటు ప్రభుత్వ సిబ్బంది నిద్రాహారాలు, అసలు విధులు వదిలి ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వార్తలు వింటుంటే మన ప్రజాస్వామ్యం ఇంత ఖరీదయిందా అనిపిస్తుంది.
కాబట్టి ఈ పట్టభద్రుల నియోజకవర్గాలను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికో, ఇంకా పై చదువులకో పెంచాలి. లేదా దేశంలో అక్షరాస్యత పెరిగిన దృష్ట్యా వీటిని రద్దు చేయాలి.
(19-03-2021)

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

>> ఈ పట్టభద్రుల నియోజకవర్గాలను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికో, ఇంకా పై చదువులకో పెంచాలి. లేదా దేశంలో అక్షరాస్యత పెరిగిన దృష్ట్యా వీటిని రద్దు చేయాలి.
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అసలు MLC లు అంటేనే పెద్దల సభ సభ్యులు అనుకుంటాం. అందులోనూ పట్టభద్రుల నియోజకవర్గం అంటే ఒక స్ధాయి ప్రవర్తన, మాటతీరు ఉంటాయని ఆశిస్తాం. కానీ ఆ పదవులను కూడా రాజకీయ పార్టీలు తమ హస్తగతం చేసేసుకుని రాజకీయ సభ లాగా తయారుచేసి పెట్టారు. శాసన మండలిలో ప్రవర్తనకు శాసన సభ లో ప్రవర్తన కు పెద్దగా తేడా కనబడటం లేదు. అవే అరుపులు, కేకలు, నిందారోపణలు.
కాబట్టి ఏ స్థాయికి పెంచినా ఇలాగే ఉంటుందేమో లెండి.