19, మార్చి 2021, శుక్రవారం

డాక్టర్ ఊట్ల బాలాజీ

 దూరదర్సన్ లో రిటైర్ అయిన తర్వాత హెచ్.ఎం.ఆర్.ఐ. (104) అనే ఒక Not for  Profit Organization తో కలిసి పనిచేశాను. దానికి సీఈఓ ఈ బాలాజీ. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా,  సత్యం వంటి సంస్థల్లో సీనియర్  మేనేజ్ మెంట్ పదవుల్లో పనిచేసిన డాక్టర్ బాలాజీ, కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారని అనుకునేవాడిని. కానీ ఆయనకు ఆంగ్లంలో ఎంత పట్టు వుందో తెలుగులో అంతకంటే చక్కటి ప్రావీణ్యం వుంది.  అంతేకాదు, సందర్భానికి తగ్గట్టు ఆశువుగా  అనేక సంస్కృత శ్లోకాలను అనర్ఘలంగా ఉటంకిస్తూ వుండేవారు.

వారితో నాకు మరో రెండు బాదరాయణ సంబంధాలు వున్నాయి. ఒకటి వారి నాన్నగారు. నాకంటే చాలా చాలా ముందు రేడియోలో పనిచేశారు. మరోటి మా ఆవిడ బాలాజీ గారి భార్యకు అభిమాని. లోగడ జెమినీలో అనేక సీరియళ్లు వచ్చేవి. ఇప్పుడూ వస్తున్నాయి కానీ మా ఇంట్లో వాటిని చూసే మనిషి లేదు. నాకు పేర్లు సరిగా తెలియదు కానీ చక్రవాకం, మొగలిరేకులు  మొదలైన సీరియళ్ళకు బాలాజీగారి  భార్య శ్రీమతి బిందు నాయుడు  కధ, మాటలు రాసేవారు. ఆ విధంగా బిందు నాయుడు గారు, మా ఆవిడ నడుమ  మంచి అన్యోన్యం ఏర్పడింది.

సరే! ఓ పదేళ్లపాటు నిత్య సాయంకాల సమావేశాల తరువాత ఈ మధ్య కోవిడ్ పుణ్యమా అని పరస్పరం కలుసుకోవడం తగ్గింది. ఈరోజు ఉదయం ఫోన్ చేసి ‘ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తున్నాము, మా అమ్మాయి పెళ్లి కుదిరింది’ అంటూ ఓ శుభవార్త చెప్పారు. పెళ్లి బెంగళూరులో. ఎల్లుండే  ప్రయాణం. అంత హడావిడిలోనూ వచ్చారు. కాసేపు కూర్చుని వెళ్ళారు.

వెళ్ళే సమయంలో నిలబడి బూట్లు వేసుకుంటూ వుంటే ఆ సోఫా మీద కూర్చుని వేసుకోండి అన్నాను.

వెంటనే ఆయన తనదైన శైలిలో ఓ డాక్టరు గారన్న మాట గుర్తు చేశారు. ఆ డాక్టరు గారు చాలా పెద్ద సర్జన్.

‘ఎప్పుడైతే నేను ఒంటి కాలు మీద నిలబడి షూస్ వేసుకోలేనో ఆనాటి నుంచి నేను సర్జరీలు చేయడం మానేస్తాను అనేవారుట  ఆ డాక్టరు గారు.

నిజమే అనిపించింది.(19-03-2021)          

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

>> లోగడ జెమినీలో అనేక సీరియళ్లు వచ్చేవి. ఇప్పుడూ వస్తున్నాయి కానీ మా ఇంట్లో వాటిని చూసే మనిషి లేదు.
తెలుగుసీరియళ్ళ మోతలేని ఇళ్ళు చాలా తక్కువ కదండీ. ఒక మహాభినిష్క్రమణం తరువాత ఇంట్లో ప్రతివస్తువూ, ప్రతి చిన్న విషయమూ మనకు గుర్తుచేసేదే అవుతుంది.ఆవిడ అదృష్టవంతురాలు.