1, మార్చి 2021, సోమవారం

ఇది నా జీవితం. కధకాదు.

 


అంచేత సాఫీగా ఎలాంటి ముడులు, ఎత్తుగడలు లేకుండా చెబుతాను.

అసలు ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకోవాలి. కాగితం మీద పెట్టేవి కావనే స్పృహ లేనివాడిని కాదు. కానీ  పంచుకునే మనిషి మాయమై పోయింది.  మంచీ చెడూ చెప్పే  తోడు లేకుండా పోయింది. పిల్లలు, కోడళ్ళ పుణ్యమా అని కరోనా కాలంలో కూడా జీవితం సాఫీగా గడిచిపోతోంది. దేనికీ లోటు లేదు, ఎవరూ తీర్చలేని ఆ ఒక్క లోటుతప్ప. ఆదివారం సామాను సదిరే కార్యక్రమంలో ఓ కపిలకట్ట బయట పడింది. అందులో ఏముంటాయో నాకు తెలుసు కాని మా అబ్బాయికి, కోడలికి తెలియదు. దాన్ని నేను పదిలంగా తీసుకుని భద్రపరచుకున్నాను. మా ఆవిడకు అదంటే ప్రాణ సమానం. మేము మాస్కో వెళ్ళినా మాతోటే వచ్చింది. తిరిగి మాతోటే ఇండియా వచ్చింది. హైదరాబాదులో ఎన్నో ఇళ్ళు మారినా అది మాత్రం తను మరచిపోకుండా వెంట తెచ్చుకునేది. అందులో బంగారం ఏమీ లేదు. బంగారం లాంటి ఉత్తరాలు ఉన్నాయి. మా పెళ్ళికి పూర్వం, యాభయ్ మూడేళ్ల క్రితం, రెండు మూడేళ్ళ పాటు మా మధ్య ఉత్తరాయణం నడిచింది. నేను రాసినవన్నీ ఆవిడ దగ్గర భద్రంగా వున్నాయి. తను రాసిన వాటిలో కొన్నే నా దగ్గర మిగిలాయి.

మిమ్మల్ని ఇలాంటి వ్యక్తిగత విషయాలతో విసిగించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రేమించిన ఆడదాని హృదయం ఎంత గొప్పదో, అది ఎంతటి ఉదాత్త ప్రేమో చెప్పడం కోసమే ఈ ప్రయత్నం.

ఆమె రాసిన వాటిల్లో అణువణువూ ప్రేమమయం. నా ఉత్తరాలు అన్నీ డాబుదర్పం. పెళ్ళయిన తర్వాత ఎలా మెలగాలి, అత్తగారు, ఆడబిడ్డలతో ఎలా వుండాలి ఇలా అన్నమాట. నిజానికి అలా నిర్బంధించే అధికారం నాకేమి వుంది. ఆమె నన్ను ప్రేమిస్తోంది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అంతే! అలాంటప్పుడు నా ఈ పేను పెత్తనం ఏమిటి? అవి చదివి ఎంత నొచ్చుకుని వుంటుంది. అయినా నన్ను పెళ్ళాడింది అంటే అది ఆమె గొప్పతనమే. ఇప్పుడు తలచుకుంటే చాలా చిన్నతనం అనిపిస్తుంది.

నన్ను మన్నించు! నన్ను క్షమించు ! అని ఎంతగా గొంతు చించుకున్నా నా మాటలు వినబడనంత దూరానికి వెళ్ళిపోయింది.



1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మన్నించమని అడగటం అవతలి మనిషి జీవితకాలంలోనే చెయ్యాలని, తర్వాత వగచి ఉపయోగం ఉండదనీ తెలిసినవాళ్ళకు నేనూ చెబుతుంటాను.