17, మార్చి 2021, బుధవారం

కాశీపట్నం చూడర బాబూ! – భండారు శ్రీనివాసరావు

(తమిళనాడు ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోలు చూస్తుంటే)


మా చిన్నప్పుడు వూళ్ళల్లోకి చుక్కాణీ పెట్టెవాడు వచ్చేవాడు. అతడు కనబడగానే చిన్నపిల్లలం అందరం అతడి చుట్టూ మూగేవాళ్ళం. ఓ అర్ధణా ఇస్తే ఆ పెట్టెకు ఉన్న కంతలో నుంచి కదిలే బొమ్మలు కనబడేవి. ఇదిగో కాశీ, అదిగో ప్రయాగ అని చూపిస్తుండేవాడు. నిజంగా కాశీ చూసినట్టే మేము మురిసిపోయేవాళ్ళం.
ఇప్పుడు ఈ చుక్కాణీ పెట్టె రూపం మార్చుకుని ఎన్నికల ముందు మేనిఫెస్టోల రూపంలో జనాలను ఆకట్టుకుంటోంది. ఆ విష్ణుమాయలో పడిన వాళ్లకి ఏది నిజమో ఏది కాదో తెలియని అయోమయం ఆవరిస్తోంది.
“సుమతీ శతకాలు, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో వోట్లు రాల్చవు”
ఇది నేటి రాజకీయులు వొంటికి పట్టించుకున్న నగ్న సత్యం. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపులేదు. అందుకే వోటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు వుండవు. వోటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనుకడుగు వేసే పార్టీ అంటూ కలికానికి కూడా దొరకదు. అందుకే నరం లేని నాలుక, మండు వేసవిలోనైనా సరే వారి చేత చల్లని హామీల వర్షం కురిపిస్తుంది. వణికించే చలికాలంలో వెచ్చటి దుప్పట్ల వాగ్దానాలతో మరిపిస్తుంది. కలర్ టీవీలు, లాప్ టాపులు, నెలసరి భత్యాలు, నగదు బదిలీలు, భూసంతర్పణలు, పట్టు చీరెలు, పసుపు కుంకాలు, ఉచిత వైద్యాలు, ఆల్ ఫ్రీ చదువులు, బంగారు తల్లులు, కరెంటు మీది, బిల్లు మాది తరహా హామీలు, ఒకటా రెండా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కనుక్కున్న సంక్షేమ పధకాలతో దట్టించి వోటర్లకు అరచేతిలో స్వర్గం చూపించే ఎన్నికల ప్రణాళికలు, అంతులేని వాగ్దానాలు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజలనుంచి ముక్కు పిండి వసూలు చేసి నింపిన ఖజానా డబ్బులతో ఇలా ఈ చేత్తో ఇచ్చి అలా ఆ చేత్తో వోట్లు రాబట్టి అధికార పీఠం కైవసం చేసుకోవాలని చూసే రాజకీయ పార్టీల ‘క్విడ్ ప్రోఖో’ ఎత్తులకు చెక్ చెప్పడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.
వాగ్దానకర్ణుల మాదిరిగా ఎడాపెడా ప్రకటిస్తున్న తాయిలాలను ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్ళు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీ లేదు, ఎదుటి వాడిని తిననిచ్చిందీ లేదు.

మరి వీటికి ముకుతాడు వేయడం ఎలా! ఇలా:
ఆకాశమే హద్దుగా ఎన్ని వాగ్దానాలు అయినా చేయండి. అభ్యంతరం లేదు. కాకపొతే అధికారానికి వచ్చిన తర్వాత ఒకటి రెండేళ్ళు మీ పార్టీల సొంత నిధులతో వాటిని అమలుచేయండి. అంతేకానీ ప్రజలు పన్నులు కట్టి నింపిన ప్రభుత్వ ఖజానా నుంచి కాదు. అప్పుడు కానీ మీ చిత్తశుద్ధి ఏమిటన్నది రుజువవుతుంది.

తోకటపా: ‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం చంపుకుంటారు.’ – విల్ రోగర్స్

కామెంట్‌లు లేవు: